రామాయణమే, కానీ సీతాయణం!

Nov 29 2021 @ 00:35AM

16వ శతాబ్దంలో జన్మించిన చంద్రాబతి (1550) బెంగాల్‌కి చెందిన మొదటి కవయిత్రి. సుమారు 1600 ప్రాంతం వరకూ తక్కువ కాలమే బ్రతికింది. ప్రణయం, అంకితభావం, పోరాటాలతో నిండిన విషాదభరిత జీవితం ఆమెది. అయితే 20వ శతాబ్దం వరకూ ఆమె సాహిత్యం కంటే ఆమె ప్రేమ కథ మీదే ప్రజలు ఎక్కువ శ్రద్ధ కనపరిచారు. 


పట్వారీ గ్రామంలోని ఫూలేశ్వర్‌ నది ఒడ్డున ఉన్న, ఇప్పటి బంగ్లాదేశ్‌ కిషోర్‌ గంజ్‌, మైమన్సింగ్‌లో చంద్రాబతి జన్మించింది. మానసమంగళ కావ్యం రాసిన బన్సీదాస్‌ చంద్రాబతి తండ్రి. పేద బ్రాహ్మణుడు, బెంగాలీ సంస్కృతం భాషల్లో పండితుడు, సంచార కవి గాయకుడు. అదే వారి జీవనాధారం. తండ్రిలానే చంద్రాబతి కూడా బెంగాలీ, సంస్కృత భాషల్లో దిట్ట. తండ్రి ప్రోత్సాహంతోనే రచన లకు శ్రీకారం చుట్టింది. సుందరి మాలువ, దాస్యు (బంది పోటుదొంగ) కేనరాం కావ్యాలతో పాటు రామాయణం కూడా రాసింది. మొదటి రెండు కావ్యాలూ ఇప్పటికీ బంగ్లాదేశ్‌ పాఠశాలల్లో పాఠ్యవిషయాలుగా ఉన్నాయి. బెంగాలీలో స్త్రీ దృక్పథంతో రాసిన మొదటి కవయిత్రి ఆమె. ఆమె జీవిత వివరాలు ఆమె మరణించిన వందేళ్ల తర్వాత నయన్‌చంద్‌ ఘోష్‌ సేకరించిన దాన్నిబట్టి తెలుస్తున్నాయి.


పెళ్లీడుకొచ్చిన చంద్రాబతికి సరైన వరుడికోసం, తండ్రి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చంద్రాబతి బాల్య మిత్రు డైన జయానంద అన్నివిధాలా తండ్రీకూతుర్లకు నచ్చడంతో జయానందతో వివాహం నిశ్చయం చేసుకున్నారు. అందుకు జయానంద కూడా అంతే ఆనందంగా సమ్మతించడంతో, కలలు నిజం కాబోతూండటం చంద్రాబతిని ఆనందంలో ముంచెత్తింది. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతున్న సమ యంలో హఠాత్తుగా జయానంద ఒక ముస్లిం అమ్మాయిని మతం మార్చుకొని వివాహం చేసుకున్నాడని తెలిసింది. అతని నమ్మక ద్రోహం చంద్రాబతిని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇక జీవితాంతం అవివాహితగా ఉండిపోతా నని, తనపై ఏ ఒత్తిడీ తేవద్దని తండ్రి దగ్గర మాట తీసుకుంది. శివుని ఆరాధనలో కాలం వెళ్లబుచ్చాలనుకుంది. ఆమె మనసు మళ్లించేందుకు తండ్రి రామాయణం రాసే పని పూర్తి చేయమన్నాడు. తాను స్వయంగా శివుడూ సర్పదేవతల భక్తుడయినా, రామాయణంలోని సీత కథ కుమార్తెకు ఓదార్పుగా పనికొస్తుందని ఆ తండ్రి భావించాడు. 


