ఐముక్తేశ్వర ఆలయంలో అరుదైన సంస్కృత శాసనం

ABN , First Publish Date - 2022-06-25T06:19:20+05:30 IST

విజయనగర సామ్రాజ్య రెండో రాజధానిగా వెలుగొందిన పెనుకొండలోని ప్రాచీన ఐముక్తేశ్వర ఆలయంలో అరుదైన సంస్కృత శాసనం గుర్తించారు.

ఐముక్తేశ్వర ఆలయంలో అరుదైన సంస్కృత శాసనం
ఆలయం లోపల రాతి దూలాలపై సంస్కృత శాసనం

పెనుకొండ, జూన 24: విజయనగర సామ్రాజ్య రెండో రాజధానిగా వెలుగొందిన పెనుకొండలోని ప్రాచీన ఐముక్తేశ్వర ఆలయంలో అరుదైన సంస్కృత శాసనం గుర్తించారు. గర్భగుడిలో ఒకటవ దేవరాయల కాలంలోని ఈ శాసనాన్ని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి గుర్తించారు. శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించారు. రంగ మండపం పైకప్పునకు వాడిన రాతిస్తంభాలపై శాసనాలను చెక్కి ఉన్నాయి. పైకప్పు రాతి దూలాలపై శాసనాలు అరుదు గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. శాసన భాష లిపి దేవనాగరిలో ఉండటం అసాధారణమన్నారు. సుమారు 6 అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పు ఉన్న రాతి దిమ్మలపై ఈ శాసనాలు పొందికగా చెక్కినట్లు వివరించారు. రెండో హరిహర రాయల కుమారుడైన ఒకటవ దేవరాయలు క్రీ.శ. 1406-1422 మధ్య విజయనగరరాజ్య చక్రవర్తికాక మునుపు పెనుకొండ సమీకు రాజప్రతినిధిగా వ్యవహరించేవాడన్నారు. పెనుకొండలో ఆయన ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. 

      

విజయనగర రాజ్యం ఆవిర్భావ కాలానికి చెందిన ఐముక్తేశ్వర ఆలయాన్ని ఆయన పునర్నిర్మించి శివలింగాన్ని పునఃప్రతిష్ఠించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీగణాధిపతయే నమాం అని ఈ శాసనం మొదలవుతుందన్నారు. చారిత్రక ప్రాముఖ్యం ఉన్న  ఐముక్తేశ్వర ఆలయాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కేంద్ర పురావస్తుశాఖ ముందుకు రావాలని కోరారు.  


Updated Date - 2022-06-25T06:19:20+05:30 IST