రష్యా రాయబార కార్యాలయానికి భారీ భద్రత

ABN , First Publish Date - 2022-02-26T14:45:25+05:30 IST

రష్యా - ఉక్రయిన్‌ దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో నగరంలోని రష్యన్‌ రాయబార కార్యాలయం, ఇతర కార్యాల యాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మరీ ముఖ్యంగా శాంథోమ్‌ ప్రాంతంలో రష్యన్‌ రాయబార కార్యాలయం,

రష్యా రాయబార కార్యాలయానికి భారీ భద్రత

- పరిసర ప్రాంతాల్లో డేగకన్నుతో పహారా 

- విద్యార్థుల ప్రయాణ ఖర్చు మేమే భరిస్తాం: స్టాలిన్‌


చెన్నై: రష్యా - ఉక్రయిన్‌ దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో నగరంలోని రష్యన్‌ రాయబార కార్యాలయం, ఇతర కార్యాల యాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మరీ ముఖ్యంగా శాంథోమ్‌ ప్రాంతంలో రష్యన్‌ రాయబార కార్యాలయం, ఆళ్వార్‌పేట కస్తూరిరంగన్‌ రోడ్డులో రష్యన్‌ కల్చరల్‌ సెంటర్‌ వద్ద ఎన్నడూ లేనంతగా సాయుధ బలగాలతో భద్రత కల్పించారు. ఈ రెండు కార్యాలయాలున్న మార్గాల్లో వెళ్లే వాహనాలపై నిఘా వేశారు. ఇదే విధంగా పాదచారులను కూడా తనిఖీ చేస్తున్నారు. రష్యన్‌ రాయబార కార్యాలయం పరిసర ప్రాంతాలను డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. ఇదే విధంగా నగరంలో రష్యా దేశస్థులు నివసిస్తున్న ప్రాంతాల్లోనూ మఫ్టీలో పోలీసులు నిఘా వేస్తున్నారు. ఇదిలా వుండగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసిపోవాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకూడదంటూ నగరంలోని పలు విద్యాలయాల్లో విద్యార్థులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 


విద్యార్థుల ప్రయాణ ఖర్చులు మేమే భరిస్తాం: స్టాలిన్‌

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమిళ విద్యార్థులు స్వస్థలానికి తిరిగి వచ్చేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినవెంటనే తమిళ విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో అన్ని చర్యలు ప్రారంభించిందని, ఢిల్లీలోని ప్రభుత్వ ఉన్నతాధికారుల ద్వారా కేంద్ర ఉన్నతాధికారులను సంప్రదించి తగు ఏర్పాట్లు కూడా చేపడుతున్నామని ఆయన వివరించారు. ఉక్రెయిన్‌లో సుమారు ఐదువేల మంది తమిళ విద్యార్థులు మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, ఏరోస్పేస్‌ వంటి కోర్సులు చదువుతున్నారని, విద్య, వ్యాపారం కోసం వెళ్ళిన తమిళులు కూడా ఆ దేశంలో ఉన్నారని, వీరంతా సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తమిళ విద్యార్థులందరినీ స్వస్థలానికి తరలించేందుకు తక్షణ ఏర్పాట్లు చేపట్టాలని, ఆయా జిల్లాలకు చెందిన ఎంతమంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో వున్నారో వివరాలను తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. ఉక్రెయిన్‌లోని తమిళులు, విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ టెలిఫోన్‌ నెంబర్లు ప్రకటించామని, ఆ మేరకు శుక్రవారం ఉదయం పది గంటల వరకూ రాష్ట్రానికి చెందిన 916 మంది విద్యార్థులు, ఉక్రెయిన్‌కు వలస వెళ్లిన తమిళులు ప్రభుత్వాధికారులను సంప్రదించినట్టు వివరించారు. ఉక్రెయిన్‌ నుంచి తమిళ విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు సహాయ సహకారాలందించటానికి ప్రవాస తమిళుల సంక్షేమ, పునరావాస సంస్థ కమిషనర్‌ జెసింతా లాజర్‌సను నియమించినట్టు ఆయన పేర్కొన్నారు. 9445869848, 9600023645. 9940256444, 044-28515288 నెంబర్లలో ఆ అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. అత్యవసర సహాయాల కోసం ఢిల్లీలోని తమిళనాడు పొదిగై ఇల్లమ్‌ ఉన్నతాధికారులను 9289516716 వాట్సప్‌ నెంబర్‌లో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



Updated Date - 2022-02-26T14:45:25+05:30 IST