జగన్ తిరుమల పర్యటనపై రమణ దీక్షితులు అసహనంతో ట్వీట్..

ABN , First Publish Date - 2022-09-28T18:40:55+05:30 IST

నేడు తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan) దర్శించుకున్న విషయం తెలిసిందే. కొత్త పరకామణి భవనం...

జగన్ తిరుమల పర్యటనపై రమణ దీక్షితులు అసహనంతో ట్వీట్..

Tirumala : నేడు తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan) దర్శించుకున్న విషయం తెలిసిందే. కొత్త పరకామణి భవనం... లక్ష్మీవీపీఆర్‌ రెస్ట్‌ హౌస్‌ను ఆయన ప్రారంభించారు. అయితే జగన్ పర్యటనలో వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ (One Man Committee report) అమలుపై ప్రకటన చేస్తారని భావించిన రమణ దీక్షితులు (Ramana Dixitulu)కి షాక్ తగిలింది. జగన్ శ్రీవారిని దర్శించుకుని ఎలాంటి ప్రకటనా చేయకుండా వెళ్లిపోయారు. దీంతో నిరాశ చెందిన రమణ దీక్షితులు ట్విటర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ట్విటర్‌ (Twitter)లో సీఎం జగన్‌ను ట్యాగ్ చేసి ప్రభుత్వంపై రమణ దీక్షితులు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. 


‘‘మీ తిరుమల పర్యటన సందర్భంగా వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై ప్రకటన చేస్తారని భావించాము... మీరు ఎటువంటి ప్రకటన చెయ్యకపోవడంతో అర్చకులమంతా తీవ్ర నిరాశ చెందాం... టీటీడీలోని బ్రాహ్మణ వ్యతిరేకులు... టీటీడీలోని అర్చక వ్యవస్థను.. ఆలయ విధానాలను నాశనం చేసే లోపే తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని రమణ దీక్షితులు పేర్కొన్నారు. 


టీటీడీలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకంపై ఏపీ ప్రభుత్వం ఏక సభ్య కమిటీని నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచించనుంది. ఇందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. శివ శంకర్‌రావుని కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. 


కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే భాగ్యం మిరాశీ వంశీకులకు చెందిన నాలుగు కుంటుంబాలకు మాత్రమే ఉండేది. 1986లో అప్పటి ప్రభుత్వం మిరాశీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వచ్చిన కోర్టు తీర్పులు, వరుసగా వస్తున్న ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పులు అన్నీ కలిపి దేవాలయంలో పూజాహక్కులకు సంబంధించి పలు పరిణామాలు జరిగాయి, జరుగుతున్నాయి. దీంతో శ్రీవారి ఆలయంలో ప్రస్తుతం 52 మంది అర్చకులు ఉండగా వారిలో 48 మంది అర్చకులు సర్వీస్‌ రికార్డ్‌-ఎస్‌ఆర్‌ విధానానికి మొగ్గు చూపారు. ఇలా మిరాశీ వంశీకులకు.. టీటీడీకి మధ్య అన్ని విషయాలు సర్దుబాటు అయ్యాయి అని భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వన్ మ్యాన్ కమిటీని నియమించింది.  





Updated Date - 2022-09-28T18:40:55+05:30 IST