Advertisement

రాష్ట్రమేగతి బాగుపడునోయ్‌!

Aug 9 2020 @ 00:29AM

దేశ ఆర్థిక వ్యవస్థను కొవిడ్‌ చిన్నాభిన్నం చేయటం గురించి పెద్దగా ఆలోచించని ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ చేయడం ద్వారా భక్తుల మనసులను కొల్లగొట్టారు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాటలో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి బిజీగా ఉండగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులది మాత్రం అరణ్య రోదనగా మిగిలిపోతోంది. తెలంగాణలో సచివాలయ నమూనాను ఖరారు చేయడానికై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజులపాటు ఏడెనిమిది గంటల చొప్పున సమావేశాలు నిర్వహించారు. కరోనా బారిన పడిన వారిని పైవ్రేటు ఆస్పత్రులు పీల్చిపిప్పి చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడంలేదు. జాతీయ స్థాయిలో రామ మందిరం, ఆంధ్రాలో మూడు రాజధానులు, తెలంగాణకు సచివాలయం ప్రధానమయ్యాయి. ప్రజలకు ఏది అవసరమో అది కాకుండా పాలకులు రాజకీయంగా బలపడటానికి ఏమి చేయాలో అదే చేస్తున్నారు. ఈ పోకడలను నిలువరించవలసినవారు మౌనాన్ని ఆశ్రయించడంతో అప్రధానమైనవన్నీ ప్రధానమవుతున్నాయి. అందుకే ఈ సందర్భంగా భర్తృహరి సుభాషితాన్ని గుర్తుచేసుకోవలసి వచ్చింది.


రాజకీయ ప్రయోజనాలకోసం దళితులు, బీసీలను ఉపయోగించుకోవడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే న్యాయ వ్యవస్థపైకి జస్టిస్‌ ఈశ్వరయ్యను ప్రయోగించారు. ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు కూడా చేరింది. ఈ సంభాషణ మొత్తం వెల్లడయిన తర్వాత కూడా ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ ప్రమేయం లేకపోతే ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయవలసిందిగా జస్టిస్‌ ఈశ్వరయ్యను ఆదేశించాలి. అలా ఏమీ జరగలేదు అంటే, మొత్తం వ్యవహారంలో జగన్‌ రెడ్డి పాత్ర ఉన్నట్టేనని భావించాలి. స్వయంగా అవినీతి కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి న్యాయ వ్యవస్థతో చెలగాటమాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వికృత క్రీడలో ఆయనకు కొంత మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు సహకరించడం మరింత విషాదం!


బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః

అబోధోపహాతా శ్చాన్యే జీర్ణ మంగే సుభాషితమ్

విద్యావంతులేమో మత్సరగ్రస్తులు. పాలకులను చూద్దామా అంటే పొగరుబోతులు. పామరులకా తెలుసుకొనే శక్తి లేదు. అందువలన సుభాషితం పైకి వ్యక్తం కాకుండా లోలోపలే అణగారి పోయింది.

భర్తృహరి


మంచి ఏమిటో, మంచి మాటేమిటో జనానికి తెలిసే అవకాశం లేదని భర్తృహరి ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులకు ఇది చక్కగా వర్తిస్తుంది. ప్రజల అమాయకత్వాన్ని, భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు ముక్కలాటకు జగన్‌ రెడ్డి తెరతీశారు. దీనితో ఒక్క రాజధానికి కూడా దిక్కులేని రాష్ట్రం మూడు ముక్కలాటలో మునిగిపోయింది. ప్రజలు కూడా ఇందుకు అనుగుణంగా విడిపోయారు. వినేవాళ్లుంటే పంది కూడా పురాణం చెబుతుందన్నట్టుగా ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా మిడిమిడి జ్ఞానంతో కొందరు ప్రకటనలు చేస్తున్నారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని, నీరూ భూమీ పుష్కలంగా అందుబాటులో ఉండాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ రెడ్డి ఇచ్చిన సుదీర్ఘ నిర్వచనాన్ని జనంతో పాటు ఆయన కూడా మర్చిపోయారు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్న కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఒక్క రాజధానికే దిక్కులేదు మూడు రాజధానులా? అని బుద్ధి జీవులు వేస్తున్న ప్రశ్న మందబలం ముందు నిలవలేకపోతున్నది. జగన్‌ రెడ్డిని గతంలో తీవ్రంగా విమర్శించిన వారు ఇప్పుడు మంత్రులుగా వెలుగొందుతున్నారు. జగన్‌ తీసుకున్న నిర్ణయం అద్భుతం, అమోఘం అని చిడతలు కొడుతున్నారు. నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలుసుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. రాజకీయ పార్టీల నాయకులు తమ ఎజెండా ప్రకారం చేస్తున్న ప్రకటనలు ప్రజలను మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో శాశ్వతంగా ఉండదు.


