‘ఫ్రంట్‌లైన్‌’లో లేని రేషన్‌డీలర్లు

ABN , First Publish Date - 2021-04-23T05:11:06+05:30 IST

ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న కరోనా సంక్షోభ సమయంలో ఆహారభద్రతా వ్యవస్థ ద్వారా పేదప్రజలకు నిత్యావసర వస్తువులు చేరవేయటంలో రేషన్‌ డీలర్ల పాత్ర మరువలేనిది.

‘ఫ్రంట్‌లైన్‌’లో లేని రేషన్‌డీలర్లు
రేషన్‌కోసం వచ్చిన పేదలైన వినియోగదారులు

 నిత్యం లక్షలమంది లబ్ధిదారులకు నిత్యావసరాల పంపిణీ

 కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో దక్కని ప్రాధాన్యం

 ఇప్పటికే కరోనాతో జిల్లాలో ఐదుగురు డీలర్లు మృతి

వైరా, ఏప్రిల్‌ 22: ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న కరోనా సంక్షోభ సమయంలో ఆహారభద్రతా వ్యవస్థ ద్వారా పేదప్రజలకు నిత్యావసర వస్తువులు చేరవేయటంలో రేషన్‌ డీలర్ల పాత్ర మరువలేనిది. ఏ ఇతర శాఖలకు తీసిపోని రీతిలో ఫ్రంట్‌ వారియర్స్‌గా ముందున్నారు. అలాంటి రేషన్‌డీలర్లకు వయస్సు నిబంధన లేకుండా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వం వారిని పూర్తిగా విస్మరించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 43మంది డీలర్లు ఈ కరోనా మహామ్మారితో మృత్యువాతపడ్డారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఐదుగురు డీలర్లు కరోనా కాటుకు బలయ్యారు. 


కరోనా సమయంలో వెలకట్టలేని డీలర్ల బాధ్యత


ఖమ్మంజిల్లాలో మొత్తం 669రేషన్‌దుకాణాలు ఉన్నాయి. అయితే 81మంది డీలర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 588మంది రెగ్యులర్‌ డీలర్లుగా ఉండగా ఖాళీగా ఉన్న రేషన్‌షాపుల బాధ్యతను కూడా కొంతమంది అదనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో 4,07,622మంది కార్డులు కలిగి ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఒక్కో లబ్ధిదారుడికి 12కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని, ఒక కిలో కందిపప్పును సరఫరా చేశాయి. ఓవైపున లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ డీలర్లు ప్రాణాలను పణంగా పెట్టి పేదలందరి సరుకులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ తొలగించాక హైకోర్టు ఆదేశాలతో బియ్యం పంపిణీలో అనేక మార్పులు జరిగాయి. వేలిముద్రలు తొలగించి సెల్‌ఫోన్‌లోని ఓటీపీ పద్దతిలో రేషన్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సెల్‌ఫోన్‌ లేని వారికి కంటిపాపల గుర్తింపు ఐరీస్‌ విధానం ద్వారా రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. కళ్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో డీలర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి రేషన్‌బియ్యం పంపిణీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాంటివారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


డీలర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వకపోవడం బాధాకరం: షేక్‌.జానిమియా, రేషన్‌డీలర్ల అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి


ప్రతినెలా 4.07లక్షల మంది లబ్ధిదారులకు రేషన్‌బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లకు కరోనా వ్యాక్సిన్‌ వేయకపోవడం బాధాకరం. అన్ని ప్రభుత్వ శాఖలతో సమానంగా డీలర్లు 14నెలలుగా కరోనాను లెక్కచేయకుండా పేదల ఆకలి తీర్చేందుకు కృషిచేస్తున్నారు. కానీ వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే విషయంలో ఫ్రంట్‌ వారియర్స్‌గా గుర్తించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా డీలర్లకు వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్‌ అందించాలి.


Updated Date - 2021-04-23T05:11:06+05:30 IST