చంద్రబాబు, పవన్ విశాల దృక్పధంతో ఆలోచించాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-04-07T18:17:46+05:30 IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజలు భరించలేని విధంగా భారాలు మోపుతున్నాయని రామకృష్ణ విమర్శించారు.

చంద్రబాబు, పవన్ విశాల దృక్పధంతో ఆలోచించాలి: రామకృష్ణ

విజయవాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజలు భరించలేని విధంగా భారాలు మోపుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 16 రోజుల వ్యవధిలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పోతున్నారని మండిపడ్డారు. మోదీ ప్రధానిగా వచ్చే ముందు గ్యాస్ 460 రూపాయలు, పెట్రోల్ టీటరు 64 రుపాయలు ఉండేవన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సిమెంట్, పెట్రోల్, పన్నులు, విద్యుత్ చార్జీలు అన్ని పెంచుతున్నారని ఆరోపించారు. ట్రూ అప్ చార్జీలు పేరుతో మళ్ళీ భారం మోపేందుకు సిద్ధమవుతున్నారని, ఎన్నికల ముందు బాదుడే బాదుడు అన్నారు, ఇసుక, సిమెంట్, మద్యం అన్నిటిపై జె టాక్స్ వేస్తున్నారని, ఆదానికి లబ్ది చేకూర్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. బాదుడుకి వ్యతిరేకంగా ఈనెల 11, 12 తేదీల్లో అన్ని సచివాలయాల వద్ద  నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాల దృక్పధంతో ఆలోచించాలని కోరారు. కేంద్రం ధరలు పెంచుతుంటే రాష్ట్రం మాత్రమే పెంచుతున్నట్లు మాట్లాడటం సరికాదన్నారు.


ఒంటె అందాన్ని గాడిద పొగిడినట్లు విజయసాయి రెడ్డి పార్లమెంటులో  మోదీని పొగుడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. వైసీపీ సిగ్గులేకుండా బీజేపీ చేసే ప్రతి పనికి మద్దతు తెలుపుతోందని, పెళ్లి చేసుకోకపోయినా బీజేపీ, వైసీపీ కలిసే కాపురం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గుంటలో పడతారని సూచించారు. మంత్రి వర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమన్నారు. మంత్రులను నిమిత్తమాత్రులను చేసి, వారు ఉన్నారా? లేదా? అన్నట్టు రాజీనామాలు చేయమని చెప్పారని, పైకి కనిపించకపోయినా మంత్రులు లోపల ఏడుస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంత దారుణంగా చూసిన  సిఎంను ఇప్పటివరకు చూడలేదన్నారు. కొత్తగా వచ్చే వారికైనా వారి శాఖలు వారు నిర్వహించుకునేల చూడాలని రామకృష్ణ సీఎం జగన్‌కు సూచించారు.

Updated Date - 2022-04-07T18:17:46+05:30 IST