గుట్టుగా.. గట్టు దాటి.. నల్ల బజారుకు తెల్ల బియ్యం!

ABN , First Publish Date - 2020-12-21T05:41:07+05:30 IST

రేషన్‌ మాఫియాకి జిల్లా పెట్టింది పేరు... ఎన్ని చర్యలు తీసుకొంటున్నా ప్రతీ నెలా రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిపోతూనే ఉన్నది.

గుట్టుగా.. గట్టు దాటి..  నల్ల బజారుకు తెల్ల బియ్యం!

 చెలరేగిపోతున్న అక్రమ రవాణాదారులు 

పలు దారుల్లో బ్లాక్‌ మార్కెట్‌కు..

అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌

మాఫియా ఆట కట్టించేనా..?


 జిల్లాలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా మాఫియాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. పల్నాడు ప్రాంతంలో అయితే పట్టపగలే రేషన్‌ బియ్యం జిల్లా దాటిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు, విజిలెన్స్‌, తూనికలు కొలతలు, పౌరసరఫరాలు, రవాణ శాఖల నుంచి ఒక్కో అధికారితో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందం ఎంతవరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి..!

 

 ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, డిసెంబరు 20: రేషన్‌ మాఫియాకి జిల్లా పెట్టింది పేరు...  ఎన్ని చర్యలు తీసుకొంటున్నా ప్రతీ నెలా రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిపోతూనే ఉన్నది. ఇందుకు నిదర్శనం పోలీసులు పట్టుకొంటున్న వాహనాలే...! ఇలా సీజ్‌ చేసిన సంఘటనల్లో బాధ్యులపై 6ఏ కేసులు పెడుతున్నారు. వాటి నుంచి ఎంతో సులభంగా నిందితులు తప్పించుకొంటున్నారు.  రేషన్‌ బియ్యం పక్కదారి పట్టించడం పలు రూపాల్లో జరుగుతోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నేరుగా మాఫియాకి అందిస్తుంటారు. అలానే చాలామంది బియ్యం తీసుకోకుండా డీలర్ల వద్ద కేజీకి రూ.ఏడు, ఎనిమిది తీసుకొంటారు. ఆ బియ్యాన్ని కొంతమంది వ్యక్తులు డీలర్ల వద్ద సేకరించి మాఫియాకి అమ్ముతుంటారు. తూకంలోనూ మోసం చేసి బియ్యం మిగిల్చి వాటిని బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ నెల నుంచి నెలకు రెండుసార్లు బియ్యం ఇస్తుండటంతో అక్రమ వ్యాపారం రెట్టింపు అయింది.


మాఫియా పై దృష్టి..!

రేషన్‌ మాఫియాపై జిల్లాలో కఠిన చర్యలు చేపట్టేందుకు వీలుగా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ దృష్టి సారించారు. ఈ చర్య ఏమాత్రం సఫలం అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసు, విజిలెన్స్‌, తూనికలు కొలతలు, పౌరసరఫరాలు, రవాణ శాఖల నుంచి ఒక్కో అధికారితో టాస్క్‌ఫోర్సు బృందాలను ఏర్పాటు చేశారు. రేషన్‌ మాఫియాకి అండదండలు అందించేది స్వయానా పౌరసరఫరాల శాఖకు చెందిన కొంతమంది ఉద్యోగులే అనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది డీటీలు డీలర్లతో చేతులు కలిపి ప్రతీ నెలా పక్కదారి పట్టిస్తుంటారు. అడపాదడపాగా సీఎస్‌డీటీలు దాడులు చేస్తుంటారు. వీరికి పైఅధికారుల నుంచి ఇండెంట్లు ఉంటాయి. దాంతో ఫోకల్‌ పాయింట్లలో కొనసాగుతుంటారు. వీళ్ల అక్రమాలు గురించి తెలిసినా అధికారులు పెద్దగా పట్టించుకోరు. బదిలీలు కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉంటారు. ఒకవేళ చేసినా ప్రజాప్రతినిధులు ఒత్తిడితో అవి నిలిపేయాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమౌతాయి. పలు ప్రాంతాల్లో వారిపైనే ఆరోపణలు ఉండగా టాస్క్‌ఫోర్స్‌లో చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. 


