రేషన్‌ ఎప్పుడో!

ABN , First Publish Date - 2021-03-01T05:00:28+05:30 IST

ఈసారి రేషన్‌ పంపిణీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. నెల గడిచినా గ్రామాల్లో 30 శాతం వరకు లబ్ధిదారులకు నేటికీ రేషన్‌ సరుకులు అందలేదు. వాటి కోసం పేదలు నిరీక్షిస్తున్నారు. ఇంటింటికీ వచ్చి రేషన్‌ సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం గత నెలలో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ)వాహనాలు అందజేసింది

రేషన్‌ ఎప్పుడో!
వాహన ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్న దృశ్యం

నెల గడిచినా లబ్ధిదారులకు చేరని సరుకులు 

పల్లెల్లో ఇంకా 30 శాతం అందని వైనం

నిరాశ చెందుతున్న కార్డుదారులు 

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 28 : ఈసారి రేషన్‌ పంపిణీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. నెల గడిచినా గ్రామాల్లో 30 శాతం వరకు లబ్ధిదారులకు నేటికీ రేషన్‌ సరుకులు అందలేదు. వాటి కోసం పేదలు నిరీక్షిస్తున్నారు. ఇంటింటికీ వచ్చి రేషన్‌ సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం గత నెలలో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ)వాహనాలు అందజేసింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు రావడంతో గ్రామాల్లో సరుకుల పంపిణీ ఆగిపోయింది. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఇచ్చారు. గ్రామాల్లో ప్రత్యేక వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీకి అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం కోర్డును ఆశ్రయించగా దీనిపై ఎస్‌ఈసీ కూడా కోర్డుకు వెళ్లింది. అయితే కొన్ని మినహాయింపులతో గత నెల 17న గ్రామాల్లో సరుకుల పంపిణీకి కోర్డు అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి రేషన్‌ పంపిణీని ప్రారంభించారు. అయినా చాలాచోట్ల కొలిక్కి రాలేదు. గ్రామాల్లో 70 శాతం కార్డుదారులకే సరుకులు అందజేశారు. గతంలో రేషన్‌ డీలర్లు ప్రతి నెలా 15వ తేదీలోగా పంపిణీ పూర్తి చేసేవారు. వాహనాల ద్వారా సరఫరా ప్రారంభించాక జాప్యం జరుగుతోంది. ఆ వాహనం అన్ని వీధుల్లో ఒకేలా తిరిగే పరిస్థితి లేదు. అలాగే అన్ని చోట్ల ఒకేలా సర్వర్‌ పని చేయడం లేదు. వెరసి లక్ష్యం పెడదారి పడుతోంది. 

జిల్లా వ్యాప్తంగా 1,407 రేషన్‌ డిపోలు ఉండగా 6లక్షలు 97 వేల రేషన్‌ కార్డులు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 97 వేల రేషన్‌ కార్డులు, గ్రామాల్లో దాదాపు 6లక్షలు కార్డులున్నాయి. వీటిల్లో  ఇప్పటి వరకూ 70 శాతం లబ్ధిదారులకే పంపిణీ చేశారు. ఇదే విషయాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి పాపారావు వద్ద ప్రస్తావించగా మున్సిపాల్టీల్లో శత శాతం సరుకులు పంపిణీ చేశామన్నారు. గత నెల 17న గ్రామాల్లో సరుకులు పంపిణీ ప్రారంభించడం వల్ల  ఫిబ్రవరి నెలకు సంబంధించి 70 శాతం పంపిణీ జరిగిందని, మిగిలిన  30 శాతం ఒకటి రెండు రోజుల్లో  పూర్తి చేస్తామని వెల్లడించారు. అందరికీ సరుకులు అందజేస్తామన్నారు. 


Updated Date - 2021-03-01T05:00:28+05:30 IST