
భారత క్రికెట్ చరిత్రలో 1983 సంవత్సరం సువర్ణాక్షరాలతో లిఖించబడిందనే విషయం అందరికీ తెలిసిందే. ఆ సంవత్సరం భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నో ఉత్కంఠమైన మలుపులతో దక్కిన గెలుపు అది. అలాంటి ఆసాధారణ ప్రయాణాన్ని వెండితెరపై ‘83’ సినిమాగా ఆవిష్కరిస్తున్నారు డైరెక్టర్ కబీర్ ఖాన్. ఈ సినిమాలో కపిల్ డేర్ డెవిల్స్ ప్రస్థానం ఎలా సాగింది? వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనే విషయాలను కళ్లకి కట్టినట్లు చూపించబోతున్నాడు కబీర్ ఖాన్. ఆ విషయం శుక్రవారం చిత్రయూనిట్ విడుదల చేసిన టీజర్ చూస్తే తెలుస్తోంది. 1983 జూన్ 25న ఫైనల్ జరిగింది. అందులో వెస్టిండీస్, ఇండియా జట్లు తలపడ్డాయి. వెస్టిండీస్ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పేసింది. ఆ క్యాచ్ కోసం కెప్టెన్ కపిల్ దేవ్ 20 గజాలు వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ పట్టడం హైలైట్‌గా నిలిచింది. ఆ క్యాచ్ సీన్‌ను హైలెట్ చేస్తూ ఈ టీజర్‌ను కట్ చేశారు.
గూజ్ బమ్స్ తెప్పించే ఇలాంటి సన్నివేశాలెన్నో ఈ సినిమాలో ఉన్నాయని, ఇండియన్ క్రికెట్లో మరచిపోలేని అమేజింగ్ జర్నీతో ఈ చిత్రం రూపొందిందని మేకర్స్ చెబుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా పదుకొనె, సాజిద్ నడియద్వాలా, కబీర్ ఖాన్, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంటమ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 24న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.