ఉచిత బియ్యం పంపిణీకి బ్రేక్‌ !

ABN , First Publish Date - 2020-12-03T05:12:09+05:30 IST

ఎనిమిది నెలలుగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి బ్రేక్‌ పడనుంది.

ఉచిత బియ్యం పంపిణీకి బ్రేక్‌ !

  • గతంలో మాదిరిగానే కిలో బియ్యానికి రూపాయి వసూలు
  • డిసెంబరు నెల నుంచి కొనసాగింపు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : ఎనిమిది నెలలుగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి బ్రేక్‌ పడనుంది. కేంద్ర ప్రభుత్వం కరోనా ఉధృతి కాలంలో పేదలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ అన్న యోజన కింద సరఫరా చేసిన ఉచిత బియ్యం పంపిణీ గడువు సోమవారంతో ముగిసింది. ఈ పథకం పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం పంపిణీకి స్వస్తి పలికాయి. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏప్రిల్‌ నెల నుంచి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తూ వచ్చాయి. మూడు నెలలపాటు నెలనెలా 5 కిలోల బియ్యంతోపాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు సరఫరా చేయగా, రాష్ట్ర ప్రభుత్వం మరో 7కిలోలు అదనంగా కలిపి ఒక్కొక్క లబ్ధిదారునికి 12కిలోల వంతున ఉచితంగా సరఫరా చేశారు. కరోనా ఉధృతి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని జూలై నుంచి నవంబరు వరకు పొడిగించింది. ఈ సమయంలో  కేంద్రం సరఫరా చేసిన 5 కిలోలకు రాష్ట్ర ప్రభు త్వం మరో 5 కిలోలు కలిపి ఒక్కొక్కరికీ ప్రతినెలా 10కిలోల వంతున ఐదు నెలలపాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన గడువు నవంబరు 30తో ముగిసింది. దీంతో డిసెంబరు నెల నుంచి పాత విధానం ద్వారానే రేషన్‌ బియ్యం, చక్కెర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ కంటే ముందు ప్రతినెలా వికారాబాద్‌ జిల్లాలో ఉన్న 2.35 లక్షల ఆహారభద్రత లబ్ధిదారుల్లో అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుదారులు తప్ప మిగతా వారందరికీ రూపాయికి కిలో వంతున ఒక్కొక్కరికీ 6 కిలోల బియ్యం సరఫరా చేసేవారు. లాక్‌డౌన్‌ విధించిన తరువాత మొదటి మూడు నెలల పాటు ప్రతినెలా ఒక్కొక్కరికీ 12 కిలోల వంతున బియ్యం ఉచితంగా పంపిణీ చేయగా, జూలై నుంచి ఒక్కొక్కరికీ 10 కిలోల వంతున జిల్లాలో ప్రతినెలా 11 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఉచితంగా సరఫరా చేస్తూ వచ్చారు. 


రూపాయికి కిలో బియ్యం..

కరోనా కారణంగా పేద ప్రజల ఆదాయం తగ్గిపోయిన నేపథ్యంలో ఉచిత బియ్యం పంపిణీ కొనసాగించాలన్న డిమాండ్‌ వస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో డిసెంబరు నుంచి రేషన్‌కార్డుదారులకు ఇంతకుముందు మాదిరిగానే రూపాయికి కిలో వంతున ఒక్కొక్కరికీ నెలకు ఆరు కిలోల బియ్యం సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేషన్‌ కోసం డీలర్లు డీడీలు చెల్లించాలని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు రేషన్‌ కేటాయింపు సమాచారం రాగానే డీడీలు చెల్లించే విధంగా పౌర సరఫరాల శాఖ అధికారులు డీలర్లను అప్రమత్తం చేశారు. 

వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 2,35,001 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఆహార భద్రత కార్డులు 2,08,250, అంత్యోదయ కార్డులు 26,712, అన్న పూర్ణ కార్డులు 38 ఉన్నాయి. జిల్లాలో 588 రేషన్‌ దుకాణాలు ఉండగా, లాక్‌డౌన్‌ కంటే ముందు ప్రతినెలా 5,665.292 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 26,712 కిలోల చక్కెర రేషన్‌ దుకాణాల ద్వారా రేషన్‌దార్డుదారులకు సరఫరా చేసేవారు. ఈనెల నుంచి ఆహార భద్రతకార్డుదారుల్లో ఒక్కో కుటుంబం కార్డులో నమోదైన ఒక్కో లబ్ధిదారుడికి కిలోకు రూపాయి వంతున ఆరు కిలోల బియ్యం సరఫరా చేయనున్నారు. అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు 35 కిలోల బియ్యంతోపాటు కిలో చక్కెర పంపిణీ చేస్తారు. అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు. లాక్‌డౌన్‌ కంటే ముందు పేదలకు ఏ విధంగా రేషన్‌ సరఫరా చేస్తూ వచ్చారో అదే విధంగా డిసెంబరు నెల నుంచి పంపిణీ చేసేలా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


ఉచిత బియ్యం పథకం కొనసాగించాలి..

కరోనా వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని కొనసాగించాలనే డిమాండ్‌ వస్తోంది.  ఎనిమిది నెలలుగా ఉచితంగా పంపిణీ చేసిన బియ్యం పథకాన్ని   పేద ప్రజల సంక్షేమం పరిగణనలోకి తీసుకుని మరికొంత కాలం కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. కరోనా లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన పేద ప్రజల జీవితాలు ఇంకా కుదురుకోలేదని, వారి ఆర్థిక పరిస్థితి యథాస్థితి వచ్చేంత వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-12-03T05:12:09+05:30 IST