కార్డు కష్టమే!

ABN , First Publish Date - 2020-07-06T19:07:33+05:30 IST

రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సరికొత్త నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి..

కార్డు కష్టమే!

కొత్త రేషన్‌కార్డు మంజూరు కత్తిమీద సామె

పేరు తొలగింపు ఆప్షన్‌ పూర్తిగా రద్దు

ఒంటరి వ్యక్తికి కార్డు లేనట్టే

పథకాల్లో కోత విధించేందుకేనంటూ విమర్శలు


కొమరాడ(విజయనగరం): రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సరికొత్త నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి. కొత్తగా వివాహమైన వారు.. కుటుంబాల నుంచి వేరుపడిన వారు.. ఎప్పటి నుంచో కార్డు లేనటువంటి వారు దరఖాస్తు చేసుకున్నారు. అదిగో ఇదిగో మంజూరు అంటూ ప్రకటించిన ప్రభుత్వం ఎట్టకేలకు కార్డులు అందించేందుకు ముందుకొచ్చింది. కానీ నిబంధనలు మాత్రం దరఖాస్తుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. పేరు తొలగింపు ఆప్షన్‌ తీసేయడం, ఒంటరిగా ఉన్న వారి కార్డులను రద్దు చేయడం వంటి అనేక నిబంధనలతో కొత్త రేషన్‌కార్డు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.


జిల్లాలో వేలాది మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేసిన ప్రకటనలతో వారిలో ఆశలు చిగురించాయి. ఎట్టకేలకు రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం అనుమతిచ్చినా.. నిబంధనలు చూసి కార్డు వస్తుందా రాదా అన్న అనుమానం వారిని వెంటాడుతోంది. ఇప్పటి వరకూ వివాహమైన మహిళ తన పుట్టింటి రేషన్‌కార్డులో పేరును తొలగించుకునే అవకాశం ఉండేది. వివాహమైన పురుషుడు కూడా తన అమ్మానాన్నల కార్డు నుంచి పేరును తొలగించుకుని.. భార్యాభర్తల పేరు మీద కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునేవారు. అలాంటి వారికి కొత్త రేషన్‌కార్డును ప్రభుత్వం మంజూరు చేసేది. తాజాగా రేషన్‌కార్డుల బాధ్యతను పూర్తిగా గ్రామసచివాలయాలకు అప్పగించారు. రేషన్‌కార్డుల్లో పేరు తొలగింపు ఆప్షన్‌ను తొలగించారు. కేవలం రేషన్‌కార్డులో ఉన్న వ్యక్తి మృతి చెందితేనే తొలగించేలా చేశారు.


సింగిల్‌ కార్డు లేనట్టే

వివాహమైన మహిళను పుట్టింటి వారి కార్డు నుంచి అత్తవారి కుటుంబంలోని రేషన్‌కార్డులోకి మార్పు చేసేలా విధానం తెచ్చారు. అలా మార్పు చేసిన తర్వాత అత్త, మామ, ఇద్దరూ ఉంటే కొత్తరేషన్‌కార్డుకు అవకాశం ఉంటుంది. అత్త, మామల్లో ఒకరు చనిపోయినా..ఉన్న వారితో కలసి రేషన్‌కార్డులో వీరు ఉండాలి. వీరికి కొత్త కార్డు రాదు. అంటే సింగిల్‌ రేషన్‌ కార్డు విధానాన్ని పూర్తిగా తీసేశారు. ఇది చాలా మంది తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారనుంది. తల్లి, తండ్రి ఎవరు బతికి ఉంటే వారిపేరున ఉన్నకార్డులో కొడుకు, కోడలు ఉంటారు. ఒకవేళ కొడుకు ఏదైనా నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చేసినా... లేక కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటినా వెంటనే వారికి వచ్చే వృద్ధాప్య పింఛను నిలిచిపోనుంది.


చాలా మంది కొడుకులు తమ తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని పరిస్థితి ఉంది. వృద్ధులైన తల్లులైతే వారు వంట చేసుకుని ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రత్యేక రేషన్‌కార్డు లేకపోతే వచ్చే రేషన్‌ బియ్యం కొడుకులు తీసుకుంటే వీళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. చాలా మంది వృద్ధులు ఒంటరిగా జీవనం సాగిస్తూ ప్రభుత్వ పింఛను, రేషన్‌ బియ్యంతోనే గడుపుతున్నారు. సింగిల్‌కార్డు తీసేస్తే అలాంటి వారి పరిస్థితి ఏమిటో అర్థంకాని దుస్థితి నెలకొంది. పేర్ల తొలగింపు విధానం తీసేసి షిప్ట్‌ంగ్‌ పద్ధతి తీసుకురావడంతో దరఖాస్తు చేసుకున్నవారిలో ఎంతమందికి రేషన్‌కార్డులు వస్తాయో అన్న అనుమానం నెలకొంది. 


మహిళా ఉద్యోగులకు మొండిచేయి

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇటీవల వేలాదిమంది ఉద్యోగాలు పొందారు. అందులో మహిళలు ఉన్నారు. వివాహమైన చాలామంది మహిళల పేర్లు ఇంకా పుట్టింటి రేషన్‌కార్డుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కారణంగా.. పుట్టింటి వారి రేషన్‌కార్డు తొలగించే పరిస్థితి ఏర్పడింది. పోనీ  ఆమె పేరును అత్తవారింటి కార్డులోకి షిప్ట్‌ చేస్తే అత్త, మామ ఎవరైనా వృద్ధాప్య పింఛను అందుకుంటే అది రద్దయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒంటిరిగా ఉన్నవారికి రేషన్‌కార్డులు లేకుండా చేయడం వృద్ధులైన ఇంటి పెద్దలకు ఇబ్బందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా

పేర్లు తొలగింపు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సింగిల్‌ కార్డు విధానం లేదు. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో బియ్యం కార్డు మంజూరవుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటాం.

- బి.నాగేశ్వరరావు, సీఎస్‌డీటీ, కొమరాడ


Updated Date - 2020-07-06T19:07:33+05:30 IST