ఇవేం ధరలు బాబోయ్‌!

ABN , First Publish Date - 2021-02-28T05:02:29+05:30 IST

ఏడాది కాలంగా కరోనా ప్రభావంతో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

ఇవేం ధరలు   బాబోయ్‌!

కరోనా నుంచి కోలుకోకనే ప్రజలపై భారం

చుక్కలు చూపుతున్న ఇంధన ధరలు

అందనంత ఎత్తులో నిత్యావసరాలు

విలవిల్లాడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు 


కావలి, ఫిబ్రవరి 27 : ఏడాది కాలంగా కరోనా ప్రభావంతో ఆర్థికంగా చితికిపోయిన ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు  పెరుగుతున్న ధరలను చూసి అన్ని వర్గాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలతోపాటు వంట నూనెలు, నిత్యావసర సరుకులు, ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధరలు అమాంతం పెరిగి సామన్య ప్రజల జీవనవిధానం భారంగా మారుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. సంక్షేమ ఫలాలను గురించి గొప్పగా చెప్పుకుంటున్న పాలకులకు పెరిగిన ధరలతో ప్రజల నడ్డి విరుగుతున్న విషయం గుర్తుకు రావటం లేదు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు కొందరికి మాత్రమే అందుతుండగా ధరల పెంపు అందరిపై పడుతోంది. 


ఇంధన ధరతో..


అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అవసరమైన వంటగ్యా్‌స ధర ఫిబ్రవరి నెలలోనే మూడుసార్లు పెరిగింది. సిలిండర్‌ బండపై ఒక్కనెలలోనే రూ.100 పెరిగిపోయింది. ఇదికాకుండా పెట్రోలు, డీజిల్‌ ధర రోజురోజుకు చుక్కలను చూపుతోంది. లీటరుకు సుమారు రూ.25లకు పైనే పెరిగింది. శనివారం నాటికి లీటరు పెట్రోలు రూ.98.02, డీజిల్‌ రూ.91.44 చేరింది. ప్రతి కుటుంబంలో ద్విచక్రవాహనం వాడకం సర్వసాధారణమైంది. దీంతో పెట్రో ధరలు పెంపుతో నెలకు ఒక్కో కుటుంబానికి రూ.200 వరకు అదనపు భారమైంది. డీజిల్‌ ధర పెంపు  ప్రభావం రవాణా చార్జీలపై పడి నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఏర్పడింది. వాహనాలు నడుపుకుంటున్న వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.


కాగుతున్న వంట నూనెలు


ప్రతి ఇంట్లో నిత్యం అవసరమైన వంట నూనె ధర కాగుతోంది. మూడు నెలల్లో వంటనూనె ధర కిలోకు రూ.25 నుంచి రూ.35 వరకు పెరిగింది. మూడు నెలల కిందట కిలో రూ.115 ఉన్న సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ప్రస్తుతం రూ.150 పలుకుతోంది. కిలో రూ.90 ఉన్న పామాయిల్‌ రూ.120 పలుకుతోంది. ఇక బియ్యం, పప్పుల ధరలకూ రెక్కలొచ్చాయి. ఇప్పుడు ఉల్లి కూడా ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. మొన్నటి వరకు రూ.30 ఉన్న కిలో ఉల్లి ధర  స్ర్తుతం రూ.55 చేరింది. ఇలా పెరుగుతున్న ఈ ధరలు ఎక్కడ ఆగుతాయో కూడా తెలియటంలేదు. 


ఇక కొని.. తినలేం!

ఇప్పుడున్న ధరలు నా జీవితంలో చూడలేదు. అధిక ధరలతో మాలాంటి వారు నిత్యావసరాలు కొని తినలేని పరిస్థితి. మొన్నటి వరకు రూ.80, 90 ఉన్న పామాయిల్‌ రూ.120కు పెరగడం చూస్తుంటే ఇంకెంత పెరుగుతుందోనని ఆందోళన కలుగుతోంది. వంటగ్యాస్‌ ఒక్క నెలలోనే రూ.100 సెరిగింది.

 - కె పద్మ, గృహిణి, ముసునూరు 



డీజిల్‌ పెంపుతో జీవనం కష్టం

ఏడాది కిందట రూ.70 ఉన్న డీజిల్‌ ధర ప్రస్తుతం రూ.91.44కు చేరింది. గతంలో రోజుకు రూ.500 వస్తే రూ.300 మిగిలేది. ఇప్పుడు డీజిల్‌ ధర పెరగడం, కరోనా కారణంగా ప్రయాణికులు ఎక్కడమే కష్టమవుతున్నందున రోజుకు రూ.350 వస్తుండగా డీజిల్‌కు పోను రూ.200 కూడా మిగలడం లేదు.

- షేక్‌. అన్వర్‌, ఆటో డ్రైవరు, కావలి


చిరువ్యాపారులను దెబ్బతీసింది

వంటగ్యాస్‌ రూ.100 పెరగడంతో బండ్లపై చిరుతిండ్లు తయారు చేసే వ్యాపారం గిట్టుబాటు కావడంలేదు. అసలే కరోనా కరణంగా రోజువారి వ్యాపారాలు తగ్గిపోవడంతోపాటు ధరల పెంపు పెనుబండగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే దుకాణాలు మూతపడతాయి.

- కొమరా సామ్రాజ్యం, చిరువ్యాపారి, వైకుంఠపురం


నూనె ధరలు నింగినంటాయి

నెలలో వంట నూనె ధరలు రెట్టింపయ్యాయి. రూ.80 ఉన్న నూనె రూ.160 చేరడం, పప్పుల ధర అమాంతం పెరగడంతో ఖర్చులు పెరిగిపోయాయి.  ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

- రాయపనేని రాజా, గూడూరు



సైకిళ్లే నయం!

బళ్లకు పెట్రోలు పోసేదానికంటే సైకిళ్లలో తిరగడం మంచిది అనిపిస్తోంది. కళ్ల ముందే పెట్రోలు లీటరు రూ.97.17, డీజిల్‌ రూ.90.65 కావడంతో వినియోగదారుడిగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నా. సామాన్యుల మీద భారం పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదు. 

- తూపిలి శ్రీనివాస్‌, మెకానిక్‌, గూడూరు



ఇవేం ధరలు బాబోయ్‌! 

నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంత ధరలతో ఏ వస్తువులను కొనలేక పోతున్నాం. ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవాలి. 

- నరేష్‌, ప్రైవేట్‌ ఉద్యోగి, నెల్లూరు

Updated Date - 2021-02-28T05:02:29+05:30 IST