ధరల పిడుగు

ABN , First Publish Date - 2021-03-01T05:15:46+05:30 IST

వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తున్న రైతులపై మరో పిడుగు పడనుంది.

ధరల పిడుగు

  • ఎరువుల ధరలకు రెక్కలు.. రానున్న రెండునెలల్లో అమలు?  
  • వ్యవసాయంలో పెరగనున్న పెట్టుబడి వ్యయం 
  • ముడిసరుకుల ధరలు పెరగడమే కారణమంటున్న కంపెనీలు
  • రెండేళ్లలో రెండుసార్లు పెరిగిన ఫర్టిలైజర్‌ ధరలు 
  • గడిచిన 12 ఏళ్లలో 18 మార్లు పెరుగుదల 
  • చితికిపోతున్న చిన్న, సన్నకారు రైతులు


వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తున్న రైతులపై మరో పిడుగు పడనుంది. ఎరువుల ధరలు పెరుగుతుండటంతో లబోదిబోమంటున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరగడంతో వ్యవసాయం చేయలేమంటూ  బోరుమంటున్న రైతన్నపై ఎరువుల ధర పెరుగుదల గుదిబండగా మారనుంది.  ఎరువుల తయారీకి వినియోగించే ప్రధాన ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడం వల్ల డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు ఉత్పత్తి చేసే కంపెనీలు ధరలు పెంచాయి. పెరిగిన ధరలు మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : ఇప్పటికే పంట పెట్టుబడులు పెరిగి అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్న అన్నదాతలకు పెరగనున్న ఎరువుల ధరలు భారంగా మారనున్నాయి. పెరిగిన ధరలు మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఎరువుల తయారీ సంస్థలు వ్యాపారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందజేసినట్లు చెబుతున్నారు. ఎరువుల తయారీకి వినియోగించే ప్రధాన ముడి సరుకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడం వల్ల డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులు ఉత్పత్తి చేసే కంపెనీలు ధరలు పెంచాయి. అంత ర్జాతీయంగా డాలర్‌తోపాటు రూపాయి విలువ పతనమైందనే నెపంతో 50కిలోల ఎరువుల బస్తాపై రూ.100 నుంచి రూ.200 వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. వానాకాలం, యాసంగి సీజన్లలో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో రైతులు వినియోగించే ఎరువుల ఆధారంగా ఏటా రైతులపై సుమారు రూ.40కోట్ల భారం అదనంగా పడనున్నట్లు సమాచారం. గత 12 ఏళ్లలో ఎరువుల ధరలు 18 పర్యాయాలు పెరిగాయి. భారీగా పెరిగిన ధరలు సన్న, చిన్నకారు, కౌలు రైతులకు పెనుభారంగా మారనున్నాయి. కొవిడ్‌ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆయా పరిశ్రమలకు ప్రత్యేక ఉద్దీపనల పేరిట వేలాది కోట్లు వెచ్చిస్తున్నా.. పరిశ్రమలు మాత్రం తమ ఉత్పత్తుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతూనే ఉన్నాయి. 


రెండేళ్లలో రెండోసారి..

ఎరువుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. వానాకాలం సీజన్‌ నుంచి పెరగనున్న ఎరువుల ధరలు రైతులకు మరింత భారం కానున్నాయి. ఏడాదిన్నర కిందట పెరిగిన ఎరువుల ధరలతో ఇబ్బంది పడుతున్న రైతులు ఆ భారం నుంచి తేరుకోక ముందే మరోసారి వడ్డించేందుకు ఎరువుల కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. కరోనా కారణంగా అన్ని ధరలు మండిపోతున్న ఈ సమయంలో ఎరువుల ధరలు కూడా పెరగబోతున్నాయనే విషయం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 2020 వానాకాలం సీజన్‌లో మొత్తం 65,604.84 టన్నుల ఎరువును వినియోగించారు. ఇందులో యూరియా 24,022.34 టన్నులు, డీఏపీ 10,045 టన్నులు, కాంప్లెక్స్‌ 28,861 టన్నులు, ఎస్‌ఎస్‌పీ 662.5 టన్నులు, ఎంఓఈ 2014 టన్నులు వినియోగించారు. 2020-21 సంవత్సరం యాసం గిలో 20,800 టన్నుల ఎరు వులు అవసరం కాగా 11,644 టన్నులు వినియోగిం చారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలో గత వానాకాలం సీజన్‌లో జిల్లాకు 63,187 టన్నుల యూరియా, డీఏపీ, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాషియం, కాంప్లెక్స్‌, ఎస్‌ఎస్‌పీ ఎరువులు అవసరమవుతాయని అంచనా వేస్తే, 55,792 మెట్రిక్‌ టన్నుల వరకు ఎరువులు వినియోగించారు. 


సాగు మరింత భారం

ఇదిలా ఉంటే, సాగు మరింత భారం కానుంది. ఏటేటా పెరుగుతున్న పెట్టుబడులతో రైతులు కుదేలవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో వానాకాలంలో 3,99,561 ఎకరాల సాగు విస్తీర్ణం కాగా 4,71,795.22 ఎకరాల విస్తీర్ణంలో వరి, కందులు, పత్తి, జొన్న, పెసర్లు, మినుములు, ఆముదాలు, చెరకు, ఇతర పంటలు సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువగా సాగు చేశారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలో వానాకాలంలో 5,50,106.21 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయగా, యాసంగిలో లక్ష ఎకరాలకు పైగానే వివిధ పంటలు సాగు చేశారు. పెట్టుబడులు పెరుగుతుండడంతో రైతులు అప్పులు తీసుకోక తప్పడం లేదు. పెరగనున్న ఎరువుల ధరలతో వచ్చే వానాకాలంలో ఎరువులకయ్యే ఖర్చులు పెరగనున్నాయి. ప్రతిఏటా ఎకరా పంట పెట్టుబడులకు అయ్యే వ్యయం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-03-01T05:15:46+05:30 IST