చేర్యాలలో అరుదైన అమ్మదేవతా శిల్పం

ABN , First Publish Date - 2022-06-30T05:44:50+05:30 IST

చేర్యాల మండలంలోని పొలాల్లో అరుదైన అమ్మదేవతా శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యురాలు, ఉపాధ్యాయిని వెంకటరమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

చేర్యాలలో అరుదైన అమ్మదేవతా శిల్పం
అమ్మదేవతా శిల్పం



హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 : చేర్యాల మండలంలోని పొలాల్లో అరుదైన అమ్మదేవతా శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యురాలు, ఉపాధ్యాయిని వెంకటరమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద స్త్రీమూర్తి శిరస్సు స్థానంలో వికసిత పద్మంతో, కడియాలున్న రెండు కాళ్లమీద అసామాన్యంగా ఆసీనురాలైన రూపం ఐదు అంగుళాల ఎత్తు, తొమ్మిది అంగుళాల వెడల్పుగల రాతి మీద దర్శనమిస్తోందని వారు పేర్కొన్నారు. అమ్మదేవతను నగ్నకబంధ, అదితి, లజ్జాగౌరీ, ఉత్తానపాద... ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారని వివరించారు. ఈ శిల్పాలను ఆరాధించే ఆచారం క్రీ.శ 1 నుంచి 4వ శతాబ్దం వరకు ఎక్కువగా ఉండేదని చరిత్ర అధ్యయనకారులు వెల్లడించారు. చాళుక్యరాణి మహాదేవి ఖాండవుల వైవాహిక సంతోషానికి మొక్కుగా ప్రతిష్టించిన నగ్నకబంధ అలంపురంలో కొలువుదీరుందని తెలిపారు. బాదామిలోని పురావస్తుశాఖ మ్యూజియంలో లజ్జాగౌరీ శిల్పం, మహాకూటలో మరొకటి ఉన్నాయని పేర్కొన్నారు. కీసరలో క్రీ.శ నాలుగో శతాబ్దం నాటి మాతృదేవతా శిల్పం, సింగరాయలొద్దిలో క్రీ.శ ఒకట శతాబ్దంనాటి నగ్నకబంధ విగ్రహం గతంలో లభ్యమైనట్లు కొత్తతెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ వివరించారు. ఈ క్రమంలో చేర్యాలలో వెలుగుచూసిన అమ్మదేవతా విగ్రహానికి సుమారు రెండు వేల ఏళ్ల ప్రాశస్త్యం ఉందని చరిత్ర అధ్యయనకారుల అభిప్రాయపడుతున్నారు.


Updated Date - 2022-06-30T05:44:50+05:30 IST