రాపిడి

ABN , First Publish Date - 2021-09-06T05:49:40+05:30 IST

కాలగమనంలో అనివార్యంగా మొద్దుబారిపోయిన మన ఆలోచనల గునపాలకు మెదడు కొలిమిలో ఇప్పుడు అత్యవసరంగా....

రాపిడి

కాలగమనంలో

అనివార్యంగా మొద్దుబారిపోయిన

మన ఆలోచనల గునపాలకు

మెదడు కొలిమిలో

ఇప్పుడు అత్యవసరంగా

మొనలు పెట్టించాలి


షార్పునర్‌ తిప్పి గానీ

బ్లేడుతో చెక్కి గానీ

మనం ఇప్పటి వరకు మూలన పడేసిన

మూగవోయిన పెన్సిల్‌ లోంచి

ములికి వెలుపలికి తెప్పించి

గొంతు గొప్పగా పలికించాలి


నిర్లక్ష్యం వల్లనైతేనేం

బాధ్యతల బరువుతోనైతేనేం

మొక్కవోయిన మొండివారిన

మన అపురూప సృజనశీలపు

గొడ్డళ్ళనూ కొడవళ్ళనూ

పునరధ్యయనం సుత్తెతో సుతిమెత్తగా కాక

అతిగట్టిగా ఎవరికి వారే చరిపించుకోవాలి


లోలోపలి తిరగలి జాబిలి

పిండి వెన్నెలను దండిగా

ధారాపాతంలా రాల్చాలంటే

ఆ రెండు రాళ్ళపై వున్నపళంగా

ముల్లు ఆడించాలి


మనం ముమ్మరమైతేనే

దేహాత్మ తిమ్మిర్లకు దిమ్మ తిరుగుతుంది

అంతరంగ కీరం

జడత్వపంజరం లోంచి

మహత్వ సాహిత్య మందిరంలోకి

పరుగులు తీసినపుడే

కేవల చిలుక పలుకులు మాయమై

వెల్తురు నుడుగులు విడుదలవుతాయి


రెచ్చిపోయిన వుత్సాహంతో

మన లోలోపలి మొక్కలు

                రెక్కలు విప్పాలంటే


అనుక్షణం మనం

పుచ్చుపట్టిన విత్తనాలమై పోకుండా

ఒక పిడికెడు మట్టి కోసం అంగలార్చాలి

ఓ చారెడు నీళ్ళు చూసి చెంగలించాలి


 నలిమెల భాస్కర్‌

Updated Date - 2021-09-06T05:49:40+05:30 IST