అయినా, అధికారంలో ఉన్నవాళ్లు తమ అధికారం శాశ్వతం అని భ్రమిస్తూ, ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నప్పటికీ మత్సరగ్రస్తులైన విద్యావంతులు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తమ సొంత ఎజెండాను అమలుచేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొవిడ్‌ చిన్నాభిన్నం చేయడమే కాకుండా ప్రజల జీవితాలను ఆగం చేస్తోంది. అయినా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించని ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ చేయడం ద్వారా భక్తుల మనసులను కొల్లగొట్టారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కొవిడ్‌ గురించి జనం తాత్కాలికంగా మరచిపోయారు. శతాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించడం మోదీకి మాత్రమే సాధ్యమైందని రామభక్తులు కొనియాడుతున్నారు. అధికార బీజేపీకి ఇంతకంటే ఏమి కావాలి! తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాటలో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి బిజీగా ఉండగా, ప్రభుత్వ నిర్ణయంతో తమకు ఏదో ఒరిగిపడుతుందన్న ఆశతో కొందరున్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులది అరణ్య రోదనగా మిగిలిపోతోంది. కరోనా వైరస్‌ బారినపడినవారు వైద్యం కోసం చేస్తున్న ఆక్రందనలు గాలిలో కలిసిపోతున్నాయి. తెలంగాణలో నూతన సచివాలయ నిర్మాణం ప్రధానాంశంగా మారింది. సచివాలయ నమూనాను ఖరారు చేయడానికై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజులపాటు ఏడెనిమిది గంటల చొప్పున సమావేశాలు నిర్వహించారు. కరోనా బాధితులను పైవ్రేటు ఆస్పత్రులు పీల్చిపిప్పి చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడంలేదు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా సచివాలయం నిర్మించబోతున్నామంటూ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నంలో ప్రభువులు బిజీగా ఉన్నారు. జాతీయ స్థాయిలో రామ మందిరం, ఆంధ్రాలో మూడు రాజధానులు, తెలంగాణకు సచివాలయం ప్రధానమయ్యాయి. ప్రజలకు ఏది అవసరమో అది కాకుండా పాలకులు రాజకీయంగా బలపడటానికి ఏమి చేయాలో అదే చేస్తున్నారు. ఈ పోకడలను నిలువరించవలసినవారు మౌనాన్ని ఆశ్రయించడంతో అప్రధానమైనవన్నీ ప్రధానమవుతున్నాయి. అందుకే భర్తృహరి సుభాషితాన్ని గుర్తుచేసుకోవలసి వచ్చింది.


టూ స్టేట్స్‌...

అన్నీ ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడు, ఏమీ లేనివాడు ఎగిరెగిరిపడతాడు అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు ఈ నానుడికి చక్కగా వర్తిస్తాయి. హైదరాబాద్‌ మహానగరం రాజధానిగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చప్పుళ్లు తక్కువ. ప్రాధాన్యతల విషయం ఎలా ఉన్నప్పటికీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పూర్తి విరుద్ధమైన పరిస్థితి ఉంది. గడచిన కొంతకాలంగా మూడు రాజధానుల వ్యవహారం ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. టీవీ చానళ్ల చర్చల పుణ్యమాని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పార్టీల విధానాలకు అనుగుణంగా వాదోపవాదాలు చేస్తున్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేశారని కొందరు, ప్రస్తుత ముఖ్యమంత్రి తప్పుచేస్తున్నారని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు చేస్తున్న ప్రకటనలూ, వ్యాఖ్యలూ ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. చంద్రబాబును దోషిగా నిలబెట్టడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తుండగా, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి నిర్ణయం వల్ల జరగబోయే అనర్థాన్ని ప్రజలకు వివరించడానికి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రయాస పడుతోంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు అటూ ఇటూ దరువేస్తున్నాయి. ఇక బీజేపీ, జనసేన పార్టీ కూటమి తమదైన ఆటను మొదలెట్టింది. రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనిదని, కేంద్రానికి ఏ పాత్రా ఉండదని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించడంతో బీజేపీపై ఆశలు పెట్టుకున్నవారు నీరుగారిపోయారు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై అమరావతి రైతులకు ఇప్పటివరకూ కొద్దోగొప్పో నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆయన బీజేపీతో జతకట్టి స్వరాన్ని సవరించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తగా నియమితుడైన సోము వీర్రాజు మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను కలుసుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీగానీ, జనసేనగానీ అడ్డుకొనే ఆలోచన చేయడంలేదని ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది.


