Ramalinga Reddy: ‘బ్రాండ్‌ బెంగళూరు’ ఇమేజ్‌కు దెబ్బ

ABN , First Publish Date - 2022-09-07T16:47:19+05:30 IST

బీజేపీ నిర్లక్ష్యంతో ‘బ్రాండ్‌ బెంగళూరు’ ఇమేజ్‌కు భారీ దెబ్బ తగిలిందని కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఆర్‌ రామలింగారెడ్డి(Ramalinga Reddy)

Ramalinga Reddy: ‘బ్రాండ్‌ బెంగళూరు’ ఇమేజ్‌కు దెబ్బ

                    - నిరసన ర్యాలీలో కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఆర్‌ రామలింగారెడ్డి


బెంగళూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నిర్లక్ష్యంతో ‘బ్రాండ్‌ బెంగళూరు’ ఇమేజ్‌కు భారీ దెబ్బ తగిలిందని కేపీసీసీ కార్యాధ్యక్షుడు ఆర్‌ రామలింగారెడ్డి(Ramalinga Reddy) పేర్కొన్నారు. నగరంలో మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిరసన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కాంగ్రెస్‏పై నెట్టేసే ప్రయత్నం చేస్తోందని విరుచుకుపడ్డారు. బీజేపీ నుంచి ఇంతకంటే ఏమి ఆశించగలమని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండేళ్ళకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నగర అభివృద్ధి కోసం చేసింది శూన్యమని, మౌలిక సదుపాయల రంగంపై దృష్టి సారించి ఉంటే నగర ప్రజలకు నేడు ఇలాంటి దుస్థితి ఉండేది కాదన్నారు. 40 శాతం కమీషన్లపై ఉన్న యావ నగర అభివృద్ధిపై బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇదే విధంగా సాగితే నగరంలోని ఐటీబీటీ కంపెనీ(ITBT Company)లు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. భారీ వర్షాలు పడి నగరం మునిగితేనే సీఎంకు ప్రజలు గుర్తుకు వస్తారని ఆయన చురకలంటించారు. ఇకనైనా జరిగిన తప్పులను దిద్దుకుని నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. మాజీ మంత్రి కృష్ణబైరెగౌడ మాట్లాడుతూ నగర అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. ప్రభుత్వ మొద్దు నిద్రవల్లే నగరానికి జలప్రళయం వచ్చిందని పైగా సిగ్గులేకుండా దీన్ని సమర్థించుకుంటున్నారని ఆయన విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-09-07T16:47:19+05:30 IST