ఈ ఏడాది వృద్ధి 8.5 శాతమే

ABN , First Publish Date - 2021-05-07T06:23:37+05:30 IST

ప్రస్తుత కరోనా ఉదృతి నేపథ్యంలో విధించిన స్థానిక లాక్‌డౌన్లు, ఆర్థిక కార్యకలాపాల్లో ఏర్పడిన అంతరాయాల ప్రభావం వల్ల వర్తమాన ఆర్థిక సంవత్సరం...

ఈ ఏడాది వృద్ధి 8.5 శాతమే

  • క్రెడిట్‌ సూయిస్‌ 

న్యూఢిల్లీ : ప్రస్తుత కరోనా ఉదృతి నేపథ్యంలో విధించిన స్థానిక లాక్‌డౌన్లు, ఆర్థిక కార్యకలాపాల్లో ఏర్పడిన అంతరాయాల ప్రభావం వల్ల వర్తమాన ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్ధి రేటు 8.5 శాతం నుంచి 9 శాతానికి పరిమితం కావచ్చని స్విస్‌ బ్రోకరేజీ సంస్థ క్రెడిట్‌ సూయిస్‌ అంచనా వేసింది. అలాగే ఆర్థిక వ్యవస్థ పూర్వ స్థాయికి పునరుజ్జీవం సాధించే వ్యవధి మరో రెండు మూడు సంవత్సరాలు జాప్యమై 2022-23 దాటవచ్చని కూడా పేర్కొంది. జీడీపీపై ఈ రెండో విడత కరోనా విజృంభణ ప్రభావం 1 శాతం నుంచి 1.5 శాతం మేరకు పడవచ్చని సంస్థ విశ్లేషకుల అంచనా. వాస్తవానికి 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా కరోనా దెబ్బ తీసిందని, అందుకు సంబంధించిన అన్ని ప్రణాళికలు విచ్ఛిన్నం అయ్యాయని కంపెనీ ఈక్విటీ స్ర్టాటజీ హెడ్‌ నీలకంఠ మిశ్రా అన్నారు.  అయితే ఈ రెండో విడత విజృంభణ ఎంత కాలంలో అదుపులోకి వస్తుంది, ప్రభుత్వ ఆంక్షల తీవ్రత ఏ మేరకుంటుంది అనే దాన్ని బట్టి వృద్ధి మహమ్మారి ముందు కాలం నాటి సాధారణ స్థాయికి ఎప్పుడు చేరుతుందనేది ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. తమ అంచనా ప్రకారం మే మధ్య నాటికి కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ప్రారంభించవచ్చని చెప్పారు. 


ఫిచ్‌ ఏమంటోందంటే: ప్రస్తుతం కరోనా రెండో దశ విజృంభణను అదుపు చేయడానికి పలు ప్రాంతా ల్లో విధించిన కట్టడి చర్యలు ఆర్థిక రికవరీకి విఘాతం కలిగిస్తాయని, ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతానికి దిగజారవచ్చని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అభిప్రాయపడింది. కరోనా కట్టడికి ప్రభుత్వ అరకొర చర్యలతో పాటు ప్రజలు ప్రజారోగ్య మార్గదర్శకాలను కఠినంగా ఆచరించకపోవడం కూడా సమస్యను జటిలం చేస్తున్నదని పేర్కొం ది. 10 వేల జనాభాకు 8.5 ఆస్పత్ర పడకలు, ప్రతి 10 వేల మందికి 8 మంది వైద్యులు మాత్రమే ఉన్నందు వల్ల ఇంత భారీ సంక్షోభాన్ని ఎదుర్కొనగల స్థాయిలో భారత ఆరోగ్య సంరక్షణ రంగం లేదని స్పష్టం చేసింది. 


Updated Date - 2021-05-07T06:23:37+05:30 IST