రంజాన్ వేళ ఆస్వాదించగలిదే పది ఆహార పదార్థాలు ఇవే!

ABN , First Publish Date - 2022-04-30T01:27:04+05:30 IST

రంజాన్.. ముస్లింలకు పరమ పవిత్రమైన మాసం. ఈ నెలలో ముస్లింలు అత్యంత భక్త శ్రద్ధలతో అల్లాపై

రంజాన్ వేళ ఆస్వాదించగలిదే పది ఆహార పదార్థాలు ఇవే!

రంజాన్.. ముస్లింలకు పరమ పవిత్రమైన మాసం. ఈ నెలలో ముస్లింలు అత్యంత భక్త శ్రద్ధలతో అల్లాపై తమ భక్తిని చాటుతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్ష కొనసాగిస్తారు. సూర్యోదయానికి ముందు సుహార్, సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ విందు తీసుకుంటారు. ఈ సందర్భంగా తీసుకునే ఆహారం పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. స్నాక్స్, అపెటైజర్స్ (ఆకలిపుట్టించేవి), పానీయాలు, డిసెర్ట్స్ అద్భుతమైన రుచులను కలిగి ఉంటాయి. అయితే, ఈ రంజాన్ నెలలో ఆస్వాదించగలిగే పది అద్భుతమైన రంజాన్ ఫుడ్స్ గురించి పాకశాస్త్ర నిపుణుడు పల్టి హరినాథ్ వివరించారు. 


హలీం

ఇఫ్తార్ విందులో తప్పకుండా దర్శనిమిచ్చే వాటిలో ఇదొకటి. మాంసాన్ని పప్పుదినుసులు, గోధుమలు, మసాలాలు, డ్రైఫ్రూట్స్‌లో నెమ్మదిగా ఉడికించి దీనిని తయారుచేస్తారు. ఇందులో అత్యధిక పోషక విలువలు ఉంటాయి. 


 కెబాబ్స్

 కెబాబ్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. మటన్ లేదంటే చికెన్ ముక్కలను పెరుగు, సుగంధ ద్రవ్యాలతో కూడిన మసాలలో నానబెడతారు. దీనివల్ల కెబాబ్స్‌కు ప్రత్యేకమైన రుచి వస్తుంది. వీటిని ఫ్రై చేసుకుని కానీ, వేడి బొగ్గులపై బార్బిక్యూ చేయడం ద్వారా కానీ సిద్ధం చేస్తారు. 


చికెన్ షావర్మా

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మధ్యప్రాచ్య డిష్ ఇది. సన్నని మంటపై కాలుతున్న చికెన్, మటన్‌ను సన్నగా తరిగి పిటా బ్రెడ్ లోపల కూరగాయల ముక్కలు, సాస్‌తో కలిపి తీసుకుంటారు. అద్భుతమైన రుచి కలిగిన ఇది భోజనంగానూ సరిపోతుంది. 


ఖీమా సమోసా 

ఖీమా సమోసా లేకుండా ఇఫ్తార్ వేడుకలు పూర్తికావనడం అతిశయోక్తి కాదు. మైదా లేదంటే గోధుమ పిండి, మటన్‌తో తయారుచేసే ఈ ఖీమా సమోసాలు భారతీయ రుచుల సంగమంలా అనిపిస్తాయి. స్పైసీగా, టేస్టీగా ఉండే ఈ కీమా సమోసాలు లేకండా అది లేకుండా ఇఫ్తార్ వేడుక పూర్తికాదు.


 మటన్ రెసాలా

 మటన్‌ రెసాలా అనేది అథెంటిక్‌ బెంగాలీ డిష్‌. బోన్‌ మటన్‌ పీస్‌లను పెరుగులో నానబెట్టి, జీడిపప్పు, గసగసాల పేస్ట్‌తో పాటుగా భారతీయ మసాలాలు కూడా కలిపి తయారుచేస్తారు. పరాటా లేదా నాన్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.


దమ్‌ బిర్యానీ

బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిని రకరకాలుగా తయారుచేస్తారు. దక్షిణ భారతదేశంలో విభిన్న రకాలుగా అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా బియ్యం, మటన్‌ లేదా చికెన్‌, మసాలాలను నెయ్యి, కుంకుమపువ్వు ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు, సోయా ముక్కలు, సీఫుడ్‌తోనూ బిర్యానీ చేయడం కనిపిస్తుంది.


ఫలాఫెల్

ఫలాఫెల్‌.. ఇది బటానీ గింజలు లేదంటే ఫవా బీన్స్‌ లేదంటే రెండింటినీ కలిపి బంతిలా గుండ్రంగా తయారుచేస్తారు. వీటిని సాధారణంగా హమ్మస్‌తో పాటుగా తహినీ సాస్‌తో కలిపి ఇఫ్తార్‌ సమయంలో సర్వ్‌ చేస్తారు. అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాలలో ఫలాఫెల్‌ ఒకటి.


షీర్‌ ఖుర్మా

రంజాన్‌ సమయంలో విరివిగా కనిపించే మొఘలాయ్‌ తియ్యందనం షీర్‌ ఖుర్మా. షీర్‌ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం. ఈ షీర్‌ఖుర్మా  ఆకృతి మాత్రమే కాదు, రుచి కూడా వినూత్నంగా ఉంటుంది. ఈ రంజాన్‌ మాసంలో కనిపించే మొదటి డిసెర్ట్‌ ఇది.


అఫ్లాటూన్‌

అఫ్లాటూన్ అనేది రంజాన్ సందర్భంగా అందించే ప్రత్యేకమైన స్వీట్. మంత్రముగ్దులను చేసే దీని రుచి చాలా కాలం పాటు ఉంటుంది. స్వచ్ఛమైన నెయ్యి, గింజలతో తయారు చేస్తారు. చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు.  రంజాన్‌ వేళ భోజనం ముగించేందుకు అత్యుత్తమ డిష్‌‌లలో ఇదొకటి.


 రూ అఫ్జా 

 రంజాన్‌ మాసంలో సాధారణంగా తయారుచేసే షర్బత్‌ ఇది. దీనిలో వనమూలికలు, పండ్లు, కూరగాయలు, పూలు, వేర్లు కూడా భాగంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచులు, కూలింగ్‌ ఎఫెక్ట్‌ దీనిని మిలిగిన పానీయాలకు భిన్నంగా నిలుపుతుంది. ఈ రూ అఫ్జా సిరప్‌ను కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, సేమియాలలో కూడా కలిపి తీసుకోవచ్చు.


రంజాన్ మాసం పవిత్రత గురించి గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ.. రంజాన్ తన పవిత్రతతో కుటుంబం మొత్తాన్ని ఒకే చోటుకు చేరుస్తుందని పేర్కొన్నారు. ఇది నిజంగా జష్న్-ఎ-రంజాన్ అని అన్నారు. రంజాన్ అందరినీ ఏకం చేయడంతోపాటు ఈ పవిత్ర మాసాన్ని మరింత అర్థవంతమైనదిగా, దైవికంగా మారుస్తుందని వివరించారు.


కాబట్టి ఇంకెందుకాలస్యం.. ఇప్పటి వరకు రంజాన్ రుచులు ఆస్వాదించకుంటే వెంటనే ఆ పనిచేయండి. పలు రుచులను ఆస్వాదించండి.  

Updated Date - 2022-04-30T01:27:04+05:30 IST