ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌లు, అధికారులతో ప్రాజెక్టు లెవెల్‌ మోనిటరింగ్‌ కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-10-24T06:57:35+05:30 IST

పోలవరం నిర్వాసితుల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించేందుకు సర్పంచ్‌లు, అధికారులతో ప్రాజెక్టు లెవెల్‌ మోనిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టరు సీ హరికిరణ్‌ పేర్కొన్నారు.

ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌లు, అధికారులతో   ప్రాజెక్టు లెవెల్‌ మోనిటరింగ్‌ కమిటీ ఏర్పాటు
రంపచోడవరం ఐటీడీఏలో అధికారులు, సర్పంచ్‌లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరికిరణ్‌..

 నిర్వాసితుల సమస్యలపై   రంపచోడవరం ఐటీడీఏలో అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

 పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కాలనీవాసులకు హామీ

రంపచోడవరం, అక్టోబరు 23: పోలవరం నిర్వాసితుల సమస్యలను క్షేత్ర  స్థాయిలో పరిష్కరించేందుకు సర్పంచ్‌లు, అధికారులతో ప్రాజెక్టు లెవెల్‌ మోనిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టరు సీ హరికిరణ్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన ఎంపీ జి మాధవి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యే ఎన్‌ ధనలక్ష్మి, ఐటీడీఏ పీవోలు ప్రవీణ్‌ఆదిత్య, ఏ వెంకటరమణ, పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి ఓ ఆనంద్‌, సబ్‌కలెక్టర్‌ కే సింహాచలం, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రంపచోడవరం, చింతూరు డివిజన్లలో నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుకు పీఎల్‌ఎంసీ కమిటీలు ఏర్పాటు చేశామ న్నారు. ఈ కమిటీ సభ్యులు లిఖిత పూర్వకంగా తెలియజేస్తే పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునరావాస ప్యాకేజీ అం దించాలని కోరుతూ 190 దరఖాస్తులు అందాయని, దరఖాస్తులను పరిశీ లించి గ్రామసభలు నిర్వహించి అర్హులందరికీ ప్యాకేజీ అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ కలెక్టర్‌ మురళీ, ఎస్‌ఈ కే నరసింహమూర్తి, ఈఈ పీ వెంకటరమణ, ఎస్‌డీసీలు వీ సుబ్బారావు, కే గీతాంజలి, తహశీల్దార్లు కే వీర్రాజు, ఆర్‌ వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ ఈఈలు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

పునరావాస కాలనీలను సందర్శించిన కలెక్టర్‌

దేవీపట్నం, అక్టోబరు 23: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరా వాసంతోపాటు అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని కలెక్టర్‌ సీ హరికిరణ్‌ తెలిపారు. శనివారం ఆయన దేవీపట్నం మండలం అగ్రహారం, మంటూరు, ఏనుగులగూడెం నిర్వాసితులకు ఇందుకూరు-1లో నిర్మించిన పునరావాస గృహాలను పోలవరం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఓ ఆనంద్‌, సబ్‌కలెక్టరు కట్టా సింహాచలంలతో కలిసి పరిశీలించి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ 63 హేబిటేషన్లకు గాను 23 కాలనీలకు పునరావాసం కల్పించామన్నారు. నిర్వాసితుల సమస్యలను రిజిస్టర్‌లో నమోదుచేసి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సర్పంచ్‌లు, అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. తరచూ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను సందర్శించి నిర్వాసితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టరు వెంట రెవెన్యూ అధి కారులు, హౌసింగ్‌ ఇంజనీర్లు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది ఉన్నారు.



Updated Date - 2021-10-24T06:57:35+05:30 IST