రాజధానిగా అమరావతి కొనసాగాలని అప్పుడప్పుడూ ప్రకటిస్తున్న పవన్‌ కల్యాణ్‌, ఎన్నికలకు ముందు విశాఖ వెళ్లి రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలూ ఉన్నాయని అన్నారు. కర్నూలు వెళ్లి రాజధానిగా కర్నూలు ఎందుకు ఉండకూడదు అని అన్నారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకు మూడు ముక్కలాటను నిలువరించగల సత్తా ఉంది. బీజేపీ పెద్దలు చెబితే ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిగానీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగానీ కాదనలేని పరిస్థితి. అయినా బీజేపీ నాయకులు ఆ దిశగా చొరవతీసుకోక పోగా, తమదైన శైలిలో రాజకీయ క్రీడకు తెరలేపారు. అధికార పార్టీని చెప్పుచేతల్లో ఉంచుకుంటూనే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఎంతవరకు సఫలమవుతారో తెలియదుగానీ ప్రస్తుతానికి బీజేపీని కూడా విలన్‌గా అమరావతి అనుకూలురు చూస్తున్నారు. జగన్‌ మద్దతుదారులు ఎప్పటికీ బీజేపీ వైపు చూడరు. ఈ కారణంగానే కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే పనిలో సోము వీర్రాజు పడ్డారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌తోడుగా ఉంటే కాపు సామాజిక వర్గం బీజేపీకి అండగా నిలబడే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రజా ప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సమస్య పరిష్కారానికిగానీ, రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడటానికిగానీ అన్ని పక్షాలను సమన్వయపరిచేవారే ఆంధ్రప్రదేశ్‌లో కరువయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీలన్నింటినీ సమన్వయపరిచి తెలంగాణకు అనుకూలంగా ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వంటి వారు చొరవతీసుకున్నారు. అలాంటి వాళ్లు ఏపీలో కాగడా వేసి వెదికినా కనబడటంలేదు. ప్రధాన పక్షాలైన వైసీపీ, టీడీపీ ఉప్పూ నిప్పులా చిటపటలాడుతూనే ఉన్నందున ఆ రెండు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం అసాధ్యమనే చెప్పవచ్చు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల బలం నామమాత్రం కనుక వారు నిస్సహాయులుగా మిగిలిపోవలసి వస్తోంది. ప్రజలు కూడా కుల, మత, ప్రాంతాల వారీగా విడిపోయి ఉన్నందున తమకు ఏది మంచో, ఏది చెడో తెలుసుకోలేక పోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ బాగుపడుతుందన్న నమ్మకం సన్నగిల్లకుండా ఎందుకుంటుంది! అప్పు చేయనిదే ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయినా, మూడు రాజధానులు నిర్మిస్తామంటున్నారు. పబ్లిక్‌ మెమరీ షార్ట్‌ అంటారు. ఈ కారణంగానే రాజధాని విషయంలో జగన్‌ అండ్‌ కో నాలుక మడతపెట్టినా చెల్లుబాటవుతోంది. 


