ఓటీపీతో రేషన్‌

ABN , First Publish Date - 2021-01-24T05:42:52+05:30 IST

రేషన్‌ సరుకుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సరుకుల పంపిణీలో పాత విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇంత వరకు బయోమెట్రిక్‌ ద్వారా సరుకులు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇక నుంచి మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా అందజేయాలని నిర్ణయించింది. కరోనా తగ్గుముఖం పట్టే వరకు బయోమెట్రిక్‌ విధానానికి స్వస్తి పలకాలని హైకోర్టు చేసిన సూచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

ఓటీపీతో రేషన్‌

ప్రజాపంపిణీ వ్యవస్థలో స్వల్ప మార్పులు
ఫిబ్రవరి 1 నుంచి అమలుకు సన్నాహాలు
కరోనా నేపథ్యంలో పంపిణీ విధానంలో మార్పులు
‘ఆధార్‌’తో మొబైల్‌ నంబర్‌ అనుసంధానం తప్పనిసరి
మొబైల్‌ లేని వారి కోసం ఐరిష్‌ విధానం


రేషన్‌ సరుకుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సరుకుల పంపిణీలో పాత విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇంత వరకు బయోమెట్రిక్‌ ద్వారా సరుకులు పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఇక నుంచి మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా అందజేయాలని నిర్ణయించింది. కరోనా తగ్గుముఖం పట్టే వరకు బయోమెట్రిక్‌ విధానానికి స్వస్తి పలకాలని హైకోర్టు చేసిన సూచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.


జనగామ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):
రేషన్‌షాపుల ద్వారా ఫిబ్రవరి 1 నుంచి ఓటీపీ ద్వారా సరుకులు పంపిణీ చేసేందుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని జనగామ, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకే..
గత ఏడాది కరోనాకు ముందు వరకు బయోమెట్రిక్‌ ద్వారా రేషన్‌ సరుకులను డీలర్లు పంపిణీ చేసేవారు. బయోమెట్రిక్‌ ద్వారా కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ విధానాన్ని గత ఏడాది ఎత్తివేసి మ్యాన్యువల్‌గా సరుకులను పంపిణీ చేసింది. అనంతరం అక్టోబరు నెల నుంచి తిరిగి బయోమెట్రిక్‌ విధానాన్ని పునరుద్ధరించింది. బయోమెట్రిక్‌ ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కరోనా తగ్గుముఖం పట్టే వరకు బయోమెట్రిక్‌ విధానానికి స్వస్తి చెపాల్పని హైకోర్టు ఇటీవల సూచనలు చేసింది. హైకోర్టు చేసిన సూచనలతో ప్రభుత్వం తాజా విధానానికి శ్రీకారం చుట్టింది.

సరుకుల పంపిణీ విధానం ఇలా..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారానే సరుకులు ఇవ్వనున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లాల్లో అదనపు కలెక్టర్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, రేషన్‌ డీలర్లతో శుక్రవారం సమీక్షలు నిర్వహించారు. ఓటీపీ ద్వారా సరుకులు పంపిణీ చేసే విధానం, అందులో ఎదురయ్యే ఇబ్బందులు, పరిష్కారాలపై రేషన్‌ డీలర్లకు అవగాహన కల్పించారు. కొత్త విధానం ఆధారంగా రేషన్‌ కార్డులో ఉన్న ఎవరైనా కుటుంబ సభ్యుడి ఆధార్‌ కార్డుకు మొబైల్‌ నంబర్‌ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. సరుకుల కోసం రేషన్‌ దుకాణానికి వెళ్లిన సమయంలో ఆధార్‌ నంబర్‌ అనుసంధానం అయిన వ్యక్తి నంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని డీలర్‌కు చెప్తే దానిని ఎలక్ర్టానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌(ఈ-పా్‌స)లో ఎంటర్‌ చేయగానే సరుకుల పంపిణీకి అనుమతి వస్తుంది. ఈ-పా్‌సలో అనుమతి రాగానే డీలర్లు బియ్యం ఇస్తారు.

మొబైల్‌ లేని వారికి ఐరిష్‌ విధానం..

మొబైల్‌ ఫోన్లు లేని వృద్ధులు, ఒంటరి మహిళల కోసం ఐరిష్‌ విధానాన్ని ప్రభుత్వం అలాగే ఉంచింది. వారు గతంలో మాదిరిగానే కనుపాప ద్వారా రేషన్‌ సరుకులు పొందే వీలుంది. మొబైల్‌ ఫోన్‌ ఉన్న వారు కచ్చితంగా ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నంబర్‌ అనుసంధానం చాలా మందికి ఈ పాటికే ఉన్నందున ఈ విధానం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.


ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా 2310 రేషన్‌ దుకాణాలు ఉండగా.. వాటి పరిధిలో 10,90,322 రేషన్‌ కార్డులు ఉన్నాయి. జనగామ జిల్లాలో 335 దుకాణాల పరిధిలో 1,58,342 కార్డులు, వరంగల్‌ అర్బన్‌లో 459 దుకాణాల పరిధిలో 2,66,094 కార్డులు, వరంగల్‌ రూరల్‌లో 464 దుకాణాల పరిధిలో 2,19,308 కార్డులు, మహబూబాబాద్‌లో 553 దుకాణాల పరిధిలో 2,35,539 కార్డులు, ములుగులో 222 దుకాణాల పరిఽధిలో 89,630 కార్డులు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 277 దుకాణాల పరిధిలో 1,21,409 కార్డులు ఉన్నాయి.

కరోనా వ్యాప్తి చెందకుండా..
- ఎ.భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్‌, జనగామ జిల్లా

కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రస్తుతం నిలిపివేసింది. ఓటీపీ, ఐరిష్‌ ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది కార్డుదారుల ఆధార్‌ కార్డులకు మొబైల్‌ నంబర్‌ అనుసంధానమై ఉంది. అందు వల్ల ఈ విధానంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాదాపుగా 93 శాతం మంది తమ ఆధార్‌ కార్డుకు మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేసుకున్నారని తెలుస్తోంది. మిగతా వారు కూడా లింక్‌ చేసుకోవాలని సూచిస్తున్నాం.

Updated Date - 2021-01-24T05:42:52+05:30 IST