ఆస్పత్రిలో సమస్యలు ప్రభుత్వానికి విన్నవిస్తా..

ABN , First Publish Date - 2021-04-12T14:33:12+05:30 IST

తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల పరిస్థితిని.

ఆస్పత్రిలో సమస్యలు ప్రభుత్వానికి విన్నవిస్తా..
విలేకర్లతో మాట్లాడుతున్న కమిషనర్‌, గర్భిణుల వార్డుల పరిస్థితి తెలుపుతున్న వ్యక్తి

ఏపీ వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ రామకృష్ణారావు


తెనాలి రూరల్‌: తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఏపీ వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రామకృష్ణారావు అన్నారు. ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వైద్యం అందించండి సారూ.. అనే కథనానికి స్పందించిన కమిషనర్‌ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. కొవిడ్‌ రోగులకు అందుతున్న సేవలను నేరుగా ఆయా వార్డులకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వైద్యశాలను పూర్తి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చామన్నారు. మొత్తం 220 బెడ్లు ఉండగా ఇప్పటికే 217 మంది వైద్యసేవలు పొందుతున్నట్లు పేర్కొన్నారు. అత్యాధునికి స్కానర్‌కు త్వరలోనే మరమ్మతులు చేయిస్తామన్నారు. ఆస్పత్రిల్లో స్టాఫ్‌ను త్వరలో భర్తీ చేస్తామన్నారు. డాక్టర్లకు అత్యవసర సెలవలు సైతం రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. తన భార్య ప్రసవం అయిందని, ఎంతో పేరున్న ఆసుపత్రి అని ఇక్కడకు వచ్చామని తీరా ఇక్కడ ఏర్పాట్లు మాత్రం శూన్యమని కమిషనర్‌ ముందు ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్‌ గైనకాలజీ విభాగాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ఫుడ్‌ సప్లై కాంట్రాక్టర్‌, ఆసుపత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌తో ప్రతేకంగా సమావేశమై మాట్లాడారు. డాక్టర్‌ సనత్‌కుమారి మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇక్కడ టెస్ట్‌లు చేయడం లేదని శాంపిల్స్‌ కలెక్ట్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట నోడల్‌ అధికారి, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-04-12T14:33:12+05:30 IST