తండ్రి ఆదేశాన్ని మన్నించి, చంద్రాబతి రామాయణ రచన ప్రారంభించింది. ఆమె రామాయణ కావ్యంలో తలమునకలై ఉన్న సమయంలో, ఆమె భర్త కాకుండా తప్పించుకున్న జయానంద, ముస్లిం యువతితో ఉండటం సాధ్యంకాక, తన తప్పు తెలుసుకొని చంద్రాబతిని కలవాలని ప్రయత్నం చేసాడు. జయానందని చివరిసారైనా కలుసుకుందుకు ఆమె నిరాకరించింది. జయానంద భరించలేక నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చంద్రాబతి మనస్సుమీద మరచిపోలేని చెరుపుకోలేని ముద్రవేసి, జీవితాంతం వేధిం చింది. ఆమె మరణానికి అదే కారణం కావచ్చునన్న ఊహా గానాలూ ఉన్నాయి. అయితే ఆమె ప్రణయ వృత్తాంతం రామాయణ కావ్యం మీద ప్రభావం చూపకుండా లేదు. 


ఆమె రామాయణం ఎవరో ప్రభువుల కోసం రాసింది కాదు. అందులో ఆమె శైలి, వైఖరి అంతా పూర్తిగా భిన్నం. పండితుల కోసం రాసింది కాకపోవడంతో, భాష సైతం జనసామాన్యుల భాషనే వాడింది. ఆమె ఉద్దేశం భక్తి ప్రధానం కాకపోవడంతో, అది ధార్మికం కాకుండా, లౌకికం అయింది. అందులో ఒక్కసారైనా రామునికి వందనాలు సమర్పించలేదు. అది చదవడం వినడంతో పొందే ఆధ్యాత్మిక ప్రయోజనాల్నీ ప్రస్తావించలేదు. ఆకలి నుండి రక్షించిన మానస సర్పదేవతకు, ఆమె తాతలు మామ్మలు, చదువు నేర్పించిన తండ్రికి, ప్రపంచాన్ని చూపించిన తల్లికి, శివపార్వతులకు వినయ పూర్వక నమస్కారాలు సమర్పిస్తూ, దాహంతీరుస్తున్న ఫూలేశ్వర్‌ నదికి కృతజ్ఞతలు చెప్పుకుంది. 


ఆమె రామాయణం అసాధారణంగా రావణుని కథతో (లంకా వర్ణనతో) మొదలవుతుంది. తర్వాత సీత జననం, రాముని జననం, సీతారాముల వివాహం, వారు అడవుల పాలవడం, సీతాపహరణం, లంకలో ఆమె ఉన్న రోజులు, సీతను విడిపించే మార్గాల కోసం రాముడి అన్వేషణ, అయోధ్యలో సీతారాముల సుఖజీవితం, సీతకు వ్యతిరేకంగా కుట్ర, సీత పవిత్రతమీద రాముని అనుమానం, చివరకు సీతను అడవులకు పంపడం, అగ్నిప్రవేశంతో సీత అదృశ్యం- ఈ క్రమంలో సాగుతుంది. రావణుని అంతమొందించడానికి జన్మించింది సీతేనని, రాముడు కాదని ఆమె చెప్పుకుంది. అందులో శృంగారం, యుద్ధంలాంటివేవీ లేకుండా, బారో మాసీ (పన్నెండు నెలల వృత్తాంతం, నెలల వారీగా సీత తనకు తానుగా చెప్పే ప్రక్రియని) బాలకాండ నుండి యుద్ధకాండవరకూ ప్రవేశపెట్టింది. దీన్నంతటినీ సీత గుర్తు తెచ్చుకొని చెబుతున్న కథలా చేసింది. యుద్ధం తాను కళ్లారా చూడలేదని, కలలో చూసినట్టుగా రెండు చరణాల్లో మాత్రమే చెప్పి సీత చెప్పినట్టుగా ముగించింది. సీత కష్టాల్ని గానం చేయడం ఆమె ముఖ్యోద్దేశంగా పెట్టుకుంది. సీత అందానికి సైతం ఆమె ప్రాధాన్యం చూపించలేదు.


