కన్నుల పండువగా రాష్ట్ర సేవికా సమితి సార్వజనికోత్సవం

ABN , First Publish Date - 2022-05-23T03:01:41+05:30 IST

హైదరాబాద్: రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత ప్రవేశ్ శిక్షా వర్గ-సార్వజనికోత్సవం బండ్లగూడలోని ఏఏఆర్ మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో కన్నుల పండువగా జరిగింది.

కన్నుల పండువగా రాష్ట్ర సేవికా సమితి సార్వజనికోత్సవం

హైదరాబాద్: రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత ప్రవేశ్ శిక్షా వర్గ-సార్వజనికోత్సవం బండ్లగూడలోని ఏఏఆర్ మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో కన్నుల పండువగా జరిగింది. సార్వజనికోత్సవంలో శిక్షార్ధుల ఘోష్, కర్రసాము, కరాటే, యోగ్‌చాప్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 


కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించిన గైనకాలిజిస్ట్ డాక్టర్ కె.స్వరూప మాట్లాడుతూ సేవికా సమితిలో ఆత్మ సంరక్షణ విద్యలు నేర్పించడాన్ని ప్రశంసించారు. ఎలాంటి బేధభావాలు లేకుండా అందరూ సమాజహితం కోసం పనిచేయడాన్ని కొనియాడారు. ప్రధాన వక్తగా హాజరైన రాష్ట్ర సేవికా సమితి సంచాలిక శాంత కుమారి మాట్లాడుతూ సశక్త, సమర్థ సమాజం కోసం రాష్ట్ర సేవికా సమితి పనిచేస్తోందన్నారు. నేడు సకారాత్మక కార్యం సమాజహితం కోసం జరగాలంటే స్వసంరక్షణ ముఖ్యమన్నారు. స్వధర్మం, స్వసంస్కృతి, స్వరాష్ట్రం, స్వాభిమానం అత్యవసరమని చెప్పారు. భాష, భూష, భజన, భోజనం, భవనం, భ్రమనం విషయాల్లో హిందుత్వాన్ని ఆచరించడం ద్వారా నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందవచ్చన్నారు. 


ప్రవేశ్ శిక్షా వర్గలో భాగంగా శిక్షార్ధులకు కర్రసాము, నియుద్ధ, యోగ్‌చాప్ అంశాల్లో శిక్షణనిచ్చారు. బౌద్ధిక్ కార్యక్రమాల్లో భాగంగా అనేక సామాజిక అంశాలపై లోతుగా అవగాహన కల్పించారు. 


సార్వజనికోత్సవానికి పలువురు మేధావులు, విద్యావేత్తలు, రాష్ట్ర సేవికా సమితి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T03:01:41+05:30 IST