ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2022-05-27T05:53:05+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ పెద్దలింగాపూర్‌, అనంతారం రైతులు గురువారం రాస్తారోకో చేపట్టారు.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల రాస్తారోకో
పెద్దలింగాపూర్‌లో రాస్తారోకో చేస్తున్న రైతులు

ఇల్లంతకుంట, మే 26: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ పెద్దలింగాపూర్‌, అనంతారం రైతులు గురువారం రాస్తారోకో చేపట్టారు.   కేంద్రంలో ధాన్యం పోసి రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారపార్టీ నాయకులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇసుక తరలించడానికి లారీ ఉంటున్నాయని, ధాన్యాన్ని తరలించడానికి ఎందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకో వద్దకు పెద్దలింగాపూర్‌ సర్పంచ్‌ గొడిశెల జితేందర్‌గౌడ్‌ రాగా కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పసుల వెంకటి కాళ్లు మొక్కి రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని  విన్నవించారు. విషయం తెలుసుకున్న ఎస్సై మహేందర్‌ పెద్దలింగాపూర్‌కు చేరుకున్నారు. రైతులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. ఇదే సమయంలో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పెద్దలింగాపూర్‌ గ్రామానికి రాగా రైతులు తమ ఆవేదన విన్నవించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను కొంత మంది అవమానించేలా మాట్లాడుతున్నారని, ఎంతవరకు సమంజసమని రైతు నవీన్‌రెడ్డి, మరికొంతమంది మరోసారి నిరసనకు దిగారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:53:05+05:30 IST