రణిల్‌ పునరాగమనం

ABN , First Publish Date - 2022-05-13T06:12:04+05:30 IST

శ్రీలంక మాజీ ప్రధానమంత్రి, పార్లమెంటులో ఒకే ఒక్కస్థానం ఉన్న యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి) నాయకుడు రణిల్ విక్రమసింఘే గురువారం ఆ దేశ కొత్త ప్రధానిగా ప్రమాణం చేశారు...

రణిల్‌ పునరాగమనం

శ్రీలంక మాజీ ప్రధానమంత్రి, పార్లమెంటులో ఒకే ఒక్కస్థానం ఉన్న యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి) నాయకుడు రణిల్ విక్రమసింఘే గురువారం ఆ దేశ కొత్త ప్రధానిగా ప్రమాణం చేశారు. ఒకసారి పతనమంటూ మొదలైతే అది ఎంతవరకూ జారుతుందో, ఆ ప్రభావం ఎన్ని రీతుల్లో ఉంటుందో చెప్పడం కష్టం. అనేక గొలుసుకట్టు పరిణామాలతో శ్రీలంక సంక్షోభం నానాటికీ ముదిరిపోతున్నది, భయపెడుతున్నది. ఈ అష్టకష్టాల నుంచి లంకను కచ్చితంగా బయటపడవేస్తానని కొత్త ప్రధాని బలంగా చెబుతున్నారు.


రణిల్ నియామకాన్ని అధ్యక్షుడి చిత్తశుద్ధికి నిదర్శనంగా ఎవరూ భావించడం లేదు. గోటబయ రాజపక్స సోదరుడు మహీంద రాజపక్స ప్రధానమంత్రి పదవినుంచి కఠినమైన పరిస్థితుల మధ్య తప్పుకోవాల్సి వచ్చింది. ఆయనతో పాటే మంత్రివర్గం కూడా రద్దయి దేశం కొత్తమంత్రివర్గ కోసం ఎదురుచూస్తోంది. రాజపక్స సోదరులకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనచేస్తున్నవారిమీద మహీంద మద్దతుదారులు దాడులు చేసి పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా, హింసాయుతంగా మార్చేసిన విషయం తెలిసిందే. ఒక పార్లమెంటు సభ్యుడు ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం పెద్ద విషాదం. కొందరి మరణాలకు, వందలాదిమంది గాయపడటానికీ కారకులైన మహీంద, ఆయన పార్టీ నేతలను దేశం విడిచిపోనివ్వకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాజపక్సలందరూ కలసి దేశాన్ని ముంచేశారన్న ప్రజాగ్రహాన్ని చల్లార్చే ఉద్దేశంతో కొందరు సోదరులు పదవులు వదిలినా అధ్యక్షస్థానంలో ఉన్న గోటబయ మాత్రం కొనసాగడానికి వీలుగా తోచిన ప్రయత్నాలేవో చేస్తున్నారు. అందరితో కలసిపనిచేస్తానని రణిల్ అంటున్నప్పటికీ, ఆయన నియామకాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆయనతో రాజకీయంగా పడక పార్టీనుంచి సీనియర్లంతా రెండేళ్ళక్రితం విడిపోయి ఇప్పుడు ప్రధానప్రతిపక్షంగా కూర్చున్నారు. జయవర్దనే కాలంనుంచి కీలక పదవులు చేపట్టిన రణిల్‌కు సమర్థుడన్న పేరు ఉంది. ఈ సంక్షోభకాలంలో భారతదేశం నుంచి, అంతర్జాతీయ సమాజంనుంచీ సహకారాన్ని సాధించడానికి రణిల్ ఉపకరిస్తాడని అంటున్నారు. దాదాపు అరడజనుసార్లు ప్రధానిగా ఉన్న రణిల్ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో లావాదేవీలు జరపడంలో దిట్ట. రణిల్ అద్భుతాలు చేయలేకపోవచ్చు కానీ, ప్రజల్లో కొంత విశ్వాసాన్ని నింపవచ్చు. దేశాధ్యక్ష పదవినుంచి ఇప్పట్లో గోటబయ తప్పుకోరని తెలుస్తూనే ఉంది. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా నేను లేకుంటే ఎలా అని వాదిస్తూ మధ్యేమార్గంగా ఏవో ప్రతిపాదనలు చేస్తున్నారు. లంకరాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిని తొలగించడం సంక్లిష్టమైన, సుదీర్ఘమైన పని. పార్లమెంటులో రెండుదశల ఓటింగ్ అనంతరం, చివరకు సుప్రీంకోర్టు కూడా సరేనన్న తరువాత అది జరుగుతుంది. అధ్యక్షుడి తొలగింపు విషయాన్ని అటుంచితే, అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు వీలున్నది కనుక ఇప్పుడు ఆ దిశగా అడుగులుపడుతున్నాయి. ఒకదశలో లంకలో సైనిక తిరుగుబాటు వస్తుందన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. ప్రజాందోళనలను నియంత్రించలేని స్థితిలో సైన్యానికి విస్తృతాధికారాలు దఖలు పరిచిన గోటబయ ఈ విషయంలో తప్పటడుగులు వేస్తారని అనుకోలేం.


శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి రాజపక్స సోదరులు మాత్రమే కారకులు కాకపోవచ్చును కానీ, గతంలో మహీంద రాజపక్స దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనానుంచి అతిగా అప్పులు తెచ్చి, అది చెప్పిన ప్రాజెక్టులన్నింటికీ తలూపిన మాట నిజం. కొన్ని ప్రాజెక్టులు దేశానికి భారమైనాయి.  పర్యాటకం మీదా, తేయాకు వంటి ఎగుమతులమీదా ఆధారపడిన శ్రీలంకను ఈస్టర్ బాంబు పేలుళ్ళ ఘటన పెద్ద దెబ్బతీసింది. అంతర్జాతీయ పర్యాటకులను భయపెట్టిన ఆ ఘటన అనంతరం, కరోనా మహమ్మారి వచ్చి ఏకంగా చావుదెబ్బ కొట్టింది. ఆ తరువాత సేంద్రీయ వ్యవసాయం వైపుకు ఒక్కసారిగా మళ్ళిపోవడం, అందులో భాగంగా విదేశాలనుంచి ఎరువులు, రసాయనాల దిగుమతులను ఏకంగా నిషేధించడంతో, వ్యవసాయ ఉత్పత్తి ఒకేసారి మూడోవంతుకు పడిపోయింది. ఇన్ని తప్పటడుగులమధ్య చేజేతులా సృష్టించుకున్న ఆర్థిక సంక్షోభాన్ని రణిల్ ఏ మేరకు పరిష్కరించగలుగుతారో చూడాలి. లంకను ఇప్పటికే అంతోఇంతో ఆదుకుంటున్న భారతదేశం రణిల్‌కు అండగా సహాయసహకారాలు అందించడం అవసరం. పొరుగుదేశంలో పరిస్థితులు మరింత దిగజారిపోవడం మనకు శ్రేయస్కరం కాదు.

Read more