డీలర్ల సంచుల గోల!

ABN , First Publish Date - 2021-10-27T04:59:39+05:30 IST

ఇదెక్కడ సంచుల గోల అంటూ పలువురు రేషన్‌ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు.

డీలర్ల సంచుల గోల!

సంచులు ఇచ్చినా జమకాని నగదు 

 లబోదిబోమంటున్న డీలర్లు


ఉండి, అక్టోబరు 26 : ఇదెక్కడ సంచుల గోల అంటూ పలువురు రేషన్‌ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. గత ఐదారు నెలలుగా గోనె సంచులను తిరిగి ఇవ్వాలంటూ అధికారులు ఆల్టిమేటం చేయడంతో దిక్కుతోచని స్థితిలో రేషన్‌ డీలర్లు ఉన్నారు. గతంలో ప్రభుత్వం గోనె సంచులపై డీలర్లకు అనుకూలంగా జీవో ఇచ్చిందని మొరపెట్టుకుంటున్నా వినే నాథుడే లేడంటూ డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. సివిల్‌ సప్లయిస్‌ గొడౌన్ల నుంచి సంచులతో రేషన్‌ బియ్యం వస్తే వాటిని డీలరు దింపుకుని ఖాళీ సంచులను అమ్ముకుని అద్దెలకు, పనివారికి చెల్లించేవారు. ప్రస్తుతం ప్రభుత్వం, అధికారులు డీలరు వద్ద మిగిలిన గోనె సంచులను తిరిగి గొడౌన్స్‌కు అందజేయాలని హుకుం జారీ చేయడంతో డీలర్లు అంతా ఖంగుతింటున్నారు. ఒక డీలరు  వద్ద కార్డులను బట్టి 100 నుంచి 200ల వరకూ సంచులు ఉంటాయి. ఇప్పటి వరకూ బయట మార్కెట్‌లో రూ.26లకు విక్రయించేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం సంచికి రూ.20లు అంటూ సమాచారం వచ్చింది. ఇప్పటికే చాలా మంది డీలర్లు సంచులను గొడౌన్లకు పంపించినప్పటికీ నగదు జమకాలేదు. కొంత మందికే నగదు జమయింది. అయితే సంచిని మాత్రం అప్పగించాలని ఆదేశాలివ్వడంతో ఎవరికి వారు ఖాళీ గోనె సంచులను సివిల్‌ సప్లయిస్‌ గొడౌన్స్‌కు పంపిస్తున్నారు. నిన్నటి వరకూ ఎండీయూ వాహనాలతో గోల జరిగితే. ఇప్పుడు సంచులతో గోల జరుగుతుందని పలువురు డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వ, అధికారులు ఆలోచించి డీలర్లకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2021-10-27T04:59:39+05:30 IST