చంద్రాబతి రాముని ప్రశంసించే బదులు, అనేకసార్లు రాముని మూర్ఖత్వం మీద వ్యాఖ్యానించటానికి, రాబోయే విపత్తుని దృష్టిలోపెట్టుకొని, సలహానో నిందనో వేయడానికీ వెనుకాడ లేదు. జరుగుతున్నది దైవికం కాదని మానవ నాటకమనీ చెప్పే ప్రయత్నం చంద్రా బతిది. చదువురాని జానపద స్త్రీలకోసం మౌఖిక పద్ధతిని ఆమె అనుసరించింది. 


రాముని శౌర్యం, మంచితనం, యుద్ధ పరా క్రమం, వివేకాల పట్ల నిశ్శబ్దం పాటించటం రాముని మీద ఆమె అభిప్రాయాన్ని చెప్పకనే చెబుతుంది. రావణుడి మీద సంశయంతో అవివేకిలా, అయిదు నెలల గర్భవతిని అన్యా యంగా అడవులకు పంపిన ప్రేమ ద్రోహి, చెడు భర్త, దీనమైన రాజు, తమ్ముడి వివేకానికి విరుద్ధంగా అతనిని వాడుకున్న అన్నయ్య, జనకుడిగా బాధ్యతలు నిర్వర్తించని తండ్రి అంటూ రాముని మీద చంద్రాబతి తన అభిప్రాయాల్ని దాచుకోలేదు. రామాయణంలో తాను  తప్పులుగా భావించిన వాటిపట్ల, న్యాయాధిపతిలా నిందా పూర్వక విమర్శ చేసింది. 


చంద్రాబతి రామాయణంలో సీతవి రెండు స్వరాలు కనిపిస్తాయి. సీత తన స్వీయ స్వరంలో సంప్రదాయబద్ధంగా ఓదార్పుగా వినిపిస్తుంది, ఆమె పక్షాన చంద్రాబతి మాటాడుతున్నపుడు  మాత్రం తిరగబడేవిధంగా పదునుగా ఉంటుంది. 


అది రామయణమే కానీ రాముడిది కాదు, సీతది. అంచాత అది సీతాయణం. 16వ శతాబ్దం లోనే రామాయణాన్ని సీత కోణంలో చెప్పిన చంద్రాబతి పద్ధతి విప్లవాత్మకమైనది. ఆ కాలపు స్త్రీవాది అనిపించే రచన ఆమెది. అలాగని ఈ రామాయణంలో, సీత ఎక్కడా తిరుగుబాటు చేయదు, రాముడిని ఎక్కడా వ్యతిరేకించదు, ఆ పని ఆమె పక్షాన చంద్రాబతి చేస్తుంది. సీత మాత్రం చివరివరకూ లొంగుబాటుగా సహనంతోనే ఉంటుంది. ఒక దుర్బల హిందూ స్త్రీగా కనిపిస్తుంది. అయితే స్నేహితురాళ్లతోనూ హితులతోనూ సీత తన యాతనల్ని, ఏకాంతాన్ని, వేదనని, తనకు జరిగిన అన్యాయాల్ని విడ మర్చి చెప్పుకునే ప్రక్రియ ద్వారా చంద్రామతి ఆమె అంత రంగాన్ని ఆవిష్కరించింది. అంతంలేని స్త్రీల విషాదంగా రామాయణాన్ని ఆమె చూపించే ప్రయత్నం చేసింది. ఆమె ఉద్దేశించిన శ్రోతలు స్త్రీలే. సీత సంపూర్ణ జీవిత చరిత్రే ఆమె రామాయణం. చంద్రాబతిలో చెలరేగుతున్న అశాంతి దుఃఖమే, సీత దుఃఖాలను కష్టాలను ఆమెకు మరింత దగ్గరచేసాయి. తనను తాను సీత కథలో చూసు కుంది. 1575లో తన 25 ఏళ్ల ప్రాయంలో ఈ కావ్యాన్ని ఫూలేశ్వర్‌ నది ఒడ్దున కూర్చుని పూర్తి చేయడానికి పూనుకొంది. అప్పటికీ ఇప్పటికీ గ్రామీణ బెంగాలులో స్త్రీల జీవితమే ఆమె కావ్యంలో దర్శనమిస్తుంది. మొదటి నుండీ చివరివరకూ అందులో సీత కథనే చెబుతుంది. దాదాపు ఏడువందల ద్విపదల కావ్యం, సీతను ఆమె చూసిన విధానాన్ని వివరిస్తుంది. 


