కెనడా బంగారు గనుల్లో అత్యంత అరుదైన ఊలీ మముత్ అవశేషాలు

ABN , First Publish Date - 2022-06-26T22:16:26+05:30 IST

కెనడాలోని క్లోండిక్ బంగారు క్షేత్రంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన ‘మమ్మీ’ అవశేషాలు బయటపడ్డాయి.

కెనడా బంగారు గనుల్లో అత్యంత అరుదైన ఊలీ మముత్ అవశేషాలు

న్యూఢిల్లీ: కెనడాలోని క్లోండిక్ బంగారు క్షేత్రంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన ‘మమ్మీ’ అవశేషాలు బయటపడ్డాయి. గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా ఇవి వెలుగు చూశాయి. వీటిని ‘ఊలీ మముత్’ అనే జంతువు పిల్లవిగా గుర్తించారు. ఊలీ మమత్ అనేది అంతరించిపోయిన మముత్ జాతి. ఇది హోలోసీన్ యుగంలో అంతరించిపోయే వరకు ప్లీస్టోసీన్ కాలంలో జీవించింది. ఆసియా ఏనుగును దీని దగ్గరి బంధువుగా చెప్పొచ్చు. బయటపడిన బేబీ ఊలీ మముత్‌కు ‘నన్ చో గా’ అని స్థానిక ట్రొండెక్ హ్వెచిన్ ఫస్ట్ నేషన్ సభ్యులు పేరు పెట్టారు. ‘పెద్ద పిల్ల జంతువు’ అని దీనర్థం.

 

 పురాతత్వ శాస్త్రవేత్త గ్రాంట్ జజులా మాట్లాడుతూ.. ఇది చాలా అందమైనదని, ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ కనుగొనని అత్యంత అద్భుతమైన  మంచు యుగం జంతువులలో ఒకటి అని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉన్నట్టు పేర్కొన్నారు. అమెరికా రాష్ట్రమైన అలాస్కా సరిహద్దులో కెనడాలోని యుకాన్ భూభాగంలో డాసన్ సిటీకి దగ్గర్లో జరిపిన తవ్వకాల్లో ఈ బేబీ ఊలీ మముత్ అవశేషాలను కొనుగొన్నారు. 


 30 వేల సంవత్సరాల క్రితం అడవి గుర్రాలు, సింహాలు, జెయింట్ స్టెప్పీ బైసన్‌లతో పాటు ఊలీ మముత్‌లు ఈ ప్రాంతంలో సంచేరించేవని చెబుతున్నారు. ఇప్పుడు బయటడిన బేబీ ఊలీ మముత్ అవశేషాలను బట్టి అది ఆడదని, మంచు యుగంలో అది చనిపోయి ఉంటుందని భావిస్తున్నట్టు జజులా తెలిపారు. కాగా, 1948లో ఎఫీ అనే పాక్షిక మముత్ దూడ అవశేషాలను 1948లో అలాస్కా అంతర్భాగంలోని బంగారు గనిలో కనుగొన్నారు. అలాగే, 2007లో సైబీరియాలో లియుబా అని పిలిచే 42 వేల సంవత్సరాల వయసున్న ఉన్నీ మముత్ శిశువు ‘మమ్మీ’ని కనుగొన్నారు. యుకాన్ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. లియుబా, నన్ చో దాదాపు ఒకే పరిమాణంలో ఉండడం గమనార్హం.

Updated Date - 2022-06-26T22:16:26+05:30 IST