ఉచిత బియ్యం తూచ్‌..!

Published: Tue, 28 Jun 2022 03:39:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉచిత బియ్యం తూచ్‌..!

  • రూ.2,205 కోట్ల విలువైన రేషన్‌  ఎగవేత
  • మూడు నెలలుగా ఉచిత బియ్యం నిలిపివేత
  • కేంద్రం పొడిగించినా పట్టించుకోని సర్కారు
  • ఫలితంగా పేదలకు మూడు కోటాలు నష్టం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఉచిత కోటా బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ప్రతినెలా రెగ్యులర్‌గా ఇచ్చే బియ్యంతో పాటు అదనంగా ఒక్కొక్కరికీ 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇస్తున్నారు. రెగ్యులర్‌ కోటా బియ్యంలో రాయితీ ఇస్తూనే ఉచిత కోటాను పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఈ పంపిణీ జరుగుతోంది. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇతర నిత్యావసరాల ధరలు పెరగడం, కరోనా సమయంలో పేదలు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా నష్టపోవడంతో ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి వరకూ ఉచిత కోటా పంపిణీ చేసిన వైసీపీ ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి ఆపేసింది. తొలుత సరైన కారణం లేకుండానే నిలిపివేసిన ప్రభుత్వం, కొద్దికాలానికి కేంద్రంపై ఎదురుదాడి మొదలుపెట్టింది. 


మొత్తం కేంద్రమే ఇస్తే..

రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్‌ కార్డులున్నాయి. వాటిలో 4.2 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వీటిలో 90 లక్షల కార్డులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, వాటికి రాయితీ ఇస్తోంది. చాలాకాలంగా అవే కార్డులను కేంద్రం పరిగణలోకి తీసుకుంటోంది. కానీ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎడాపెడా రేషన్‌ కార్డులు పంపిణీ చేసుకున్నాయి. అలా సొంతంగా ఇచ్చుకున్న కార్డులకు, కేంద్రం గుర్తించిన కార్డులకు కలిపి రెగ్యులర్‌గా బియ్యం, ఇతర సరుకులు రాయితీపై పంపిణీ చేస్తున్నారు. కేంద్రం తాను గుర్తించిన 90 లక్షల కార్డులకు ఇచ్చే బియ్యానికి రాయితీ ఇస్తుంటే, మిగిలిన 55 లక్షల కార్డుల భారాన్ని రాష్ట్రం భరిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా కేంద్రం రెగ్యులర్‌ కోటాతో పాటు ఉచిత కోటాను తీసుకురావడంతో రాష్ట్రంపై భారం పెరిగింది. ఈ భారాన్ని భరించడం తమవల్ల కాదని రాష్ట్రం వాదిస్తోంది. ఉచిత కోటాలోనూ 90లక్షల కార్డులకు కేంద్రం బియ్యం ఇస్తోంది. మిగిలిన 55లక్షల కార్డుల భారాన్ని రాష్ట్రం భరిస్తే ఎప్పటిలాగే ఉచిత కోటా ఇవ్వొచ్చు. కానీ అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం... అసలు కేంద్రం మొత్తం 1.45 కోట్ల కార్డులను గుర్తించాలని కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఇప్పుడు ఏకంగా పంపిణీనే ఆపేసి ఇస్తారా? లేదా? అంటూ కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది. మొత్తంలో 60శాతం భారాన్ని కేంద్రం భరిస్తున్న విషయాన్ని దాచిపెట్టి, సగం మందికే భోజనం పెడతామంటే ఎలా..? అంటూ ప్రత్యారోపణలు చేస్తోంది. కేంద్రం వైఖరి వల్లే ఉచిత బియ్యాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని విచిత్ర వాదనకు దిగింది.