1913లో అప్పటి స్థానిక పత్రిక సౌరభ్‌లో చంద్ర కుమార్‌ డే రాసిన వ్యాసం మూలంగా, దినేష్‌ చంద్రసేన్‌ (1866-1939) చంద్రాబతి రామాయణాన్ని వెలికి తీసాడు. అది 1932లో ప్రచురించబడింది. ముస్లిములు ప్రబలంగా ఉన్న ప్రదేశం నుంచి ఆమె రాసిన ఈ రామాయణంలోని పాటలు ఇప్పటికి అక్కడి స్త్రీలు పాడుకుంటారు. అయితే అవి చంద్రాబతి రాసినవని వారికి తెలియదు. 


రామునివైపు మొగ్గుచూపని చంద్రాబతి రామాయణం అసంపూర్ణం అన్నారు పండితులు. దేవునిగా రాముని ప్రశంస లేని అల్పరచనగా మరికొందరు ఈసడించారు. అయితే తన రచన ఇలాంటి విమర్శల పాలవుతుందని, దాని కారణంగా తాను కొందరి కోపాన్ని చవిచూడాల్సి వస్తుందని కూడా ఆమె అనుకొనే ఉండదు. ఆమె ఎవరికీ బద్ధురాలై ఎవరి మెప్పు కోసమూ ఈ రచన చేయలేదు. తనచుట్టూ ఉండే చదువురాని తన శ్రోతలెవరో ఆమెకు తెలుసు, వారికి అర్థమయ్యేందుకు సీత అనుభవించిన ప్రతీ కష్టాన్ని, దుఃఖాన్ని, అవమానాల్ని సరళమైన భాషలో వివరించింది. ప్రజలు సృష్టిని గుర్తుంచుకుం టారు, సృష్టికర్తను కాదు అన్నది ఒక బెంగాలీ సామెత. ఆమె రామాయణం అసంపూర్ణం అనే అనుకున్నా, అది సంపూర్ణ సీత కథ. 


ఆమె రామాయణంలోని ఆసక్తికరమైన కొన్ని చరణాలు

‘‘లక్ష్మణా!/ సీత మళ్లీ అడవులను సందర్శించాలంది నిన్న/ ఆమెను తీసుకొనిపోయి వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలిపెట్టు/ ఆ సీత మొహం ఎన్నటికీ చూడాలని లేదు నాకు/ ఒక్క ఆ సీత కోసం మూడు ప్రపంచాలూ అలజడిలో ఉన్నాయి/ సువర్ణ లంక ధ్వంసమయింది, కిష్కింధలో బాలి/ అయోధ్య కూడా తగలబడుతోంది, తొందరలొనే బొగ్గు బొగ్గయిపోతుంది/ ఏ దేవుడు సృష్టిం చాడో సీతని, ఏ విషాలతోనో ఎవరికి తెలుసు/ నేను కాలుతున్నాను, ఆ విషంలో కాలిపోతున్నాను, నా లోపలా కాలుతోంది/ కేవలం ఆశ్రమంలో ఋషులే భరించగలరు ఆ విషాన్ని/ తమ్ముడా లక్ష్మణా, బహిష్కరణగా సీతను అడవికి తీసుకుపో/ బహిష్కరణ అని ఆమెకు తెలియ నివ్వొద్దు/ నీ సీతాదేవిని తీయని మాటలతో తీసుకుపో’’


