Ramadan వెలుగులు.. Hyderabadలో ముస్తాబైన మసీదులు..

ABN , First Publish Date - 2022-05-03T14:38:02+05:30 IST

రంజాన్‌ పండగ శోభను సంతరించుకుంది. ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలతో..

Ramadan వెలుగులు.. Hyderabadలో ముస్తాబైన మసీదులు..

  • తెల్లవారుజాము వరకు సాగిన కొనుగోళ్లు

హైదరాబాద్‌ సిటీ : నగరం రంజాన్‌ పండగ శోభను సంతరించుకుంది. ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలతో 30రోజులపాటు గడిపిన ముస్లిం సోదరులు నెలవంక దర్శనంతో మంగళవారం ఈదుల్‌ ఫితర్‌ను జరుపుకోనున్నారు.


మార్కెట్లలో సందడి..

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని పాతబస్తీతోపాటు నగరంలోని పలు మార్కెట్లలో తెల్లవారుజాము వరకు వ్యాపార కార్యకలాపాలు కొనసాగాయి. మార్కెట్లు కొనుగోలు దారులతో సందడిగా కనిపించాయి. షాపింగ్‌ కోసం కేవలం నగర వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం ప్రజలు తరలి వచ్చారు.


ఒకప్పుడు పాతబస్తీలో చార్మినార్‌, గుల్జార్‌హౌజ్‌, మదీనా, పత్తర్‌గట్టి, ఘాన్సీబజార్‌, పటేల్‌మార్కెట్‌, లాడ్‌ బజార్‌, షహరాన్‌ లాంటివే ప్రధాన మార్కెట్లుగా ఉండేవి. క్రమేణా వాటికి పోటీగా వివిధ బస్తీల్లోనూ మార్కెట్లు వెలిశాయి. కొనుగోలుదారులు చార్మినార్‌కు మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ మార్కెట్‌లకూ వెళుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు కూడా వినియోగదారులతో కిటకిటలాడాయి. ఎండల తీవ్రతకు పగటి సమయంలో జనం కాస్త పల్చగా ఉన్నప్పటికీ రాత్రి సమయాల్లో భారీగా తరలి వస్తున్నారని షాపుల యజమానులు చెబుతున్నారు.


ముస్తాబైన ఈద్గాలు

నగరంలోని ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన ఈద్గా మీరాలంతోపాటు కొత్తపేట్‌, మాదన్నపేట్‌, లంగర్‌హౌజ్‌, సికింద్రాబాద్‌, ఎర్రగడ్డ ఈద్గాలలో ప్రార్థనలకు ఏర్పాట్లు జరిగాయి. బస్తీల్లో ఉన్న మసీదుల్లోనూ ఏర్పాట్లు చేసి ముస్తాబు చేసినట్లు మతపెద్దలు తెలిపారు. 

Read more