రామానాయుడు స్టూడియోపై గురి

ABN , First Publish Date - 2021-07-03T07:00:19+05:30 IST

విశాఖపట్నంలోని విలువైన స్థిరాస్తులపై కన్నేసిన అధికార పార్టీ పెద్దలు...ఒక్కొక్కటిగా హస్తగతం చేసుకుంటూ వెళుతున్నారు.

రామానాయుడు  స్టూడియోపై గురి

‘రాజధాని’ ఆఫీసులకు ఇవ్వాలని ఒత్తిళ్లు

బీచ్‌ రోడ్డులో జగన్‌ కోసం నివాసం!

ఆ రోడ్డులోనే 10ఎకరాల్లో స్టూడియో

ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నిర్మాణం

వదులుకొంటే మరింత భూమినిస్తాం

కుటుంబసభ్యులతో పెద్దల చర్చలు

ససేమిరా అంటున్న కుటుంబం

అది ప్రభుత్వ భూమే కాబట్టి..లాగేసుకోవచ్చునని ఆలోచనలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని విలువైన స్థిరాస్తులపై కన్నేసిన అధికార పార్టీ పెద్దలు...ఒక్కొక్కటిగా హస్తగతం చేసుకుంటూ వెళుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి భీమిలి వెళ్లే బీచ్‌ రోడ్డులో ఉన్న నిర్మాణాలను అసలే వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే వారి కన్ను ఇప్పుడు రామానాయుడు స్టూడియోపై పడింది. ప్రతిపాదిత రాజధాని కార్యాలయాల కోసం స్టూడియోను ఇచ్చేయాలని రామానాయుడు కుటుంబసభ్యులను కోరినట్టు తెలిసింది. 


బీచ్‌ రోడ్డులోని ఎండాడ దగ్గర కార్తీకవనంలో (రాడిసన్‌ హోటల్‌) 50 శాతం వాటా ఇంతకుముందే తీసుకున్నారు. ఆ తరువాత రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో ఏర్పాటుచేసిన బేపార్క్‌ను పూర్తిగా వారి ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడే సీఎం కుటుంబం నివాసం ఉండబోతోందని చెబుతున్నారు. ఇప్పుడు రామానాయుడు స్టూడియోను స్వాధీనం చేసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై గత ఆరు నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ప్రత్యామ్నాయంగా వేరే స్థలం ఇస్తామని, అక్కడ స్టూడియో ఏర్పాటుచేసుకోవాలని ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. 

తొలి స్టూడియో అదే..

సినిమా నిర్మాణమే జీవితంగా బతికిన రామానాయుడు విశాఖపట్నంలో చక్కటి స్టూడియో నిర్మాణం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. సినిమా పరిశ్రమ విశాఖలో అభివృద్ధి చెందుతుందని భావించిన ప్రభుత్వం ఆయనకు భీమిలి మండలం తిమ్మాపురం సర్వే నంబరు 337లో 34.44 ఎకరాల స్థలాన్ని 2001లో కేటాయించింది. అది పూర్తిగా కొండ. ఆ కొండపై పది ఎకరాలను చదును చేసి ఆయన స్టూడియో నిర్మించారు. కొండపైకి అరకు ఘాట్‌ రోడ్డును తలిపించేలా అందమైన రహదారి వేశారు. ఈ పనులన్నీ పూర్తిచేసి 2008లో స్టూడియోను ప్రారంభించారు. విశాఖలో జరిగే షూటింగ్‌లకు అది కేంద్ర బిందువుగా మారింది. పర్యాటక ప్రాంతంగాను అందరినీ ఆకర్షిస్తోంది.


నవంబరు నుంచి ఒత్తిళ్లు

పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ పెద్దలు ఎక్కడెక్కడ ఏమేం ఉన్నాయో పరిశీలించి ఓ నివేదిక రూపొందించుకున్నారు. అందులో రామానాయుడు స్టూడియో కూడా ఒకటి. ప్రభుత్వం సమకూర్చిన స్థలమే కాబట్టి, ప్రభుత్వ అవసరానికి వెనక్కి ఇస్తే..అదే భీమిలి నియోజకవర్గంలో మరోచోట ఎక్కువ భూమి ఇస్తామని, ఇంకా పెద్ద స్టూడియో ఏర్పాటుచేసుకోవాలని సూచించినట్టు సమాచారం. అయితే, తమ తండ్రి ఎంతో శ్రమించి, ముచ్చటపడి ఆ స్టూడియోను నిర్మించారని, ఆయన గుర్తుగా దానిని అక్కడే అభివృద్ధి చేయాలనుకుంటున్నామని కుటుంబ సభ్యులు చెప్పినట్టు తెలిసింది. బాగా ఆలోచించుకొని చెప్పాలని, తొందరేమీ లేదని పెద్దలు చెప్పినట్టు సమాచారం. త్వరలోనే విశాఖకు వచ్చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి, ఉత్తరాంధ్ర మంత్రులు ఇటీవల ఘంటాపథంగా చెబుతున్న నేపథ్యంలో స్టూడియోను ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటారని తెలుస్తోంది. ఇది ఏ విధంగా జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.



Updated Date - 2021-07-03T07:00:19+05:30 IST