Randeep Singh: కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపిన సోనియా పాదయాత్ర

ABN , First Publish Date - 2022-10-07T17:39:07+05:30 IST

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ భారత్‌ జోడో యాత్రలో పాలుపంచుకోవడం ద్వారా లక్షలాది మంది కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపారని

Randeep Singh: కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపిన సోనియా పాదయాత్ర

                                  - రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా


బెంగళూరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ భారత్‌ జోడో యాత్రలో పాలుపంచుకోవడం ద్వారా లక్షలాది మంది కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్‏సింగ్‌ సుర్జేవాలా(Randeep Singh Surjewala) పేర్కొన్నారు. రాష్ట్రంలోని మండ్య జిల్లా చిణ్య నుండి రాహుల్‌ గాంధీతో కలిసి సోనియా గాంధీ 10 కిలో మీటర్ల పాటు నడిచారని దారిపొడవునా యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. భారత్‌ జోడో యాత్రతో దేశంకోసం కాంగ్రెస్‌ చేసిన త్యాగాలను ప్రజలు స్మరించుకుంటున్నారన్నారు. దేశంలో గత 9 సంవత్సరాలు ప్రజలు ఒక పక్క విద్వేష భరిత రాజకీయాలతోనూ మరో పక్క నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఈ యాత్ర ప్రజల్లో నూతన ఆశలను రేకెత్తి స్తూ కార్యకర్తలో ధైర్యం నింపుతోందన్నారు. ఈడీ నోటీసులతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను వేధించగలరేమో గానీ ఆయన శక్తిని క్రుంగదీయలేరని సుర్జేవాలా వ్యాఖ్యానించారు. దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా విద్వేష రాజకీయాలు, ప్రతిపక్షాలను వేధించేలా కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్న కేంద్రంలో బీజేపి సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారన్న సంగతి భారత్‌ జోడో యాత్ర ద్వారా తెలుస్తోందన్నారు. ఈ యాత్ర దేశ రాజకీయాలను మలుపుతిప్పడం ఖాయమని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని నేతలంతా కలసికట్టుగా ఉన్నారని బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలందర్నీ ఒకే తాటిపైకి తెస్తున్నారని ఆయన ప్రశంసలు కురిపించారు. కర్ణాటకలోనూ భారత్‌ జోడో యాత్ర తాము అంచనా వేసిన దానికంటే భారీగా విజయవంతం అవుతొందని అన్ని వర్గాల ప్రజలు తండోపతండాలుగా యాత్రలో పాలుపంచకుంటూ ఉండటమే ఇందుకు తార్కాణమని సుర్జేవాలా అభిప్రాయపడ్డారు. సోనియా, రాహుల్‌ యాత్రలో వికలాంగులు, మహిళలు, యవతీయువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు.


Updated Date - 2022-10-07T17:39:07+05:30 IST