ఇంటింటికీ రేషన్‌ ఇలాగేనా!

ABN , First Publish Date - 2021-03-01T05:51:56+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతకంగా చేపట్టిన ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలుకావడం లేదు. కొన్నిచోట్ల లబ్ధిదారులకు ఇంటి వద్ద సరుకులు అందించడం లేదు.

ఇంటింటికీ రేషన్‌ ఇలాగేనా!
ధర్మవరంలో 2వ రేషన్‌ డిపో వద్ద సరుకులు ఇస్తున్న దృశ్యం

రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్టాతకంగా చేపట్టిన ఇంటింటికీ రేషన్‌  సరుకుల పంపిణీ క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలుకావడం లేదు.  కొన్నిచోట్ల  లబ్ధిదారులకు ఇంటి వద్ద  సరుకులు అందించడం లేదు. 

అందని రేషన్‌ సరుకులు

ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు

కిర్లంపూడి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ లబ్ధిదారులకు అందని ద్రాక్షగా మారింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా సరుకులు అందక ప్రజ లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు రేషన్‌ డీలర్‌ వద్దకు వెళ్లి తమకు అనుకూలమైన సమయంలో సరుకులు తెచ్చుకునేవారు. అయితే ప్రస్తుతం సిద్ధం చేసిన రేషన్‌ సరుకుల వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారస్తులు, ప్రైవేట్‌ ఉద్యోగస్థులు తికమకపడుతున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు ఆయా ప్రాంతాల్లో రేషన్‌ సరుకులు తీసుకునే అవకాశం ఉండేదని, ఈ విధానంవల్ల వలస కూలీలకు మరింత నష్టం వాటిల్లుతుందని పలువురు చెప్తున్నారు. దీనికితోడు లబ్ధిదారుల రేషన్‌ కార్డులు ఒక డీలర్‌ నుంచి వేరే డీలర్‌కు మారడంతో ఎవరి కార్డులు ఏ రేషన్‌షాపులో ఉన్నాయో తెలియక, సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నామని కిర్లం పూడిలో లబ్ధిదారులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన చర్యలు చేపట్టి తమకు రేషన్‌ అందేలా చూడాలని వారు కోరుతున్నారు.     


కానరాని రేషన్‌ పంపిణీ

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఇంటింటికీ రేషన్‌ పంపిణీ విధానం సక్రమంగా అమలుకావడంలేదు. ఫిబ్రవరి నెల పూర్తయినా ఇంకా రేషన్‌ సరుకులు లబ్ధిదారులకు అందని పరిస్థితి ఉంది. గ్రామంలో శనివారం రేషన్‌ డిపో-2,5, 37 షాపుల వద్దే కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేశారు. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసే వాహనం ప్రమాదానికి గురై ందని రేషన్‌ డిపోల వద్దే రేషన్‌ పంపిణీ నిర్వహించారు. గ్రామాల్లో వీధుల్లో నిలబెట్టి రేషన్‌ సరుకులను పంపిణీ చేస్తుం డడంతో ఇంటింటికి రేషన్‌ పంపిణీ విధానం ఆదిలోనే అభాసుపాలవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


దుకాణం వద్దే పంపిణీ

కాకినాడ రూరల్‌: కాకినాడ రూరల్‌ మండలం గంగనాపల్లి రేషన్‌దుకాణం 7 వద్ద ఇంటింటికీ రేషన్‌ అందించాల్సిన వాహనం గ్రామంలోని ఇళ్ల వద్దకు వెళ్లకుండా దుకాణం వద్దే డీలర్‌ సమక్షంలో ఆదివారం ఉదయం రేషన్‌ ఇచ్చారు. అయితే ఈ వాహనం వద్ద సంబంధిత వీఆర్వో లేకపోవడం, గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా పౌరసరఫరాల శాఖాధికారులు స్పందించకపోవడం గమనార్హం. రేషన్‌ దుకాణదారులు వాహనదారులు, సహాయకులతో కలిసి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. దీనిపై ఎంఎ్‌సవోను వివరణ కోరగా గ్రామంలో విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-03-01T05:51:56+05:30 IST