కొవిడ్‌ పరిహారానికి రేషన కార్డు లింకు

ABN , First Publish Date - 2021-11-01T06:27:15+05:30 IST

కొవిడ్‌ పరిహారం నిబంధనలు బాధితులకు ప్రతిబంధకంగా మారాయి. అనేక మంది కరోనాతో కుటుంబ పెద్దలను పోగొట్టుకుని ఇప్పటికీ విషాదంలో కొట్టుమిట్టాడుతున్నారు.

కొవిడ్‌ పరిహారానికి రేషన కార్డు లింకు

బాధితులకు దూరమవుతున్న సాయం 

 నిబంధనలపై పెదవి విరుపు

అనంతపురం వైద్యం, అక్టోబరు31: కొవిడ్‌ పరిహారం నిబంధనలు బాధితులకు ప్రతిబంధకంగా మారాయి. అనేక మంది కరోనాతో కుటుంబ పెద్దలను పోగొట్టుకుని ఇప్పటికీ విషాదంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి సమయంలో కొవిడ్‌ మృతులకు రూ.50 వేలు సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకురావడంతో కొంత ఉపశమనం కలిగినట్లైంది. అయితే పరిహారం ఇవ్వటానికి రకరకాల నిబంధనలు పెట్టడం బాధితులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వేలాది మంది మరణించినా అధికారులు, వైద్యులు కరోనా మరణాలను తక్కువగా చూపారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో నిజంగా కరోనాతో మరణించిన వారికి సాయం అందకుండా పోతోంది. దీనికి కారణం మరణించినప్పుడు వైద్యులు కొవిడ్‌ అని రాసి నమోదు చేయాలి. కానీ ఇతరత్రా కారణాలు చూపి ఆ పేర్లతో మరణించినట్లు రికార్డుల్లో చూపించారు. ఇప్పుడు వారందరికీ కొవిడ్‌తో చనిపోయినా రూ.50 వేల సాయం అందకుండా పోతోంది. మరోవైపు జిల్లాలో 1093 మంది మరణించినట్లు అధికారులు చూపుతున్నారు. పరిహారం నిబంధనలతో వీరికి కూడా ఆర్థిక సాయం అందే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం కొవిడ్‌ బాధితులకు రేషనకార్డు లింక్‌ పెట్టడంతో చాలా మందికి సాయం దూరం కానుంది. మరణించిన వారిలో చాలా మందికి రేషన కార్డులు లేవని తెలుస్తోంది. వారందరూ దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నా రేషనకార్డు లేకపోవడంతో తిరస్కరణ అయ్యే అవకాశం ఉందని అధికారులే చెబుతున్నారు. మరోవైపు  మృతుడి ఆధార్‌, కొవిడ్‌ మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు దరఖాస్తులో స్థానిక ఆశా కార్యకర్త, ఏఎనఎం, సంతకాలు చేయించుకొని జిల్లా వైద్యాధికారితో ఆ ఫైలుపై ఆమోద ముద్ర వేయించుకోవాలి. ఇవన్నీ పూర్తి అయిన తర్వాత ఆ దరఖాస్తులను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో అందజేయాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా మంది బాధితులకు ఇబ్బందిగా కనిపిస్తోంది. స్థానిక అధికారులకే దరఖాస్తులు అందించేలా చేసి ఉంటే సమస్య ఉండేది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై డీఎంహెచఓ కామేశ్వరప్రసాద్‌ మాట్లాడుతూ ఇవి ప్రభుత్వ మార్గదర్శకాలు ఆ మేరకే దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది. రేషనకార్డు ఉన్నవారికే సాయం అందుతుందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-01T06:27:15+05:30 IST