ప్రమాదకర ధోరణి

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎంచుకున్న మోడల్‌ అత్యంత ప్రమాదకరంగా ఉంటోంది. సంక్షేమం పేరిట రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడం అటుంచితే, వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఆయన అమలుచేస్తున్న వ్యూహాలు భయంకరంగా ఉంటున్నాయి. పోలీసు వ్యవస్థను ప్రయోగించి నోరు తెరిస్తే చాలు కేసులు పెట్టించడం ద్వారా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి... ఇప్పుడు తనకు నచ్చని న్యాయ వ్యవస్థను టార్గెట్‌ చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఈశ్వరయ్యను న్యాయవ్యవస్థపైకి ప్రయోగించడం దిగ్ర్భాంతి కలిగిస్తోంది. హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా లొంగదీసుకోవాలనుకోవడం దుస్సాహసమే అవుతుంది. తన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత అసంబద్ధంగా ఉంటున్నప్పటికీ న్యాయస్థానాలు తనకు అనుకూలంగా తీర్పులు ఇవ్వాలని జగన్‌ భావిస్తున్నట్టుంది. అలా జరగకపోవడంవల్లనే జస్టిస్‌ ఈశ్వరయ్యవంటివారిని పావులుగా ప్రయోగిస్తున్నారు. రామకృష్ణ అనే సస్పెండయిన మేజిస్ట్రేట్‌తో జస్టిస్‌ ఈశ్వరయ్య జరిపిన సంభాషణ విస్మయం కలిగించకుండా ఎందుకుంటుంది! న్యాయ వ్యవస్థను లొంగదీసుకోవడానికి ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోకుండా ఉండగలమా? స్వతంత్ర భారతావనిలో న్యాయ వ్యవస్థను ఇలా బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకోవడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఆడియో టేపులోని సంభాషణలనుబట్టి జస్టిస్‌ ఈశ్వరయ్య హైకోర్టు న్యాయమూర్తిగా ఎలా నియమితులయ్యారు? అన్న అనుమానం కలగక మానదు. ఒకప్పటి తన సహచర న్యాయమూర్తి అయిన జస్టిస్‌ నాగార్జున రెడ్డి గురించి జస్టిస్‌ ఈశ్వరయ్య వాడిన పదజాలం న్యాయమూర్తి పదవికే కళంకం తెచ్చేదిగా ఉంది. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌గా ఉన్నారు.


పబ్లిక్‌ సర్వెంట్‌గా ఉన్న ఆయన న్యాయవ్యవస్థను టార్గెట్‌గా ఎంచుకున్నారంటే అందులో తన ప్రయోజనాలకంటే ముఖ్యమంత్రి జగన్‌ ప్రయోజనాలే అధికంగా ఉండివుంటాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరితో జస్టిస్‌ ఈశ్వరయ్యకు పరిచయం కూడా ఉండివుండదు. అయినా, జస్టిస్‌ మహేశ్వరిపై తానే ఫిర్యాదు చేయించానని మొహమాటం లేకుండా చెప్పారంటే ఇదంతా ఆయన జగన్‌ రెడ్డి కోసమే చేశారని భావించవచ్చు. జస్టిస్‌ మహేశ్వరి క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగించడాన్ని తప్పుబడుతూ జస్టిస్‌ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి టార్గెట్‌ అయ్యారు. తన రాజకీయ ప్రయోజనాలకోసం దళితులు, బీసీలను ఉపయోగించుకోవడం ముఖ్యమంత్రికి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే న్యాయ వ్యవస్థపైకి జస్టిస్‌ ఈశ్వరయ్యను ప్రయోగించారు. ఆడియో టేపుల వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు కూడా చేరింది. ఈ సంభాషణ మొత్తం వెల్లడయిన తర్వాత కూడా ప్రభుత్వం కనీసం స్పందించడంలేదు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ ప్రమేయం లేకపోతే ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేయవలసిందిగా జస్టిస్‌ ఈశ్వరయ్యను ఆదేశించాలి. అలా ఏమీ జరగలేదు అంటే, మొత్తం వ్యవహారంలో జగన్‌ రెడ్డి పాత్ర ఉన్నట్టేనని భావించాలి. న్యాయ వ్యవస్థతో ఆడుకోవాలనుకోవడం నిప్పుతో చెలగాటమే అవుతుంది. స్వయంగా అవినీతి కేసులలో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి న్యాయ వ్యవస్థతో చెలగాటమాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వికృత క్రీడలో ఆయనకు కొంత మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు సహకరించడం మరింత విషాదం! రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చినాక అవినీతి కేసులలో చిక్కుకుంటారు. జగన్‌ రెడ్డి వ్యవహారం ఇందుకు భిన్నమైనది. ఏ ప్రభుత్వ పదవిలో లేకుండానే ఆయన అవినీతి కేసులలో జైలుకు కూడా వెళ్లివచ్చారు. కేసుల విచారణను ఎదుర్కొంటూనే ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కేసులుగానీ, వాటిని విచారించే న్యాయస్థానాలుగానీ తనను ఏమీ చేయలేవన్న ధీమా జగన్‌లో ఏర్పడి ఉండవచ్చు. అందుకే ఆయన న్యాయ వ్యవస్థనే బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి తెగించారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 


