AP News: సీఎం జగన్ ఆ సంప్రదాయం ఎందుకు పాటించరు?: రమేష్ నాయుడు

ABN , First Publish Date - 2022-09-27T21:55:22+05:30 IST

తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సీఎం జగన్ తన సతీమణి భారతి ని తీసుకువెళ్లకపోతే...

AP News: సీఎం జగన్ ఆ సంప్రదాయం ఎందుకు పాటించరు?: రమేష్ నాయుడు

అమరావతి (Amaravathi): తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి (CM Jagan) తన సతీమణి భారతి (Bharathi)ని తీసుకువెళ్లకపోతే.. ఆయనకు హిందూ సంప్రదాయాలపై విశ్వాసం లేనట్లుగా భావించాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు (Ramesh Naidu) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హిందూమతంపై విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి డిక్లరేషన్‌పై సంతకం చేయాలన్నారు. విశాఖ శారదా పీఠం, హైదరాబాద్ జీయర్ పీఠం వద్దకు వెళ్లే జగన్.. తిరుమల స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సతీమణిని తీసుకువెళ్లకపోతే, ఆయన పీఠాల పర్యటనను హిందూ సమాజం నమ్మదని, అన్యమతస్తుడిగానే గుర్తిస్తుందన్నారు.  


ఇప్పటి వరకు అందరు ముఖ్యమంత్రులు తమ భార్యలతోనే బ్రహ్మోత్సవాలకు వెళ్లారని, మరి సీఎం జగన్ ఎందుకు ఆ సంప్రదాయం పాటించరని రమేష్ నాయుడు ప్రశ్నించారు. హిందూ సంప్రదాయాలపై నమ్మకం ఉందని సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలన్నారు. టీటీడీ అధికారులు కూడా సంప్రదాయం పాటించాలన్నారు. సోనియాగాంధీ, అబ్దుల్‌ కలామ్‌తో పాటు చాలామంది అన్యమతస్తులు డిక్లరేషన్‌పై సంతకం పెట్టారని, మరి జగన్ ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. అంటే హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేదా? అన్నారు. కాకినాడ జిల్లాలో వైసీపీ మీటింగు కోసం శివలింగానికి తాళ్లు కట్టడం వారి బరితెగింపుకు నిదర్శనమన్నారు. వైసీపీకి హిందూమతమంటే ఎంత గౌరవం ఉందో స్పష్టమవుతోందన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులయినా, శివలింగానికి తాళ్లు కట్టిన వీడియో వైరల్ అవుతున్నా.. ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదంటే.. ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతానికి ఏ స్థాయిలో ప్రమాదం పొంచి ఉందో హిందువులు అర్ధం చేసుకుంటున్నారని రమేష్ నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2022-09-27T21:55:22+05:30 IST