 తెనాలి నియోజకవర్గ పరిధిలో నెలలోపు మూడు చోట్ల మినీ లారీ రేషన్‌ బియ్యం లోడును పట్టుకుంటే, ఓచోట చిన్న మొత్తంలో డంప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి పట్టణంలోనే ముగ్గురు అక్రమ వ్యాపారులు ఈ రవాణాలో ఆరితేరి ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులు పట్టుకున్నా మామూళ్లు అందించి తప్పించుకున్నారు. అక్రమ రవాణాదారుల మధ్య పోటీ కారణంగానే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో దొరికినవి మినహా అధికారుల నిఘాతో పట్టుకున్నవి తక్కువే. 


 నరసరావుపేట కేంద్రంగా అక్కమార్కులు పెద్దఎత్తున డీలర్ల నుంచి బియ్యం సేకరించి బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నేతలే బ్లాక్‌ మార్కెట్‌కు సూత్రధారులుగా ఉండటం.. అధికారులపై రాజకీయ ఒత్తిడిలు పెరగడంతో వారు కన్నెత్తి చూడటం లేదు. పట్టణంలో పల్నాడు రోడ్డు, వినుకొండ రోడ్డు, పెదచెరువు కేంద్రాలుగా బియ్యం బ్లాక్‌ మార్కెట్‌ కొనసాగుతోంది. 


 బాపట్ల నియోజవకర్గంలో ఈ ఏడాది ఇప్పటివరకు పది కేసులు నమోదయ్యాయి. మిల్లర్‌లు, రేషన్‌డీలర్లు అక్రమాలు చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు తరలిస్తున్నట్లు 6ఎ కింద కేసులు నమోదు చేస్తున్నారు. 


 తాడికొండ మండలంలో రేషన్‌ బియ్యాన్ని తరలించి అక్రమార్కులు రూ.లక్షల్లో జేబులు నింపుకొంటున్నారు. సత్తెనపల్లిలో గత నెలలో పోలీసులు లారీ రేషన్‌ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేశారు. అంతకు ముందు రెండు ఆటోల్లో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని  పట్టుకున్నారు. 


 నాదెండ్ల మండలంలో అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారానికి అడ్డూ అదుపూ లేదు. సాతులూరు, గొరిజవోలు, గణపవరం గ్రామాల కేంద్రంగా అక్రమ రేషన్‌బియ్యం వ్యాపారం జోరుగా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఈనెల 12న యడ్లపాడు మండలంలోని తిమ్మాపురంలో ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన 160 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


ఇటీవల పొన్నూరు మండలం పెదపాలెం, ఆలూరు, మునిపల్లె, అర్బన్‌ పరిధిలోని నేతాజీనగర్‌లో బియ్యం తరలిస్తున్న అక్రమమార్కులను పోలీసులు పట్టుకున్నారు. పొన్నూరు నియోజకవర్గ పరిధిలో 10 నుంచి 15 మంది వరకు వ్యాపారులు ఏళ్ల తరబడి బియ్యం అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. 


 పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు కొందరు రేషన్‌ దుకాణం నుంచి బియ్యాన్ని లోడు చేయించి పగటిపూటే సరిహద్దులు దాటించేస్తున్నారు. గడిచిన ఏడాదికాలంగా పల్నాడులో రేషన్‌ బియ్యం తరలిపోతున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టిందేమీ లేదు. ఒక వేళ వాహనం వెళ్తున్నట్లు సమాచారమిచ్చినా పోలీసు, రెవెన్యూ, సివిల్‌ ససప్లయీస్‌ అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడరు. పల్నాడు నుంచి నెలకు సుమారు రూ.2కోట్లకుపైగా విలువైన రేషన్‌బియ్యం జిల్లా నుంచి దాటవేస్తున్నట్లు సమాచారం.  


 వినుకొండ పరిధిలో ఈ ఏడాది మొత్తం 10 కేసులు నమోదు కాగా వందల క్వింటాళ్ల బస్తాలను సివిల్‌, పోలీస్‌, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌, బొగ్గరం, ఊడిజర్ల, ఈపూరు గ్రామాల్లో అధికంగా రేషన్‌బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది.   


రేషన్‌ అక్రమాలు తమ దృష్టి వస్తే వెంటనే 7569166897కి వాట్సాప్‌ ద్వారా తెలియజేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-12-21T05:41:07+05:30 IST