జాగ్రత్తగా ఉపవాసం!

ABN , First Publish Date - 2021-04-28T05:47:20+05:30 IST

రంజాన్‌ ఉపవాసాల నెల. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఆహారం తినకూడదు. నీళ్లు తాగకూడదు. మొత్తం నెలంతా ముస్లింలు ఈ దీక్షను పాటిస్తారు.

జాగ్రత్తగా ఉపవాసం!

రంజాన్‌ ఉపవాసాల నెల. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఆహారం తినకూడదు. నీళ్లు తాగకూడదు. మొత్తం నెలంతా ముస్లింలు ఈ దీక్షను పాటిస్తారు. అయితే, రోజువారీ బాధ్యతలను నిర్వహిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉపవాసాల్ని కొనసాగించడంలో ఇబ్బంది ఉంటుంది. దీన్ని అధిగమించడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.


ఉదయం భోజనం మానొద్దు: సూర్యోదయానికి ముందు చేసే భోజనాన్ని ‘సహరీ’ అంటారు. సూర్యాస్తమయం తరువాత తీసుకొనే భోజనాన్ని ‘ఇఫ్తార్‌’ అంటారు. ఉపవాస దీక్షలో ఉన్నవారు ఉదయాన్నే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. రోజంతా శక్తితో, ఉత్సాహంగా ఉండడానికి అవసరమైన పదార్థాలు భోజనంలో ఉండేలా చూసుకోండి. తెల్లవారుజామునే భోజనం చెయ్యడం కొందరికి ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ, ఏదో కాస్త తింటే చాలు అనో, పూర్తిగా మానేసి సాయంత్రం చూసుకుందామనో అనుకుంటే సమస్యలు తప్పవు. 


డీహైడ్రేట్‌ కాకుండా: వేసవి కాలంలో రంజాన్‌ ఉపవాసాలు కష్టంగా ఉంటాయి. తగినంత నీరు తాగకపోతే డీహైడ్రేట్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. ఉపవాస సమయంలో నీళ్లు తాగకూడదు, కాబట్టి, రోజుకు సరిపోయే నీటిని రాత్రి నుంచి తెల్లవారే లోపునే తాగాలి. ఒంట్లో నీటి శాతాన్ని పెంచే పండ్లు, పదార్థాలు తినాలి.


సరైన ఆహారం: సహజమైన చక్కెర పదార్థాలు ఉండే ఆహారం శక్తి ఎక్కువ సమయం ఉండేలా చూస్తుంది. ఆకలిగా అనిపించదు. కూరగాయలు పండ్లు, కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినాలి.


ఆరోగ్య సమస్యలు ఉంటే: షుగర్‌, బ్లడ్‌ ప్రెజర్‌, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్య నిపుణులను సంప్రతించాలి. ఉపవాస సమయాలకు అనుగుణంగా మందులు ఎలా వాడాలో సూచనలు తీసుకోవాలి. 


ఉపవాసాలు పూర్తయ్యాక: నెల రోజులు ఉపవాస దీక్ష చేసిన తరువాత, తిరిగి సాధారణ ఆహార అలవాట్లలోకి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఉంటే... సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య కాలంలో తీసుకొనే ఆహారం పరిమాణాన్ని క్రమంగా పెంచుకుంటూ రావాలి.

Updated Date - 2021-04-28T05:47:20+05:30 IST