వేగంగా కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2021-04-23T09:44:58+05:30 IST

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం చూపొద్దు.

వేగంగా కరోనా వ్యాప్తి

ప్రజలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి 

మాస్కుపై నిర్లక్ష్యం వద్దు 

తప్పనిసరైతేనే బయటకు 

వ్యక్తిగత జాగ్రత్తలతోనే నివారణ 

కేబినెట్‌ ఉపసంఘం పిలుపు

ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి: కేబినెట్‌ సబ్‌ కమిటి


అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం చూపొద్దు. తప్పనిసరి అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి. భౌతిక దూరం పాటించడంతోపాటు తరచూ చేతులు శానిటైజ్‌ చేసుకోవాలి. వ్యక్తిగత జాగ్రత్తలే కరోనా నివారణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి’’ అని ఆరోగ్యశాఖ మంత్రి, కేబినెట్‌ సబ్‌ కమిటీ కన్వీనర్‌ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికోసం ఏర్పాటైన సబ్‌ కమిటీ మంగళగిరిలో గురువారం సమావేశమైంది. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు సుచరిత, కన్నబాబు, ఆదిమూలపు సురేశ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కొవిడ్‌ నివారణ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామన్నారు. సీఎం జగన్‌ నేతృత్వంలో తమ ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.


అనుమానితులకు టెస్టులు చేసిన తర్వాత ఫలితాలు త్వరగా ఇచ్చేలా అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై, ఆస్పత్రులు, కొవిడ్‌ సెంటర్ల సంఖ్య పెంచడం, హెల్ప్‌డె్‌స్కల ఏర్పాటుతోపాటు 104 కాల్‌సెంటర్‌ బలోపేతం చేయడంపై సబ్‌ కమిటీ సమావేశంలో చర్చించామన్నారు. 


వ్యాక్సినేషన్‌లో ముందంజ 

కరోనా వ్యాక్సినేషన్‌లో ఏపీ ముందుందని, ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మందికి పైగా టీకా వేశామని మంత్రి ఆళ్ల నాని వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఒకేరోజు 6లక్షల మందికి పైగా వ్యాక్సిన్‌ వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌ ద్వారా ఇది సాధ్యమైందన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లతో పాటు అర్హులైన వారంతా కచ్చితంగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని మంత్రి కోరారు.


ఆక్సిజన్‌ కొరతపై ప్రణాళిక 

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కోవడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని మంత్రి నానీ చెప్పారు. ప్రభుత్వాస్పత్రులకు ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని, ప్రైవేటు ఆస్పత్రులకు కూడా అందించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం రోజూ 360టన్నులు అవసరమని, మరో 100నుంచి 150టన్నులు అవసరం అవుతుందన్నారు. ఎక్కువ నిల్వలు కేటాయించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఆక్సిజన్‌ కోసం ఒడిశా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని సరఫరాదారులతో సంప్రదిస్తున్నామని చెప్పారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలను హెచ్చరించారు. 

Updated Date - 2021-04-23T09:44:58+05:30 IST