రేషన్‌ కోసం.. ఎదురు చూపులు

ABN , First Publish Date - 2021-02-18T06:46:43+05:30 IST

రేషన్‌ సరుకులు డోర్‌ డెలివరీ వాహనాల రాక కోసం గుంటూరులోని పలు ప్రాంతాల్లో పేద ప్రజలు ఎదురు చూస్తోన్నారు.

రేషన్‌ కోసం..  ఎదురు చూపులు

16నే పంపిణీ అని ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు

పత్తా లేని ఎండీయూ ఆపరేటర్లు, వలంటీర్లు

సరుకులపై ఆశలు వదులుకుంటోన్న కార్డుదారులు

సాంకేతిక సమస్యలతో బియ్యం నిల్వలు డీలర్ల వద్దనే 

గుంటూరు, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరుకులు డోర్‌ డెలివరీ వాహనాల రాక కోసం గుంటూరులోని పలు ప్రాంతాల్లో పేద ప్రజలు ఎదురు చూస్తోన్నారు. ఫలాన తేదీన ఎండీయూ ఆపరేటర్‌, వలంటీర్‌ మీ ఇంటి వద్దకు వచ్చి సరుకులు డెలివరీ చేస్తారని ఫోన్లకు రెండు వారాల క్రితమే సందేశాలు వచ్చాయి. అయితే అందులో పేర్కొన్న తేదీ దాటిపోయినా ఇప్పటివరకు రేషన్‌ అందించేవారు రాకపోవడంతో కార్డుదారులు పడిగాపులు కాస్తున్నారు. వలంటీర్లు, ఎండీయూ ఆపరేటర్లకు ఫోన్లు చేస్తుంటే అసలు స్పందించడం లేదని వాపోతున్నారు. దీంతో ఈ నెల సరుకుల పంపిణీపై ఇప్పటికే చాలామంది ఆశలు వదులుకుంటున్నారు. ఈ-పోస్‌ విధానంలో సాఫీగా సాగిపోతోన్న రేషన్‌ సరుకుల పంపిణీ విధానం స్థానంలో డోర్‌ డెలివరీ తీసుకొచ్చి తమకు లేనిపోని కష్టాలు తెచ్చి పెట్టారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

10 రోజులు.. 10 లక్షల కార్డులు


ఫిబ్రవరిలో కేవలం ఇంక 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జిల్లాలో 14 లక్షల 64 వేల 126 కుటుంబాలకు రైస్‌కార్డులున్నాయి. వీటిల్లో 14 లక్షల 16 వేల 501 కార్డులను ఎండీయూ ఆపరేటర్లకు లింకు చేశారు. ఏ కారణం చేతనో 47,625 కార్డులను లింకు చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం వరకు రేషన్‌ పంపిణీ జరగలేదు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో పంపిణీ ప్రారంభం కాగా రోజుకు 60 వేల కుటుంబాలకు మించి పంపిణీ జరగడం లేదు. ఇప్పటి వరకు 3.72 లక్షల కుటుంబాలకు మాత్రమే పంపిణీ పూర్తి అయింది. ఇదిలావుంటే మిగిలివున్న 10 రోజుల వ్యవధిలో 10 లక్షల కుటుంబాలకు పైగా రేషన్‌ సరుకులు పంపిణీ జరగాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమయ్యేది కాదన్న విషయం బహిరంగ రహస్యమే. ఇదే సమయంలో మార్చి నెలకు సంబంధించి సరుకుల లిఫ్టింగ్‌ ఈ నెల 20  నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నది. ఒకపక్క పంపిణీ, మరోవైపు లిఫ్టింగ్‌ని ఏ విధంగా చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఏదైనా ఎండీయూ ఆపరేటర్‌ వద్ద పోర్టబిలిటీ తీసుకుంటే ఇక ఆ కార్డు శాశ్వతంగా ఆ ఎండీయూ ఆపరేటర్‌కే మ్యాపింగ్‌ జరుగుతుంది. దీంతో తమకు కేటాయించిన ఎండీయూ ఆపరేటర్‌ రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 

సాంకేతిక సమస్యలు ఎన్నెన్నో...


గుంటూరులో చాలామంది డీలర్ల వద్ద బియ్యం, చక్కెర, కందిపప్పు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఈ-పీడీఎస్‌లో స్టాక్‌ మైనస్‌ చూపిస్తోన్నది. దీంతో ఎండీయూ ఆపరేటర్‌ వచ్చినా డీలర్‌ సరుకులు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఈ సాంకేతిక సమస్యని సరి చేయాల్సిన ఎన్‌ఐసీ సిబ్బంది ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. కాగా ఎండీయూ ఆపరేటర్‌ను ప్రతీ ఇంటి జియో కోఆర్డినేట్స్‌తో మ్యాపింగ్‌ చేశారు. అలాంటప్పుడు వాహనం ఆ పాయింట్‌ వద్దకు వెళ్లి జియో కో-ఆర్డినేట్స్‌ మ్యాపింగ్‌ జరిగితేనే డోర్‌ డెలివరీ జరగాలి. అలాంటిది ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ ఎండీయూ ఆపరేటర్‌ వాహనం నిలిపి అక్కడికి వచ్చిన వారికి సరుకులు ఇస్తోన్నారు. 


Updated Date - 2021-02-18T06:46:43+05:30 IST