ఉచిత బియ్యం.. ఈనెలా లేనట్లేనా..?

ABN , First Publish Date - 2022-05-16T06:52:29+05:30 IST

రేషన్‌కార్డుదా రులకు కేంద్రం ప్రతినెలా సరఫరా చేస్తున్న ఉచితబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. కార్డు దారులకు సత్వరం ఉచిత బియ్యాన్ని సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశిస్తున్నా గతనెల నుంచి స్టాకు లేదని కుంటిసాకులు చెబుతూ పంపిణీకి నిరాకరించడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఉచిత బియ్యం.. ఈనెలా లేనట్లేనా..?

  • కేంద్రం రేషన్‌ బియ్యానికి కొరత మాయాజాలం
  • రెండో నెలా ఉచిత బియ్యానికి మంగళం!
  • ప్రభుత్వ నిర్వాకంపై లబ్ధిదారుల అసంతృప్తి

సామర్లకోట/భానుగుడి(కాకినాడ), మే 15: రేషన్‌కార్డుదా రులకు కేంద్రం ప్రతినెలా సరఫరా చేస్తున్న ఉచితబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. కార్డు దారులకు సత్వరం ఉచిత బియ్యాన్ని సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశిస్తున్నా గతనెల నుంచి స్టాకు లేదని కుంటిసాకులు చెబుతూ పంపిణీకి నిరాకరించడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బియ్యం నిల్వల్లో కొరత ఉందని అందుకే ఉచిత బియ్యాన్ని సరఫరా చేయలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు పౌరసరఫరాశాఖ అధికారులు నుంచి అందిన సమాచారంగా తెలుస్తోంది. రెండు నెలలుగా ఉచిత బియ్యం సరఫరా కాకపోవడంతో వచ్చేనెలలో అయినా ఈ బియ్యాన్ని ఇస్తారా అనేది సందిగ్ధంగా మారింది. ఈ ప్రశ్నకు ఆయా మండల తహశీల్దార్లవద్ద కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ గోదాములనుంచి ఎప్పుడు బియ్యం నిల్వలు వస్తే అప్పుడే సరఫరా చేస్తామని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు.

విభజన సాకుతో...

కేంద్రం కరోనా తొలి దశ ప్రారంభం నుంచి కార్డుదారులకు ప్రతినెలా ఒక్కో వ్యక్తికీ నెలకు ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు నెల వరకూ పీఎంజీవై ద్వారా ఉచిత బియ్యం పంపిణీని పొడి గిస్తూ మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కోటా బియ్యంతోపాటు అదనంగా కేంద్ర ప్రభుత్వ కోటా బియ్యం ఉచితంగా పేదలకు అందాల్సి ఉంది. గతనెలలో కొత్త జిల్లాల విభజన సాకుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కోటా బియ్యాన్నే సకాలంలో పంపిణీ చేయలేకపోయారు. దీంతో ఉచిత బి య్యం పంపిణీని ఏప్రిల్‌ నెలకు వాయిదా వేశారు. ఈ ఏప్రి ల్‌, మే నెలల కోటాలు కలిపి రెండు నెలల బియ్యాన్ని పంపి ణీ చేస్తామని అధికారులు సర్ది చెబుతూ వచ్చారు. తీరా తేదీ సమీపించేసరికి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో బియ్యం నిల్వలు లేవని చెబుతున్నారు. అదేమంటే ఇక్కడ ఒకచోట మాత్రమే కాదని దేశవ్యాప్తంగా బియ్యం కొరత ఉందని ఉన్నతాధికారు లు చెబుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లాలో 6.90 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అలాంటప్పుడు రేషన్‌ బియ్యానికి ఎందు కు కొరత ఉందని చెబుతున్నారో అర్థం కావడం లేదని పలు వురు ప్రశ్నిస్తున్నారు. ఈనెలలో ఉచిత కోటా బియ్యం ఇవ్వక పోతే వచ్చేనెలలో మూడు నెలల కోటా బియ్యం ఒకేసారి సరఫరా చేయడం ఎలా సాధ్యపడుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డబుల్‌, ట్రిపుల్‌ కోటా బి య్యం సీడబ్ల్యూసీ గోదాములనుంచి ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పా యింట్లకు చేరవేసే సామర్ధ్యంగల రవాణా వ్యవస్థ మన జిల్లాలోనే కాదు మరెక్కడా లేదని జిల్లా ఉన్నతాధికారులే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండీయూలతో సమాం తరంగా రేషన్‌ దుకాణాల్లో పీఎంజీవై బియ్యం పంపిణీని ప్రారంభించాలని కార్డుదారులు కోరుతున్నారు. 

నిరాశగా వెనుదిరిగిన కార్డుదారులు

పూర్వపు తూర్పుగోదావరి జిల్లా నుంచి తాజాగా ఏర్పడిన కాకినాడ జిల్లాలో 6,43,146 రేషన్‌కార్డులపై ఒక నెల కోటాగా 9,702.92 మెట్రిక్‌ టన్నుల మేర బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. కార్డులోని ప్రతి వ్యక్తికీ నెలకు ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని అందించాల్సి ఉంది. ప్రతినెలా 15 నుంచే ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించాల్సిఉంది. దీంతో ఆదివారం జిల్లావ్యాప్తంగా ఆయా రేషన్‌దుకాణాల వద్దకు ఉచిత బియ్యం కోసం కార్డుదారులైన పేదలు చేరుకుని అక్కడ ఏమీ లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.

Updated Date - 2022-05-16T06:52:29+05:30 IST