కుక్కకు గొడుగు పట్టిన తాజ్ ఉద్యోగి

Sep 24 2021 @ 18:36PM

ముంబై: ఓ వీథి కుక్కపై తాజ్ హోటల్స్ ఉద్యోగి చూపిన ఆదరణ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆ కుక్క వర్షంలో తడిసిపోకుండా ఆ ఉద్యోగి గొడుగు పడుతున్నట్లు కనిపిస్తున్న ఓ ఫొటోను టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా షేర్ చేశారు. వర్షాకాలంలో వీథి కుక్కలను ఆదరిస్తున్నందుకు ప్రశంసించారు. 


‘‘ఈ వర్షాకాలంలో వీథి కుక్కలకు ఆదరణను పంచడం’’ అనే క్యాప్షన్‌తో రతన్ టాటా ఈ పోస్ట్ పెట్టారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ తాజ్ ఉద్యోగి తన గొడుగును అనేక వీథి కుక్కల్లో ఒకదానికి ఆశ్రయమిచ్చారని ప్రశంసించారు. రద్దీగా ఉండే ముంబైలో మనసుకు హత్తుకునే క్షణాన్ని క్యాప్చర్ చేసినట్లు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు వీథుల్లో తిరిగే జంతువులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు దాదాపు పది లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. 


ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం బోంబే హౌస్‌లో కెన్నెల్స్ ఉన్నాయి. ఆ ప్రాంతంలోని వీథి కుక్కలకు ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నారు. వీథి కుక్కలను ఆదుకుని, దత్తత తీసుకోవడానికి ఈ ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తారనే సంగతి అనేక మందికి తెలుసు. రతన్ టాటా గత ఏడాది దీపావళిని వీటితో కలిసి జరుపుకున్నారు. 


వీథి కుక్కకు గొడుగు పట్టిన తాజ్ హోటల్ ఉద్యోగిని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన బంగారు హృదయంగల వ్యక్తి అని ఓ నెటిజన్ ప్రశంసించారు. రతన్ టాటా మంచితనం ఆయన వద్ద పని చేసేవారికి కూడా వ్యాపించిందని మరొకరు పేర్కొన్నారు. ఆ ఉద్యోగికి ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆయన చూపిన దయకు ప్రత్యేక బహుమతి ఇవ్వాలని మరొకరు అన్నారు. ఓ క్లిక్‌లో ముంబై స్ఫూర్తిని నిర్వచించారని మరొకరు పేర్కొన్నారు. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.