మూడేళ్ల‌ YCP పాలనలో ప్రజలు సంతోషంగా లేరు: Ramakrishna

ABN , First Publish Date - 2022-05-31T18:43:26+05:30 IST

మూడేళ్ల‌ వైసీపీ పాలనలో ప్రజలు ఎవ్వరూ సంతోషంగా లేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

మూడేళ్ల‌ YCP పాలనలో ప్రజలు సంతోషంగా లేరు: Ramakrishna

Vijayawada: మూడేళ్ల‌ వైసీపీ (YCP) పాలనలో ప్రజలు ఎవ్వరూ సంతోషంగా లేరని, పదవులు పొందిన కొంతమంది మాత్రమే సంబరాలు చేసుకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లక్షా 42 వేల కోట్ల రూపాయలను వివిధ పధకాల కింద సీఎం జగన్ (Jagan) పంచారని, రాష్ట్ర అభివృద్ధిని మాత్రం పూర్తిగా విస్మరించారని తీవ్రస్థాయిలో విమర్శించారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ (AP)లో అన్నీ ధరలు ఎక్కువేనన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు పెంచేశారని, ఆటో వాలాకి పది వేలు వేసి రెట్టింపు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మూడేళ్లల్లో ఒక్క రంగంలో అయినా అభివృద్ధి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం మాట తప్పారని, కనీసం కేంద్రాన్ని అడిగే ధైర్యం కూడా ముఖ్యమంత్రికి లేదని ఎద్దేవా చేశారు.


దావోస్‌కి వెళ్లిన సీఎం జగన్ ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కేటిఆర్ ఒక మంత్రి మాత్రమే... జగన్ సిఎం హోదాలో వెళ్లారు.. కేటిఆర్ వెంట పారిశ్రామిక వేత్తలు క్యూలు కడుతున్నారని, ఇది చూసి జగన్ సిగ్గు పడాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, వాళ్ల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడని, దాన్ని వైసీపీ నేతలు సిగ్గు లేకుండా సమర్ధించుకుంటున్నారని మండిపడ్డారు. బస్సు యాత్రలతో ప్రజలకు ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.జగన్ అభివృద్ధి నిరోధకుడిగా పేరు సార్ధకం చేసుకున్నారని, ఒక్క అప్పుల విషయంలో మాత్రమే సీఎం అభివృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు. ఎనిమిది లక్షల కోట్ల అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. విభజన సమయంలో ఎంత అప్పు ఉందో... చంద్రబాబు హయాంలో ఎంత, జగన్ హయాంలొ ఎంత అప్పు అనేది శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అన్ని వర్గాల వారిని ఆహ్వానించి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-31T18:43:26+05:30 IST