‘‘సరయూ! నెమ్మదిగా ప్రవహించు/ నేడు- రాజకుమార్తె, రాముని భార్య, సీతను/ అడవులకు బహిష్కరణగా పంపుతాడు రాముడు/ ఓ సూర్యుడా, వద్దు, ఉదయిం చొద్దు/ మేఘాల్లో నీ మొహన్నీ దాచుకో/ సీత కష్టాలకు సాక్షి కావద్దు/ కష్టాల కోసమే పుట్టిన బిడ్డ/ ఆకాశంలో గాలులూ, వీయొద్దు నేటినుంచి/ అమాయకబిడ్డ కష్టాల్ని ఎలా తట్టుకోగలవు నువ్వు/ ఆకాశాలూ ఏడవండి, గాలులూ ఏడవండి, నదిలో నీళ్లూ ఏడవండి/ పైన ఆకాశంలో నక్షత్రాలు ఏడుస్తూనే ఉన్నాయి రాత్రంతా/ సీత ఏ దేశానికి వెళ్తుంది/ ఎవరి ఇంటిలో సీతకు ఆశ్రయం దొరుకుతుంది/ సరయీ, ప్రవహించు, అతి నెమ్మదిగా’’ 


ఆమె కంటిలో నీరు లేదు, నోటమ్మట మాటలేదు/ చెట్టుకింద బంగారం బొమ్మలా నిలుచుండి పోయింది. నేను బూడిదయి పోతాను, అయోధ్యా అలానే/ పవిత్రుల శాపాగ్ని నేను ఓర్చుకోలేను చంద్రాబతి రాముని నిర్ణయాన్ని నిందించుకుంది ఇలా - చాడీలు చెప్పేవారి మాటలు విని నువ్వు ఏమిచేసావు/ సీతను శాశ్వతంగా పోగొట్టుకున్నావు 


‘‘అగ్ని నన్ను స్పర్శించలేదు, పవిత్ర స్త్రీని నేను/ కానీ నేడు అగ్నిలో ప్రవేశిస్తే, తిరిగి రావాలని నాకు లేదు/ నా పుత్రులు లవుడు కుషుడు వారి తల్లిని కోల్పోతారు ఈరోజు/ తల్లిలేని పిల్లలు గుండెలు పిండేలా రోదిస్తారు.’’ 


దాదాపు సమకాలికురాలైన ఆతుకూరి (కుమ్మరి) మొల్లకూడా చంద్రాబతిలానే అవివాహితగా ఉండిపోయింది. ఆస్థానకవులకు తీసిపోనివిధంగా రామాయణాన్ని ప్రామా ణికంగా రాసి, శ్రీకృష్ణ దేవరాయలుని సైతం ఆకట్టుకొని ప్రసంశలందుకొంది. రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం తర్వాత మొల్ల రామాయణాన్నే పేర్కొంటారు. చంద్రాబతి, మొల్ల ఇద్దరికీ సంస్కృతం తెలిసినా వారి వారి మాతృ భాషలలోనే రామాయణాలు రాసారు. మొల్ల రామాయణం గురించి తెలిసినంతగా చంద్రాబతి గురించి పరిశోధకులకుతప్ప పండితులకు విమర్శకులకు తెలియదు. తెలీదనేకంటే కావాలనే అలక్ష్యం చేసారని చెప్పవచ్చు. ఆ కారణంగా అది చాన్నాళ్లు మరుగున పడిపోయింది.


‘మూడువందల రామాయణాలు: ఐదు ఉదాహరణలు, అనువాదాల మీద మూడు ఆలోచనలు’ పేరుమీద ఎ.కె. రామానుజన్‌ 1987లోనే రాసిన వ్యాసం రామాయణాల మీద అప్పటికేవచ్చిన విశ్లేషణాత్మక ఆలోచనాత్మక వ్యాసం. మూలం చెడకుండా ఒకే కథని అనేకవిధాలుగా చెప్పినవీ ఉన్నాయి, మూలాన్ని తమతమ ఆలోచనలకు అనువుగా మార్పులూ చేర్పులూ చేసినవీ ఉన్నాయి. అనేక రూపాలుగా వాల్మీకి రామాయణం అనువాదం పరివర్తనం చెందినా, వాటిల్లో నిందాపూర్వకం కానివి మాత్రమే ఎక్కడైనా ఎక్కువగా ఆమోదయోగ్యమయాయి. 

ముకుంద రామారావు 

99083 47273

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.