Randeep Singh: ప్రభుత్వ వైఫల్యం వల్లే భారీ నష్టం

ABN , First Publish Date - 2022-09-10T17:27:44+05:30 IST

బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి కారణంగానే రాజధానిలోని ఐటీబీటీ కంపెనీలు అధికం గా ఉన్న ప్రాంతాల్లో వరదల వల్ల భారీ నష్టం

Randeep Singh: ప్రభుత్వ వైఫల్యం వల్లే భారీ నష్టం

- కబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

- గత ప్రభుత్వంపై ఆరోపణలు సిగ్గుచేటు

- కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‏సింగ్‌ సుర్జేవాలా


బెంగళూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి కారణంగానే రాజధానిలోని ఐటీబీటీ కంపెనీలు అధికం గా ఉన్న ప్రాంతాల్లో వరదల వల్ల భారీ నష్టం సంభవించిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‏సింగ్‌ సుర్జేవాలా(Randeep Singh Surjewala) ధ్వజమెత్తారు. కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న బీజేపీ భారీ వర్షానికి కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యమే కారణమంటూ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. రాజధాని బెంగళూరు నగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల నష్టం, సహాయ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంతంలో కబ్జాలను తొలగించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కబ్జాలు తొలగించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‏పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరు(Bangalore)లో భారీ వర్షాల కారణంగా అపార్ట్‌మెంట్లలో వేలాది వాహనాలు దెబ్బతిన్నాయని, వీటి మరమ్మతుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. వర్షం కారణంగా దెబ్బతిన్న ఇళ్ల నిర్మాణం కోసం తలా రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మూడేళ్లుగా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె(Greater Bangalore Metropolitan Municipality)లో ప్రజాపాలన లేకపోవడం కూడా సమస్య తీవ్రతకు కారణమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 1300కు పైగా కబ్జా ప్రదేశాలలో నిర్మించిన కట్టడాలను తొలగించినట్లు గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని గణాంక వివరాలను మీడియాకు అందచేశారు. రాజకాలువ ఆధునికీకరణకు రూ.వెయ్యి కోట్లు కేటాయించామని పదే పదే చెప్పుకునే ముఖ్యమంత్రి మరి ఇదే జరిగి ఉంటే బెంగళూరులో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు మూడు రోజులపాటు విలవిలలాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాజధాని బెంగళూరు విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.  

Updated Date - 2022-09-10T17:27:44+05:30 IST