అన్నం ముద్దకు ‘ముద్ర’ అడ్డు

ABN , First Publish Date - 2021-04-14T05:40:02+05:30 IST

పౌరసరఫరాల శాఖలో ఎన్ని కొత్త పద్ధతులను ప్రవేశపెట్టినా.. వేలిముద్రలు పడని వృద్ధులకు మాత్రం రేషన్‌ అందడం లేదు.

అన్నం ముద్దకు ‘ముద్ర’ అడ్డు

వేలి ముద్ర పడనివారికి రేషన్‌ కట్‌ 

హడావిడిగా వలంటీర్‌ వేలిముద్ర తొలగింపు

ఈ నెలలో నిత్యావసరాలను అందుకోలేని వృద్ధులు 

డోర్‌ డెలివరీ డ్యూటీలకు చాలా చోట్ల వలంటీర్లు డుమ్మా

పొరపాటు గుర్తించి, మళ్లీ సర్క్యులర్‌ విడుదల

అయినా మారని తీరు.. వలంటీర్ల గైర్హాజరుతో అవస్థలు 


విజయవాడ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : పౌరసరఫరాల శాఖలో ఎన్ని కొత్త పద్ధతులను ప్రవేశపెట్టినా.. వేలిముద్రలు పడని వృద్ధులకు మాత్రం రేషన్‌ అందడం లేదు. జిల్లావ్యాప్తంగా నిత్యావసరాల డోర్‌ డెలివరీ ప్రారంభించిన ఫిబ్రవరి నెలలో వేలిముద్ర పడనివారికి వలంటీర్‌ వేలిముద్ర ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇలా ప్రకటించడం బాగానే ఉన్నా.. ముందు వెనుక ఆలోచించకుండా డోర్‌ డెలివరీ విధానంలో ప్రతి కార్డుకూ వలంటీర్‌ పేరు పెట్టేశారు. ఈ విషయాన్ని ఏప్రిల్‌ నెలలో కానీ అధికారులు గుర్తించలేదు. వెంటనే వలంటీర్‌ వేలిముద్ర తొలగించారు. దీంతో ఈ నెలలో వేలిముద్రలు పడని వృద్ధులు నిత్యావసరాలను అందుకోలేకపోయారు. డోర్‌ డెలివరీ వాహనాల దగ్గరకు వెళ్లిన వృద్ధుల వేలిముద్రలు పడకపోవటంతో వారికి ఎండీయూ ఆపరేటర్లు నిత్యావసరాలను ఇవ్వటం ఆపివేస్తున్నారు. ‘ఇంతకు ముందు వరకు వేలి ముద్రలు పడకపోయినా నిత్యావసరాలు ఇచ్చారు.. ఇప్పుడెందుకు ఇవ్వడం లేదు?’ అంటూ ప్రశ్నించిన వృద్ధులపై కొందరు ఆపరేటర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు తమ చేతిలో ఏమీ లేదని తప్పించుకుంటున్నారు. గతంలో వృద్ధులకు వీఆర్వో, ఆర్‌ఐ వేలిముద్రల ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఇలాంటి వారికి వలంటీర్‌ వేలిముద్రను తప్పనిసరి చేసి ఉంటే సమస్య ఉండేది కాదు. దీంతో పాటు మరో సమస్య కూడా ఉంది. డోర్‌ డెలివరీ వాహనాల వెంట వలంటీర్లు వెళ్లాలని నిర్దేశించినా.. సగానికిపైగా వలంటీర్లు గైర్హాజరవుతున్నారు. దీంతో ఎండీయూ ఆపరేటర్లే నిత్యావసరాలను ఇస్తున్నారు. వలంటీర్ల మీద గ్రామ, వార్డు సచివాలయ అడ్మిన్ల పర్యవేక్షణ కూడా ఉండటం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇదంతా తలనొప్పిగా పరిణమించింది.


పరపతి పోతుందన్న భయంతో..  

 డోర్‌ డెలివరీ నూరు శాతం జరగాలి. గతంలో డీలర్ల ద్వారా పంపిణీ 90 - 95 శాతం జరిగేది. డోర్‌ డెలివరీ విధానంలో పంపిణీ శాతం తక్కువగా ఉండడంతో ఇందుకు వలంటీర్లను బాధ్యులను చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఇటీవలే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్‌ను జాయింట్‌ కలెక్టర్స్‌, మునిసిపల్‌ కమిషనర్స్‌, ఎంపీడీవో, డీఎల్‌పీవోలకు పంపారు. 


ఇవీ మార్గదర్శకాలు 

వలంటీర్‌ తన క్లస్టర్లో రేషన్‌ పంపిణీ చేసే సమయంలో వాహనంతో ఉండి, ఈ పోస్‌ను ఆపరేట్‌ చెయ్యాలి. వేలిముద్ర పడని వారికి ఫ్యూజన్‌ ఫింగర్‌ ప్రింట్‌ వేయాలి. రేషన్‌ అందుకొలేని వారికి తిరిగి ఎప్పుడు ఇచ్చేదీ వీఆర్వో నుంచి సమాచారం తెలుసుకుని చెప్పాలి. మ్యాపింగ్‌ జరగని కార్డుదారులను గుర్తించి, వారికి రేషన్‌ అందేలా చూడాలి. వాహనం వెళ్లినపుడు ఇంటి వద్ద లేని వారి వివరాలను నమోదు చేసి, కారణం రాసి వీఆర్వోకు అందజేయాలి. 


అయినా అదే తీరు

వలంటీర్లను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు ఇచ్చినా, వేలిముద్రను తప్పనిసరి చేసినా, క్షేత్ర స్థాయిలో మాత్రం వృద్ధులకు నిత్యావసరాలు అందడం లేదు. వలంటీర్లు చాలా మంది డోర్‌ డెలివరీకి రాకపోవటంతో వేలి ముద్రలు పడని వృద్ధులు నిత్యావసరాలను తీసుకోవటం ఇబ్బందిగానే ఉంది. 

Updated Date - 2021-04-14T05:40:02+05:30 IST