జోరుగా రేషన్‌ బియ్యం దందా

May 7 2021 @ 01:24AM
ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్న రేషన్‌ బియ్యం

 ఏమాత్రం పట్టించుకోని అధికారులు

 గతంలో పట్టుబడిన అక్రమార్కులపై చర్యలు శూన్యం

దర్శి, మే 6 : రేషన్‌ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అసలు పట్టించుకోకపోవటంతో ఆ దందా రోజురోజుకూ విస్తరిస్తోంది. అత్యంత సులువుగా నెలకు లక్షలకు లక్షలు వస్తుండడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రతి నెలా సుమారు వందలాది టన్నుల బియాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్రమార్కులకు అడ్డే లేకపోవడంతో వారు ఇతర ప్రాంతాలకూ విస్తరించారు. ఆయా ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి అమ్ముతున్నారు. గతంలో అక్రమ వ్యాపారం చేస్తూ పట్టుబడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వారికి మరింత అలుసుగా మారింది. ఆరు నెలల క్రితం జిల్లా వ్యాప్తంగా దాడులు జరిగినప్పుడు రెండు నెలల పాటు అక్రమ వ్యాపారం నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ బియ్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి.

తాజా ఘటనలు

ఇటీవల దర్శిలో, అద్దంకిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శిలో 38 బస్తాల రేషన్‌బియ్యం అక్రమంగా తరలివెళ్తుండగా బుధవారం పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ముండ్లమూరు వద్ద ఒక మిల్లులో నిల్వ ఉన్న 786 బస్తాల రేషన్‌బియాన్ని గురువారం ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని విచారిస్తుండగా బయట నుంచి మరొక లారీ రేషన్‌ బియ్యం మిల్లులోకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను చూసి బియ్యం లారీని వదిలి డ్రైవర్‌ పరారయ్యాడు. రెండు లారీల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దర్శికి రవాణా

జిల్లా వ్యాప్తంగా కొంతమంది ఏరియాను పంచుకొని రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. నియోజకవర్గంలో కొంతమంది ఇక్కడి బియ్యం కొనుగోలు చేయడంతోపాటు తాజాగా పొదిలి, మార్కాపురం, అద్దంకి, వినుకొండ ప్రాంతాల నుంచి కూడా రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి దర్శి చేరవేస్తున్నారు. ఇక్కడ మిల్లుల్లో పాలిష్‌ వేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈ వ్యాపారం నాలుగు దశలుగా జరుగుతోంది. రేషన్‌ డీలర్లు ఇంటింటికీ బియ్యం చేరవేసే నిర్వాహకులు కార్డుదారుల వద్ద రూ.10 కొనుగోలు చేస్తున్నారు. ఆ బియ్యాన్ని కొంతమంది దళారులు రూ.13 కొనుగోలు చేసి మిల్లర్లకు రూ.17 విక్రయిస్తున్నారు. మిల్లర్లు పాలిష్‌ వేసి అధిక ధరలకు ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. 

నామమాత్రపు తనిఖీలు

ప్రతి నెల రేషన్‌ బియ్యం సైక్లింగ్‌ వ్యాపారం నిరంతరం జరుగుతోంది. రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాల్సిన అధికారులు నామమాత్రం తనిఖీలు కూడా చేయటం లేదు. విజిలెన్స్‌ లేదా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేసినప్పుడు అక్రమ రేషన్‌ బియ్యం పట్టుబడుతున్నాయి. రేషన్‌బియం అక్రమంగా భారీగా తరలివెళ్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రేషన్‌ బియ్యంపై అధికారుల హైడ్రామా

పసుపుగల్లు(ముండ్లమూరు), మే 6 : రేషన్‌ బియ్యం పట్టుబడడం, అధికారపార్టీ వైసీపీ నేత ఒత్తిడితో ఆ కేసును నీరుగార్చేందుకు ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు హైడ్రామా నడిపారు. బియ్యం అక్రమ వ్యాపారంలో స్వయానే అధికార పార్టీ బడా నేతలే ఉండడంతో అధికారులు సైతం నోరుమెదపలేని పరిస్థితి. చివరకు ఎక్కడో పట్టుబడ్డ బియ్యం అని తూతూమంత్రంగా 6 ఏ కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్న సంఘటన ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లులో జరిగింది. వివరాల్లోకెళ్తే... మండలంలోని పసుపుగల్లు పంచాయతీ పరిధిలోని ఆంజనేయ బాయిల్డ్‌ రారైస్‌ మిల్లు నుంచి లారీలో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని జిల్లా అధికారులు దర్శి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు సమాచారం అందించటంతో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో వచ్చి లారీని పట్టుకున్నారు. దీంతో పాటు రెండు మినీ లారీల్లో కూడా ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీల్లో రేషన్‌ బియ్యం తరలించటానికి సిద్ధంగా ఉంచారు. 

రైస్‌ మిల్లులో 736(50కేజీలు) బస్తాల రేషన్‌ బియ్యంతో ఉన్న లారీని పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి అనంతరం మళ్లీ బాయిల్డ్‌ రైస్‌ మిల్లు వద్దకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తీసుకెళ్లారు. పెద్ద లారీతో పాటు చిన్న రెండు మినీ లారీల్లో ఉన్న రేషన్‌ బియ్యాన్ని లెక్కించారు. మొత్తం 736 రేషన్‌ బియ్యం బస్తాలుగా గుర్తించారు. ఇవి కాక రైస్‌ మిల్లులో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు ఉన్నాయి. కొంత కాలంగా బాయిల్డ్‌ రైస్‌ మిల్లు నుంచి పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లా కృష్ణ్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం.

బుధవారం రాత్రి పట్టుబడిన రేషన్‌ బియ్యం చుట్టుపక్కల ప్రాంతాల రేషన్‌ షాపు డీలర్ల నుంచి కొనుగోలు చేసి బాయిల్డ్‌ రైస్‌ మిల్లులో ఉంచి రాత్రి సమయాల్లో అక్రమంగా ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిస్తున్నట్టు విమర్శలు వినవస్తున్నాయి. పట్టుబడిన బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారు అధికార పార్టీకి చెందిన కీలక నేతలు కావటంతో గురువారం సాయంత్రానికి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుబడిన బియ్యం ఎవరివో తేల్చకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. తూతూమంత్రంగా కేసు నమోదు చేసి అధికార పార్టీ నాయకులకు సహకరించాలనే ఉద్దేశంతోనే అక్రమార్కులపై కేసు నమోదు చేయలేదు. కేవలం 6(ఏ) కింద కేసు నమోదు పట్టుబడిన బియ్యాన్ని వీఆర్‌వో సుశీలకు అప్పగించారు. లారీని ముండ్లమూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ను ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా పసుపుగల్లు బాయిల్డ్‌ రైస్‌ మిల్లు నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు తీసుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఈ దాడుల్లో దర్శి, పొదిలి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలు కే డేవిడ్‌రాజు, ఎస్‌ రామ్‌నారాయణరెడ్డి, మార్కాపురం ఏఎస్‌వో షేక్‌ ఖాదర్‌మస్తాన్‌ ఉన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.