రేటింగ్స్‌.. రిగ్గింగ్‌!

ABN , First Publish Date - 2021-01-22T09:08:06+05:30 IST

మాయ... అంతా మాయ! టీవీ చానళ్ల ప్రేక్షకాదరణకు కొలమానమైన టీఆర్పీ (టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్‌) నిర్ధారణలో రకరకాల గిమ్మిక్కులు జరిగినట్లు తేలింది.

రేటింగ్స్‌.. రిగ్గింగ్‌!

  • చానళ్ల టీఆర్పీతో బార్క్‌ మాజీల గేమ్స్‌
  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ రేటింగ్స్‌ తగ్గింపు
  • టీవీ9, సాక్షి రేటింగ్స్‌ అసలుకు మించి పెంపు..
  • రిపబ్లిక్‌ టీవీ వివాదంతో ఏఆర్‌సీ ‘పరిశోధన’
  • బార్క్‌ మాజీల మధ్య ఈ-మెయిల్స్‌ గుర్తింపు..
  •  తెలుగు, కన్నడ న్యూస్‌ చానళ్లతో ఆటలు


మార్చి.. ఏమార్చి!టీవీ చానళ్ల రేటింగ్స్‌ను రిగ్గింగ్‌ చేసిన ‘బార్క్‌’ మాజీ పెద్దలు దీనికోసం అడ్డదారులు తొక్కుతూ, అనైతిక విధానాలు అనుసరించినట్లు ఏఆర్‌సీ సంస్థ వెల్లడించింది. తాము ‘ఆశించిన ప్రయోజనాలు’ సాధించేందుకు వివిధ విభాగాల్లోని సిబ్బందిని అటూఇటూ మార్చినట్లు గుర్తించింది. ‘‘బార్క్‌ ఇండియా పీపుల్‌ ఆపరేషన్‌ మాజీ చీఫ్‌ మనాషి కుమార్‌ సంస్థ నైతిక నియమావళిని ఉల్లంఘించారు. పరిశోధన సంస్థగా ఉన్న బార్క్‌ను... వాణిజ్య సంస్థగా మార్చారు. ఆ తర్వాత బార్క్‌ బ్రాండ్‌ విలువ పడిపోయింది. సంస్థ ఇచ్చే రేటింగ్స్‌ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది’’  అని ఏఆర్‌సీ తన నివేదికలో తెలిపింది. అప్పట్లో సంస్థ నిధులు కూడా దుర్వినియోగమైనట్లు తెలిపింది.


అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): మాయ... అంతా మాయ! టీవీ చానళ్ల ప్రేక్షకాదరణకు కొలమానమైన టీఆర్పీ (టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్‌) నిర్ధారణలో రకరకాల గిమ్మిక్కులు జరిగినట్లు తేలింది. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి రేటింగ్స్‌ను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తూ... సాక్షి, టీవీ9 రేటింగ్స్‌ను పెంచినట్లు రుజువైంది. టీఆర్పీని ప్రకటించే 


బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసర్చ్‌ కౌన్సిల్‌ ఇండియా (బార్క్‌) మాజీ పెద్దలు పలు చానళ్ల రేటింగ్స్‌ను  ‘తమకు నచ్చిన విధంగా’ పెంచుతూ, తగ్గిస్తూ వచ్చినట్లు తేలింది. ‘అక్వైజరీ రిస్క్‌ కన్సల్టింగ్‌’ (ఏఆర్‌సీ) అనే సంస్థ జరిపిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. ఆర్ణబ్‌ గోస్వామి నేతృత్వంలోని రిపబ్లిక్‌ టీవీతోపాటు రెండు మరాఠీ చానళ్లు  రేటింగ్స్‌ మాయకు పాల్పడ్డాయంటూ ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. టీఆర్పీ రిగ్గింగ్‌ స్కామ్‌లో బార్క్‌ మాజీ సీఈవో దాస్‌గుప్తా సహా పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు కూడా! ఇదే క్రమంలో బార్క్‌లో ఉన్నతస్థాయిలో పని చేస్తున్న వ్యక్తుల మధ్య సాగిన  ఈ-మెయిల్స్‌ను ఏఆర్‌సీ బయటికి లాగింది. బార్క్‌ పెద్దలంతా కలిసి ఒక అవగాహనతో, పరస్పరం సమాచారం ఇచ్చుకుంటూ టీఆర్పీ రిగ్గింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఏఆర్‌సీ విశ్లేషణను ఉటంకిస్తూ... ‘ఎక్స్‌చేంజ్‌ఫర్‌మీడియా’ వెబ్‌సైట్‌ ఈ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం...


