
- వెలుగులు పంచుతున్న విద్యుత్ ప్లాంట్లు
- 2797.5 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం
- 3 నెలల్లో ఉత్పత్తిలోకి 1600 మెగావాట్ల టీఎస్టీపీపీ
జ్యోతినగర్, మార్చి 27 : దేశానికి వెండి వెలుగులు పంచుతున్న రామగుండం విద్యుత్ క్షేత్రంగా నిలుస్తున్నది. ఎన్టీపీసీ, టీఎస్ జెన్కో, కేశోరాం సిమెంట్స్ సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ పవర్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ప్రస్తుతం 2797.5 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉండగా, రానున్న కొన్ని నెలల్లో మరో 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఉత్పత్తి దశలోకి రానున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగాలకు చెందిన థర్మల్, సౌరవిద్యుత్ కేంద్రాలు సమర్థవంతంగా ఉత్పత్తి చేస్తూ ప్రజలు, పరిశ్రమల విద్యుత్ అవసరాలను తీరుస్తున్నాయి.
సింగరేణి సిరులతో విద్యుత్ ఉత్పాదన
రామగుండం ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్న నేపథ్యంలో ఐదున్నర దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. 1960వ దశకంలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీఎస్ఈబీ ఆధ్వర్యంలో బొగ్గు ఆధారిత(థర్మల్) విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పారు. తరువాత 62.5 మెగావాట్ల బి థర్మల్ వపర్ ప్రాజెక్టును నెలకొల్పారు. ఆ తరువాత 70వ దశకంలో 18 మెగావాట్ల సింగరేణి థర్మల్ కేంద్రాన్ని స్థాపించారు. అయితే జీవితకాలం ముగియడంతో జెన్కోకు చెందిన ఎ పవర్ హౌస్‌ను 1994లో, సింగరేణి విద్యుత్ కేంద్రాన్ని ఐదేళ్ల క్రితం మూసివేశారు. జాతీయ స్థాయిలో ఎన్టీపీసీని స్థాపించిన 3 సంవత్సరాలకు 1978లో రామగుండంలో 2600 మెగావాట్ల భారీ ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రానికి పునాదిరాయి పడింది. మొదటి రెండు దశల్లో 200 మెగావాట్ల 3 యూనిట్లు, రెండో ఫేజ్‌లో 500 మెగావాట్ల 3 యూనిట్లను ఎన్టీపీసీ నెలకొల్పింది. స్టేజ్ 3 కింద మరో 500మెగావాట్ల యూనిట్ స్థాపనతో రావగుండం ఎన్టీపీసీ 2600 మెగావాట్లకు విస్తరించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో దేశంలోనే అతి పెద్దదిగా, దేశంలో 4వ అతి పెద్ద విద్యుత్ కేంద్రంగా నిలుస్తున్నది.
రిన్యూవబుల్ ఎనర్జీ దిశగా..
అలాగే మారిన వాతావరణ పరిసితుల నేపథ్యంలో రిన్యూవబుల్ ఎనర్జీ వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాయి. దీంతో తొలిసారిగా రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 2014లో 10మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పారు. తరువాత 2020లో ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో ఆ సంస్థ 100 మెగావ్లాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజక్టులో ప్రస్తుతం 80మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుండగా 2 నెలల్లో మిగతా 20 మెగావాట్లకు విస్తరించనుంది. ఇదే రిజర్వాయర్‌లో మరో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఎన్టీపీసీ ప్రతిపాదనలు చేస్తోంది.
రాష్ట్ర విభజనతో టీఎస్టీపీపీ ఏర్పాటు..
తెలంగాణ ఏర్పాటైన తరువాత ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 4000 మెగావాట్ల ప్రాజెక్టును ఎన్టీపీసీ నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రామగుండంలో బొగ్గు, స్థలం, నీరు అందుబాటులో ఉండడంతో ఎన్టీపీసీ కొత్త ప్రాజెక్టు నెలకొల్పేందుకు నిర్ణయించింది. 2017లో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పేరుతో మొదటి దశకు అంకురార్పణ జరిగింది. స్టేజ్ 1లో రెండు 800 మెగావాట్లతో 1600 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతం 90 శాతంకు పైగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 800 మెగావాట్ల మొదటి యూనిట్‌ను వచ్చే మే, జులైలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి. టీఎస్టీపీపీ స్టేజ్ 2లో నిర్మించనున్న 2400 మెగావాట్ల ప్రాజెక్టుకు ఇప్పటికే ఎన్టీపీసీ బోర్డు అంగీకరించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ కుదిరితే స్టేజ్ 2 నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద పవర్‌హబ్..
ప్రతిపాదనలు, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులు అన్ని పూర్తయితే రామగుండం ప్రపంచంలోనే అతిపెద్ద పవర్‌హబ్‌గా అవతరించే అవకాశముంది. రానున్న కాలంలో 2400 మెగావాట్ల టీఎస్టీపీపీ రెండో దశ, 100 మెగావాట్ల ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ పూర్తయితే మొత్తం 6,887.5 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీతో ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతంగా రామగుండం నిలువనున్నది.