రేషన్‌ బండి...కదలదండి!

Jun 19 2021 @ 23:38PM

మూణ్ణెళ్ల ముచ్చటగా ఎండీయూ వాహనాలు

ఇంటింటికీ రేషన్‌ పంపిణీకి విముఖత

వద్దంటున్న 46 మంది డ్రైవర్లు

మెంటాడ, జూన్‌ 19: రేషన్‌ బియ్యం అందించే ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వాహనాల జాడ కానరావడం లేదు. మూణ్ణెళ్లకే డ్రైవర్లు వాటిని వదిలేస్తున్నారు. నడపడానికి ఇష్టపడడం లేదు. వీటివల్ల ప్రయోజనం లేకపోగా అదనపు కష్టాలు ఎదురవుతున్నాయంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటింటికీ రేషన్‌ అంటూ ఈ వాహనాలు తీసుకొచ్చింది. రేషన్‌ తీసుకోవడం మరింత సులువు అవుతుందని చెప్పుకొచ్చింది. ఆచరణలో కథ మళ్లీ మొదటికే వచ్చింది. రేషన్‌ డిపోల వద్దే ఎప్పటిలా కార్డుదారులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. మొదటి రెండు నెలలు ఎలాగోలా నెట్టుకొచ్చిన వాహనాల డ్రైవర్లు చేతిచమురు వదులుతోందంటూ విధుల నుంచి ఒక్కొక్కరు వైదొలుగుతున్నారు. విధుల్లో చేరే ముందు ప్రభుత్వానికి రూ.65వేలు డిపాజిట్‌ చేసిన డ్రైవర్లు ఆ మొత్తం వెనక్కి రాక ఇబ్బంది పడుతున్నారు. వాహన డ్యామేజ్‌కు తమ డిపాజిట్ల నుంచి కోత విధిస్తుండడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. దీనివల్ల పథకం ప్రజల్లో మరింత అభాసుపాలవుతోంది. జిల్లాలో 480 ఎండీయూలు ఉన్నాయి. అందులో 46 మంది డ్రైవర్లు స్వచ్ఛందంగా వైదొలిగారు. తొలి నెలలో రేషన్‌ డిపో నుంచి బియ్యం లోడ్‌ చేసి తమకు నచ్చిన చోట వాహనాన్ని ఉంచి దగ్గర్లోని వారందరినీ అక్కడకు రప్పించుకొని బియ్యం పంపిణీ చేశారు. ఆ తర్వాత నెలలో రెండు మూడు వీధులకు ఒకచోట సరుకులు పంపిణీ చేయడం మొదలుబెట్టారు. దీంతో వాహనం వద్ద కార్డుదారులు బారులు తీరారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్‌ అందిన దాఖలాలు లేవు. తర్వాత నెలకొచ్చేసరికి సీను రేషన్‌ డిపోకు మారింది. డిపో ముందు వాహనం నిలిపి పంపిణీ మాత్రం ఎప్పటిలా అక్కడి నుంచే చేపట్టడంతో ప్రజలు అవాక్కయ్యారు. క్రమంగా పంపిణీ పూర్వ స్థితికి చేరింది. డిపోల నుంచే పంపిణీ జరుగుతోంది. ఎప్పటిలాగే ప్రజలంతా అక్కడికే వెళతున్నారు.

వాహనాలకు రాం..రాం..

ఈ పథకం పట్ల వాహన సిబ్బంది పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో వాహనం కోసం నెలకు రూ.21 వేల వంతున అందజేస్తోంది. ఇందులో వాహనదారునికి 10 వేలు, సహాయకుడికి 5 వేలు, డీజిల్‌ ఖర్చులకు మూడువేలు, వాహనం ఇన్సూరెన్స్‌కు మూడువేల వంతున నిర్ణయించింది. ఐదు వేల రూపాయలుకు ఈ సేవ చేయలేమని సహాయకులు కొన్ని మండలాల్లో ఇప్పటికే చేతులెత్తేశారు. ఇక కొన్ని చోట్ల వాహన డ్రైవర్లు కూడా రాంరాం చెప్పేశారు. బస్తాకు కేజీనుంచి కేజిన్నర వరకు తరుగు వస్తుండడం, ఆ భారం తమపై పడడంతో వారు బెదిరిపోయి మొహం చాటేస్తున్నారు. దీంతో వినియోగదారులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు డిపోల నుంచే పంపిణీ కానిచ్చేస్తున్నారు. నిజానికి ఇంటింటికీ రేషన్‌ అని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకున్నప్పటికీ ప్రజల్లో మాత్రం మొదటి నుంచి అంతగా స్పందన లేదు. వాహనం వచ్చే సమయానికి తాము అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏమిటన్న సంశయం వెంటాడింది. అలాగే వాహనం వచ్చే సమయానికి చేతిలో డబ్బులు లేకపోతే ఇరుగుపొరుగు వద్ద చులకన అవుతామని లోలోపల ఆందోళన ఉండేది. ఒక్క మెంటాడ మండలంలోనే ముగ్గురు వాహనదారులు స్వచ్ఛందంగా వైదొలిగారు. జిల్లాలోని పలు మండలాల నుంచి 46 మంది వద్దని చెప్పేశారు. దీంతో ఆయాచోట్ల పాత పద్ధతిలోనే సరుకుల పంపిణీ జరుగుతోంది. రేషన్‌ కష్టాలు రెండు నెలలు తిరక్కుండానే మొదటికి రావడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 

సజావుగా రేషన్‌ పంపిణీ

జిల్లాలో 480 ఎండీయు వాహనాలు ఉన్నాయి. పథకం ప్రారంభించడానికి ముందు పూర్తిస్థాయిలో నియమించాం. వారిలో 46 మంది డ్రైవర్లు వివిధ కారణాల వల్ల మానేశారు. కొత్తగా 36 మందిని నియమించాం. ఇంటింటికీ బియ్యం సరఫరా అనుకున్న విధంగానే సాగుతోంది. కొన్నిచోట్ల చిన్నపాటి సమస్యలుంటే ఉండొచ్చు. డ్రైవర్లు మానేస్తే, కొత్తవారిని నియమించేవరకు పాతవారే బాధ్యత వహించాలి. వాహన డ్యామేజ్‌ను డిపాజిట్‌ నుంచి మినహాయిస్తాం.

-  పాపారావు, జిల్లా పౌరసరఫరాల అధికారిFollow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.