రిగ్గింగ్‌... ‘సామ్రాట్‌’

టీఆర్పీ రిగ్గింగ్‌లో బార్క్‌ ఇండియా ప్రొడక్ట్‌ లీడర్‌షిప్‌ మాజీ అధిపతి వెంకట్‌ సుజిత్‌ సామ్రాట్‌ బాగా చక్రం తిప్పారు. ఫలానా చానల్‌ రేటింగ్స్‌ పెంచాలని, కొన్నింటిని తగ్గించాలని బార్క్‌ సీనియర్‌ మేనేజ్‌మెంట్‌లో భాగమైన రజనీశ్‌ రాథోడ్‌ తదితరులకు సూచించేవారు. 2017లో 1, 2, 4, 7 వారాలు, 2018లో ఆగస్టు నెల, 2019లో 9, 20, 29 వారాల రేటింగ్స్‌లో మాయ చేశారు. తెలుగు చానళ్లకు సంబంధించి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితోపాటు ఒకటి రెండు చానళ్ల రేటింగ్స్‌తో ‘గేమ్స్‌’ ఆడారు. ‘‘డిసెంబరు 31న కొత్త ఏడాదికి స్వాగతం పలికే కార్యక్రమాల ప్రసారంతో ఆయా చానళ్ల రేటింగ్స్‌ పెరిగాయి. కానీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితోపాటు మరో రెండు చానళ్ల రేటింగ్స్‌ను తగ్గించారు. అది ఆ చానళ్ల అంతకుముందు నాలుగు వారాల సగటుతో పోల్చితే బాగా తక్కువ’’ అని ఏఆర్‌సీ పేర్కొంది.  అదే సమయంలో టీవీ9, సాక్షి టీవీ రేటింగ్స్‌ను  ‘అసలు’కు  మించి పెంచినట్లు 2017 రెండోవారంలో నడిచిన ఈ-మెయిల్స్‌ ద్వారా స్పష్టమైంది. టీవీ9, సాక్షి రేటింగ్స్‌ను ఎంత పెంచాలో రజనీశ్‌ రాథోడ్‌ ప్రతిపాదించారు. వెంకట్‌ సుజిత్‌ అందుకు సరే అన్నారు. అలాగే... రేటింగ్స్‌ను ‘మ్యాన్యువల్‌’గా మార్చాలని, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రేటింగ్స్‌ తగ్గించాలని  వెంకట్‌ సుజిత్‌ ఒక ఈ-మెయిల్‌లో రాథోడ్‌కు తెలిపారు. రేటింగ్స్‌కు సంబంధించి వెంకట్‌ సుజిత్‌, రజనీశ్‌తోపాటు బార్క్‌ ఇండియా మాజీ సీవోవో రొమిల్‌ రామ్‌గఢియా, వెస్ట్‌ పార్ట్‌నర్‌షిప్‌ మాజీ వైస్‌ప్రెసిడెంట్‌ రుషభ్‌ మెహతా, స్ట్రాటజీ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ పేఖమ్‌ బసు మధ్య ఈ-మెయిల్స్‌ నడిచాయి. పేఖమ్‌ బసు... రజనీశ్‌  రాథోడ్‌తోపాటు రుషభ్‌ మెహతాకు ఈ-మెయిల్‌ ద్వారా కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేశారు. అవేమిటంటే...


ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, మరో రెండు చానళ్ల రేటింగ్స్‌ను ఎన్‌టీవీ కంటే తగ్గించాలి.

టీవీ9 రేటింగ్స్‌ తగ్గినప్పటికీ... దానిని ఎన్‌టీవీకి దగ్గర దగ్గరగా ఉంచండి.


పెంచింది తుంచుతూ!

2017 సంవత్సరం ఆరో వారంలో... తెలుగు న్యూస్‌ చానళ్ల సగటు రేటింగ్‌ 39 శాతం పెరిగింది. అయితే... ఈ పెంపును 10 నుంచి గరిష్ఠంగా 15 శాతానికి పరిమితం చేయాలని వెంకట్‌ సుజిత్‌ సూచించారు.


జాగ్రత్తగా వేస్తూ... తీస్తూ!

చానళ్ల రేటింగ్‌ ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన మీటర్ల ద్వారా దానంతట అదే నిర్ణయమవుతుంది. కానీ... కొన్ని తెలుగు న్యూస్‌ చానళ్ల రేటింగ్స్‌ను నాటి బార్క్‌ పెద్దలు మాన్యువల్‌గా ‘నియంత్రించినట్లు’ ఈ-మెయిల్స్‌ ద్వారా తేలింది. ఇదంతా ఇతరులకు అనుమానం రాకుండా చేయాలనే జాగ్రత్త కనిపించింది. ‘‘ఎవరైనా నిశితంగా పరిశీలిస్తే... కొన్ని చానళ్లను మనం మరీ ఎక్కువగా కంట్రోల్‌ చేస్తున్నట్లు ఇట్టే అర్థమవుతుంది’’ అంటూ వెంకట్‌ సుజిత్‌ కొన్ని సలహాలు ఇచ్చారు. అవేమిటంటే...

టీవీ9 రేటింగ్‌ పాయింట్లలో పెంపుదల మరీ ఎక్కువ ఉండొద్దు.

ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌ను అలాగే ఉంచేద్దాం.

సాక్షికి 10-12 పాయింట్ల గెయిన్‌ చూపిద్దాం.

టీవీ5 కన్నడ రూరల్‌ గ్రోత్‌ను 150 శాతం నుంచి 130కి తగ్గించాలి.


పెద్దలకు తెలిసే...

ఇప్పటిదాకా బయటపడ్డ ఈ-మెయిల్స్‌ను  పరిశీలిస్తే.. అప్పటి బార్క్‌ పెద్దల ‘ఆమోదం’తోనే వెంకట్‌ సుజిత్‌ సూచనల మేరకు కొన్ని చానళ్ల రేటింగ్స్‌ రిగ్గింగ్‌ జరిగినట్లు సులువుగా అర్థమవుతోంది. రేటింగ్స్‌ నమోదులో కీలకమైన ‘ప్యానెల్స్‌’ విషయంలోనూ గోల్‌మాల్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఒక చానల్‌కు సంబంధించిన వ్యూయర్‌షి్‌పను తగ్గించేలా... హై వ్యూయింగ్‌ ప్యానెల్‌ హోమ్స్‌ను మార్చేద్దామా? అని వెంకట్‌ సుజిత్‌ రొమిల్‌ సలహా కోరడం దీనికి నిదర్శనం. టీఆర్పీ రిగ్గింగ్‌ కుంభకోణంలో బార్క్‌ ఇండియా మాజీ సీఈవో పార్థో  దాస్‌ గుప్తా, సీవోవో రొమిల్‌ రామ్‌గఢియాలను ముంబై పోలీసులు గతనెలలోనే అరెస్టు చేశారు. రేటింగ్స్‌ రిగ్గింగ్‌ సూత్రధారి పార్థో దాస్‌గుప్తాయేనని, లక్షలకొద్దీ లంచాలు తీసుకుని ఒక ఇంగ్లీష్‌ వార్తా చానల్‌ రేటింగ్స్‌ను భారీగా పెంచినట్లు ఆరోపణలు వచ్చాయి.

Updated Date - 2021-01-22T09:08:06+05:30 IST