రేషన్‌ షాపుల్లా.. రేషన్‌ థియేటర్లు పెట్టండి!

ABN , First Publish Date - 2022-01-05T08:52:39+05:30 IST

సినిమా టికెట్‌ ధరల వివాదంపై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరోమారు జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వేరే ఉద్దేశమేమీ లేదు. క్లారిటీకోసమే అడుగుతున్నాను. సమాధానం చెప్పండి’

రేషన్‌ షాపుల్లా.. రేషన్‌ థియేటర్లు పెట్టండి!

  • సినిమా ‘నిత్యావసరం’ అయితే... సబ్సిడీలు ఇవ్వండి
  • బాహుబలిని మించిన సినిమాలు మీరే తీయొచ్చుకదా!
  • ఫ్రీగా వినోదం పంచి పాతికేళ్లు అధికారంలో ఉండండి
  • స్టార్‌ హోటళ్లలోనూ ధరలు తగ్గించాలని రూల్‌ పెట్టండి
  • సర్కారుకు రామ్‌గోపాల్‌ వర్మ చురకలు


హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సినిమా టికెట్‌ ధరల వివాదంపై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరోమారు జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వేరే ఉద్దేశమేమీ లేదు. క్లారిటీకోసమే అడుగుతున్నాను. సమాధానం చెప్పండి’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పది ప్రశ్నలు సంధించారు. తన సందేహాలను తీర్చాలని ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రుల్ని కోరారు. అమ్మకందారుడికీ, కొనుగోలుదారుడికీ మధ్యలో ప్రభుత్వ ప్రమేయం ఏమిటని నిలదీశారు. ‘‘ఓ వస్తువు తయారీదారుడికీ, వినియోగదారుడికీ మధ్య ప్రభుత్వానికి ఏం పని? వస్తువు తయారీకి అయ్యే ఖర్చును బట్టి ధర ఉంటుంది. అయిన ఖర్చును పరిగణనలోకి తీసుకోకుండా, సంబంధం లేకుండా ధరను ఎలా నియంత్రిస్తారు?’’ అని ప్రశ్నించారు. ధర తగ్గించమన్నప్పుడు తక్కువ నాణ్యత గల వస్తువునే ఇవ్వాల్సి వస్తుందని... ఈ నిర్ణయం వల్ల ప్రేక్షకులకుఒరిగేదేమిటని అడిగారు. ‘‘ సినిమా నిత్యావసర వస్తువని ప్రభుత్వం చెబుతోంది.


అందువల్ల, ధర తగ్గించి ప్రేక్షకులకు మేలు చేస్తామంటోంది. అలాంటప్పుడు... విద్య, వైద్యంలాగానే సినిమాలకు కూడా సబ్సిడీలు ఇవ్వొచ్చు కదా? నిర్మాత నుంచి సినిమాను ప్రభుత్వమే కొని... టికెట్లను సబ్సిడీ ధరలకు అమ్మవచ్చు కదా! ఉత్పత్తిదారుల నుంచి అధిక ధరకు కొన్న సరుకులను ప్రభుత్వం రేషన్‌ షాపుల్లో తక్కువ ధరకు అందిస్తుంది. అదే విధంగా... నిర్మాత చెప్పిన ధరకు సినిమాను ప్రభుత్వమే కొని, రేషన్‌ షాపుల తరహాలో రేషన్‌ థియేటర్లు పెట్టి, సినిమాను ప్రజలకు ఉచితంగా చూపించొచ్చు కదా?’’ అని ప్రశ్నించారు. ‘‘నిర్మాతలు ఆశిస్తున్న ధరకు ప్రభుత్వమే టికెట్లు కొని, వాటిని ప్రజలకు తక్కువ ధరకు అమ్మితే... నిర్మాతకు డబ్బులు వస్తాయి. మీకు మీ ఓట్లూ వస్తాయి. ఇదెలా ఉంది?’’ అని అన్నారు. నటుల పారితోషికం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని తెలిపారు. ‘‘మీరు సినిమా నిర్మాణ వ్యయం గురించి మాట్లాడుతున్నారు. ఇందులో నటుల పారితోషికంతోపాటు అన్ని రకాల ఖర్చులు ఉంటాయి. అల్లు అర్జున్‌, మహేశ్‌బాబు... ఇలా హీరోల ట్రాక్‌ రికార్డు చూసి, ఒక బిజినెస్‌ కాలిక్యులేషన్‌ ప్రకారం రెమ్యునరేషన్‌ ఇస్తారు. అది ఇచ్చేవాళ్లకు, తీసుకునే వాళ్లకు మధ్య ఉన్న అవగాహన. అలాంటప్పుడు... రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదం!’’ అని అన్నారు. ‘‘చిన్న సినిమాకి, పెద్ద సినిమాకీ నిర్మాణ వ్యయంలో తేడా ఉంటుంది. చిన్న సినిమా కొద్దిమందితో తయారైపోతుంది.


పెద్ద సినిమా నిర్మాణానికి వేలమంది అవసరమవుతారు. ఎవరికి ఎంత డబ్బులు వెళ్లాలో అవి వెళతాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో స్థాయిని బట్టి, చేసే పనిని బట్టి వేతనాలు ఉంటాయి. ఇదీ అంతే. ఈ విషయం ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడంలేదో నాకు అర్థం కావడంలేదు’’ అని వర్మ వ్యాఖ్యానించారు. ట్రైలర్‌ బాగుండి అసలు సినిమా బాగలేకపోతే, వినియోగదారుల హక్కులను కాపాడుతూ డబ్బులు వెనక్కి ఇవ్వరు కదా... అనే వాదనను ఆర్జీవీ ఖండించారు. ‘బాగలేదు’ అని వాపస్‌ ఇచ్చేందుకు సినిమా అనేది వస్తువు కాదని అన్నారు. ‘‘అధికారంలోకి వచ్చాక అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు... కానీ చేయడంలేదు. దిగిపోండి... అంటే దిగిపోతారా?’’ అని చురకలు అంటించారు. ‘‘ప్రభుత్వానికి ఎలాగూ సొంత చానల్‌లు ఉన్నాయి. మీరే డబ్బులు పెట్టి... మహే్‌షబాబు, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌లకు మించిన హీరోలను పెట్టి, బాహుబలికి బాబులాంటి సినిమాలను తీసి, ఫ్రీగా వినోదం పంచితే మరో పాతికేళ్లు అధికారంలో ఉంటారు కదా!’’ అని సలహా ఇచ్చారు. ‘ధర తగ్గించి ప్రజలకు మేలు చేయాలి’ అని నిజంగా అనుకుంటే... అది సినిమాకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలని వర్మ ప్రశ్నించారు. ‘‘ఒక హోటల్‌లో ఇడ్లీ ఐదు రూపాయలే. స్టార్‌ హోటల్‌లో 500 ఉంటుంది. స్టార్‌ హోటల్‌లో కూడా ఇడ్లీ 5 రూపాయలకే అమ్మాలని ఎందుకు రూల్‌ పెట్టరు? వస్తువు, సేవ విలువను వినియోగదారులు గుర్తించాలి. మధ్యలో ప్రభుత్వానికి ఎందుకు?’’ అని నిలదీశారు. 

Updated Date - 2022-01-05T08:52:39+05:30 IST