గ్యాంగ్‌రేప్‌పై విచారణ

ABN , First Publish Date - 2021-06-22T06:10:08+05:30 IST

తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీతానగరం ఘాట్ల వద్ద శనివారం రాత్రి జరిగిన యువతి గ్యాంగ్‌ రేప్‌ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

గ్యాంగ్‌రేప్‌పై విచారణ
సీతానగరం ఘాట్‌ వద్ద మహిళా సంఘాల నేతలు

నిందితుల కోసం ఆరు బృందాలు 

పోలీసుల అదుపులో అనుమానితులు

మేల్కొన్న అధికారులు.. ఘాట్ల వద్ద భద్రతా చర్యలు 

జీజీహెచ్‌లో బాధితురాలిని పరామర్శించిన మంత్రులు సుచరిత, వనతి


తాడేపల్లి టౌన్‌, జూన్‌ 21: తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీతానగరం ఘాట్ల వద్ద శనివారం రాత్రి జరిగిన యువతి గ్యాంగ్‌ రేప్‌ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రేమజంటను బెదిరించి ప్రియుడ్ని కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన కలకలం సృష్టించింది. దీంతో ప్రత్యేక విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గ్యాంగ్‌రేప్‌ బాధితురాలిని సోమవారం హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ను అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ సందర్శించారు. గ్యాంగ్‌రేప్‌ కేసు విచారణపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.  గ్యాంగ్‌ రేప్‌ కేసుకు సంబంధించి అనుమానితులను విచారిస్తున్నట్లు అడిషనల్‌ ఎస్పీ ఈశ్వరరావు విలేకర్లకు తెలిపారు. నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామన్నారు.  బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతాలకు చెందిన పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి కొంత సమాచారం ఉందని, పూర్తి నిర్థారణకు రాగానే నిందితులు ఎవరో తెలుపుతామన్నారు. నదీ తీరంలో గతంలోనే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, 19న పోలీసులు అందరూ హడావుడిగా ఉండడంతో అక్కడ ఆ రోజు నిఘా కొరవడిందన్నారు. రైల్వే పోలీసులతో కలిసి పని చేస్తామని, కార్యాచరణ రూపొందించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 


వెలిగిన దీపాలు.. పోలీస్‌ బందోబస్తు 

యువతిపై సామూహిక అత్యాచార ఘటనతో అధికారులు మేల్కొన్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు, మున్సిపల్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఘాట్ల వద్ద తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. గతంలో నదికి వచ్చిన వరదల కారణంగా దెబ్బ తిన్న లైట్లకు మరమ్మతులు చేశారు. మొత్తం 9 స్తంభాలకు గాను ఎనిమిది స్తంభాలపై ఉన్న దీపాలను వెలిగించారు. పోలీసులు కూడా ఘాట్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఘటన జరిగిన రైలు వంతెన వద్ద ఉన్న స్తంభంపై ఉన్న లైటును మాత్రం బాగుచేయకుండా వదిలేశారు. ఘాట్లను ఎంటీఎంసీ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి తదితరులు పరిశీలించి సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాయంత్రం వేళల్లో తీరంలో ఎవరూ ఉండరాదని, ఇసుక తిన్నెల వైపు వెళ్లరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


పోలీసుల వైఫల్యం

సీఎం జగన్‌ నివాసానికి కూతవేటు దూరంలో, సీతానగరం పుష్కర ఘాట్లను అడ్డాగా చేసుకుని పలు అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు. అత్యాచార ఘటన ప్రాంతాన్ని సోమవారం మహిళా నేతలు సందర్శించారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ తగ్గిందని తెలిపారు. రాజధాని ఈ ప్రాంతానికి వచ్చిన తరువాత తాడేపల్లిలో క్రైమ్‌ రేటు విపరీతంగా పెరిగిందన్నారు. కళ్లముందే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు కర్ఫ్యూ పేరుతో సామాన్యులపైన, సమస్యలపై పోరాడుతూ ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పి. దుర్గాభవాని మాట్లాడుతూ దిశ తదితర ఎన్ని చట్టాలు చేసినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువజన సమాఖ్య నాయకులు మోతుకూరి అరుణ్‌కుమార్‌, శ్రామిక మహిళా సంఘం నాయకులు వేమేశ్వరి, జిల్లా ఐద్వా నాయకురాలు దొంతిరెడ్డి శ్రీనివాసకుమారి, శిరీష, గిరిజ, దొంతిరెడ్డి విజయలక్ష్మి, లక్ష్మి తదితరులు ఉన్నారు.


బాధితురాలికి ప్రభుత్వం అండ

గుంటూరు(సంగడిగుంట): తాడేపల్లి అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు సుచరిత, వనిత తెలిపారు. బాధితురాలిని పరామర్శించిన అనంతరం మంత్రి వనిత మాట్లాడుతూ బాఽధితురాలికి సీఎం రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పారన్నారు. మంత్రి సుచరిత మాట్లాడుతూ  నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాడేపల్లి మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందని, పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారన్నారు. పుష్కరఘాట్‌లో నిఘా పెంచుతున్నామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రుల వెంట అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, జేసీ ప్రశాంతి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి తదితరులు ఉన్నారు. 

 

ఇంత జరిగితే జగన్‌ ఎక్కడ : లోకేశ్‌

మంగళగిరి:  ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్‌ కంటే ముందొస్తాడు జగన్‌ అంటూ పంచ్‌ డైలాగులు వేశారని, సీఎం ఇంటి సమీపంలో ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అమరావతి ఉద్యమానికి భయపడి వేలాదిమంది పోలీసులను కాపలా పెట్టుకున్న పిరికిపంద జగన్‌ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకమైందన్నారు. జనం తిరగబడతారనే భయంతో రెండేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్‌లోనే హోం ఐసోలేషన్‌ అయిన సీఎం జగన్‌రెడ్డి ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో ఓ యువతిని దుండగులు దారుణంగా అత్యాచారం చేశారన్న సమాచారం కనీసం తెలుసా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారన్నారు.  




 

Updated Date - 2021-06-22T06:10:08+05:30 IST