రేషన్‌లో ఇచ్చే బియ్యం విలువ కిలో రూ.35గా ఉంది. అందులో రూ.30 కేంద్రం, రూ.5 రాష్ట్రం భరిస్తున్నాయి. సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలుచేయలేక సార్టెక్స్‌ అనే విధానాన్ని తెచ్చింది. సార్టెక్స్‌ అంటే బియ్యంలో నూకలు వేరుచేసి, పాలిష్‌ చేయడమే. ఇందుకోసం అదనంగా కిలోపై రూపాయిన్నర ఖర్చవుతోంది. సాధారణంగా ఇచ్చే కోటాలో సార్టెక్స్‌ బియ్యం ఇస్తోన్న రాష్ట్రం... ఉచిత కోటాలో నాన్‌ సార్టెక్స్‌ ఇస్తోంది. ఎందుకంటే రూపాయిన్నర భారం తగ్గుతుంది కాబట్టి. మొన్నటివరకూ నాన్‌ సార్టెక్స్‌ నిల్వలు ఉండటంతో ఉచిత కోటా ఇచ్చి, అవి అయిపోవడంతో ఉచిత కోటానే ఆపేసింది. ప్రతినెలా ఇచ్చే 21కోట్ల కిలోల బియ్యానికి రూపాయిన్నర చొప్పున సుమారు రూ.30 కోట్లు అవుతుంది. మూడు నెలలకు రూ.90 కోట్లు అయ్యేది. కేవలం రూ.90 కోట్ల కోసం 4.2 కోట్ల మందికి ఇవ్వాల్సిన రూ.2205 కోట్ల విలువైన బియ్యాన్ని ఆపేసింది. ఉచిత కోటా నిలిపివేయడంతో మూడు నెలలకు గాను రాష్ట్రంలోని ఒక్కో పేద కుటుంబం సుమారు రూ.2100 నష్టపోయింది. 


రూ.2205 కోట్లు ఇలా...

రాష్ట్రంలోని రేషన్‌ కార్డుల్లో 4.2 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వారికి నెలకు 5కిలోల చొప్పున 21 కోట్ల కిలోలు ఇవ్వాలి. కిలో రూ.35 చొప్పున నెలకు రూ.735 కోట్లు అవుతుంది. అలా మూడు నెలలకు రూ.2205 కోట్లు కావాలి. కేంద్రం, రాష్ట్రం కార్డులను వేర్వేరుగా తీసుకుని లెక్కిస్తే... కేంద్రం గుర్తించిన 90 లక్షల కార్డులకు నెలకు రూ.472.5కోట్ల చొప్పున మూడు నెలలకు గాను రూ.1,417 కోట్లు ఇస్తుంది. ఇక రాష్ట్రం కార్డుల సంఖ్య తక్కువ కావడంతో నెలకు రూ.262.5 కోట్లు చొప్పున మూడు నెలలకు రూ.787.5 కోట్లు భరిస్తే సరిపోయేది. మొత్తం రూ.2205 కోట్లలో మూడింట రెండొంతుల భారం కేంద్రం భరిస్తున్నా రాష్ట్రం తన వాటా భరించేందుకు వెనకడుగు వేసింది.


డీలర్లకు రూ.90 కోట్లు నష్టం

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో రేషన్‌ డీలర్లు మూడు నెలలకు గాను రూ.90 కోట్ల కమీషన్‌ నష్టపోయారని రేషన్‌ డీలర్ల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు తెలిపారు. దీనివల్ల 29 వేల డీలర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇప్పటికే డోర్‌ డెలివరీ కారణంగా ఇతరత్రా సరుకులు అమ్ముకునే అవకాశానికి తాము దూరమయ్యామని, ఈ తరుణంలో ఉచిత కోటా ఆపేయడంతో అసలు రేషన్‌ షాపు వైపు చూసేవారే కరువయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఉచిత బియ్యం కోటాను పునరుద్ధరించి అటు కార్డుదారులకు, ఇటు డీలర్లకు మేలు చేయాలని ఆయన కోరారు.


కరోనా, ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం ఉచిత బియ్యం అందిస్తోంది. కానీ.. రాష్ట్రంలోని వైసీపీ సర్కారు మాత్రం.. వాటిని పేదల నోటికి అందనీయడం లేదు. వరుసగా మూడో నెల కూడా ‘ఉచితం’ తూచ్‌ అంటూ పేదోడికి నిరాశే మిగిల్చింది. ఇలా ఈ మూడు నెలల్లో అక్షరాలా రూ.2,205 కోట్ల విలువైన రేషన్‌ బియ్యాన్ని ఎగ్గొట్టింది. తమ వంతు రాయితీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ.. ‘‘సగం మందికే భోజనం పెడతామంటే ఎలా..? రాష్ట్రంలోని మొత్తం కార్డులకు పూర్తిగా కేంద్రమే బియ్యం అందించాలి’’ అనే కొత్త వాదన తెరపైకి తెచ్చింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.