ఆది నుంచి ఇదే వ్యూహం

రాజకీయ ప్రత్యర్థులపై దాడికి కూడా ఇదేవిధంగా ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను జగన్‌ గతంలో ప్రయోగించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సామాజికవర్గంపై దుష్ప్రచారం చేయడానికి పలువురిని వాడుకున్నారు. తిరుమలలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఐవైఆర్‌ కృష్ణారావు వంటి వారిని తన ప్రయోజనాల కోసం ప్రయోగించారన్న అభిప్రాయం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిరువురినీ దూరం పెట్టారు. గతంలో చీటికీ మాటికీ ఆంధ్రప్రదేశ్‌ వెళ్లి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారంచేసిన కృష్ణారావు ఇప్పుడు హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. బీసీలను రెచ్చగొట్టడానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను వాడుకున్నారు. దళితులను సంఘటితం చేయడానికై పీవీ రమేశ్‌ వంటి ఐఏఎస్‌ అధికారులను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు పీవీ రమేశ్‌కు ఇచ్చిన అధికారాలను మొత్తం లాగేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్‌ రెడ్డి చేతిలో పావులుగా మారిన వారు ఎందరో కనిపిస్తారు. ఇప్పుడు జస్టిస్‌ ఈశ్వరయ్య వంతు వచ్చింది. ఆయనపై సస్పెండైన జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌ వచ్చే సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే జస్టిస్‌ ఈశ్వరయ్య ఇబ్బందుల్లో పడతారు. ఒకప్పుడు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన హైకోర్టు విచారణ ఎదుర్కోవలసి రావడం విచారకర పరిణామం. కారణం తెలియదుగానీ, జస్టిస్‌ ఈశ్వరయ్యకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపం ఉంది. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియామకం జరిగింది.


చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆయన పేరును సిఫారసు చేసింది. జగన్‌ రెడ్డిపై సీబీఐ దర్యాప్తు జరగడానికి కూడా జస్టిస్‌ ఈశ్వరయ్య కారణం! జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను ఆయన ఇనిషియేట్‌ చేశారు. ఆ తర్వాత సదరు పిల్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు వర్తమానంలోకివస్తే, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ కోసం అదే జస్టిస్‌ ఈశ్వరయ్య వకాల్తా పుచ్చుకొని ఎన్నికలకు ముందు ప్రచారం చేసిపెట్టడమే కాకుండా, ఇప్పుడు న్యాయ వ్యవస్థతోనే పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు. న్యాయ వ్యవస్థపై దాడులు జరగడం, న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం గతంలో కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది మాత్రం ఇందుకు భిన్నం! రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందన్న భావన ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు టార్గెట్‌గా దాడి జరగడం యాదృచ్ఛికం కాదు. జస్టిస్‌ ఈశ్వరయ్య పావుగా మారారు గనుక ఈ వ్యవహారంతో తనకు ఏమి సంబంధమని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి చెప్పవచ్చు. అయితే, ఇందులో ఎవరి పాత్ర ఏమిటన్నది తేలాలంటే హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలి. న్యాయమూర్తులను లొంగదీసుకోవాలనుకున్న వారు శిక్షింపబడాలి. లేనిపక్షంలో నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వలేమని న్యాయమూర్తులు భయపడే పరిస్థితి వస్తుంది. మిగతా వ్యవస్థలలో మాదిరిగానే న్యాయవ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు. అలా అని న్యాయమూర్తులను బజారుకీడ్చే కార్యక్రమాలను అనుమతించకూడదు. అలా నిలువరించకపోతే అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయడానికి ఎవరూ మిగలరు. అమరావతిలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన వివిధ భవనాలు నిరుపయోగంగా మారితే, ఖర్చుచేసిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం రెండు రోజుల క్రితం ప్రశ్నించింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఏమిస్తారు? అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. ఇలాంటి సందర్భాలలో రైతులకు న్యాయస్థానాలు మాత్రమే దిక్కు! న్యాయాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. నిప్పుతో చెలగాటమాడితే ఏం జరుగుతుందో అలా ఆడేవారికి తెలియాల్సిందే!

                                                                             ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.