రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-10-01T06:54:21+05:30 IST

బియ్యం కార్డుదారులకు నిత్యావసర సరకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది.

రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తం
ఈ నెలలో కూడా బియ్యం పంపిణీకే పరిమితమైన ఎండీయూ వాహనాలు (ఫైల్‌ ఫొటో)

ఈ నెలలోనూ కందిపప్పు, పంచదార లేనట్టే!

గతంలో మిగిలిన స్టాకుతోనే సర్దుబాటు

ఐదు శాతం కార్డుదారులకు కూడా అందని పరిస్థితి

కందిపప్పు సరఫరాకు ముందుకురాని కాంట్రాక్టర్లు

ఇంతవరకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరని పంచదార

ప్రధాన పండుగ నెలలోనూ పేదలకు అన్యాయం


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

బియ్యం కార్డుదారులకు నిత్యావసర సరకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండుగలు వున్న అక్టోబరు నెలలో కూడా కందిపప్పు, పంచదార ఇవ్వడంలేదు. ఎప్పటి మాదిరిగానే బియ్యంతో సరిపేడుతున్నారు. పౌర సరఫరాల సంస్థ తీరుపై పేదలు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

పౌర సరఫరాల సంస్థ ద్వారా కార్డుదారులకు గతంలో ప్రతినెలా పలు రకాల నిత్యావసర సరకులు సబ్సిడీ ధరపై అందేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం, కందిపప్పు, పంచదార మాత్రమే అందజేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి కందిపప్పు, పంచదార పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. పౌర సరఫరాల సంస్థ అఽధికారులు ప్రతినెలా ఏదో ఒక కారణంతో చేతులెత్తేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 5.4 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. ప్రతి కార్డుకు అర కిలో పంచదార, కిలో కందిపప్పు పంపిణీ జరగాలి. ఈ మేరకు ప్రతినెలా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇండెంట్‌ పెడతారు. పౌర సరఫరాల సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో సరకు పంపిణీ చేస్తారు. ప్రతి కార్డుదారుడికి రాయితీపై పంచదార అరకిలో రూ.17, కందిపప్పు కిలో రూ.67కు ఇవ్వాలి. అక్టోబరు నెలకు సంబంధించి కందిపప్పు, పంచదార కోసం  సెప్టెంబరు 20నాటికే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఇండెంట్‌ పెట్టారు. కానీ ఇంతవరకు కేటాయింపులు జరగలేదు. దసరా, దీపావళి పండుగలు ఈసారి ఒకే నెలలో (అక్టోబరు) రాగా కనీసం ఈసారైన పంచదార, కందిపప్పు అందుతాయకున్న కార్డుదారులకు నిరాశే మిగిలింది.

కందిపప్పు సర్దు‘పాట్లు’

అక్టోబరు నెలకు సంబంధించి కందిపప్పు కేటాయింపు జరగలేదు. జిల్లాలో పౌరసరఫరాల సంస్థకు చెందిన ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో పాత నిల్వలు ఉంటే వాటిని సర్దుబాటు చేస్తున్నారు. అయితే ఆ నిల్వలు పది శాతం కార్డులకు కూడా చాలవని అంటున్నారు. దీంతో ఎండీయూ వాహనాలు మొదటి రెండు రోజుల్లో ఏ ప్రాంతానికి వెళితే అక్కడి కార్డుదారులకు మాత్రమే కందిపప్పు అందే అవకాశం వుందని అంటున్నారు. 

టెండర్లు దాఖలకు వెనకడుగు

చౌక డిపోలకు రాష్ట్రస్థాయిలో కందిపప్పు, పంచదార సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. ఒకవేళ వ్యాపారులు ముందుకు వచ్చి టెండర్లు దాఖలు చేసినా... అక్టోబరు నెలకు సంబంధించి కందిపప్పు, పంచదార పంపిణీ కావడం కష్టమేనని తెలిసింది. గతంలో కందిపప్పు, పంచదార సరఫరాకు టెండర్లను ఏడాదికి ఒకసారి పిలిచి కాంట్రాక్టు ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టెండర్ల ప్రక్రియను పూర్తిగా మార్చేసి, ప్రతి మూడు నెలలకు ఒకసారి టెండర్లు పిలవడం ప్రారంభించారు. ముఖ్యంగా కందిపప్పు ధరలు బహిరంగ మార్కెట్‌కు, చౌక డిపోల ద్వారా పంపిణీ చేసే వాటి ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో ప్రభుత్వం కోట్‌ చేసే ధరలకు కందిపప్పు సరఫరా చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని తెలిసింది. పండగ వేళ చౌక డిపోల్లో పంచదార, కందిపప్పు పంపిణీ కాకపోతే   బయట మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేసుకోవాల్సిందేనని కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు. కాగా అక్టోబరు నెలలో జిల్లాకు అవసరమైన పంచదార సరఫరా కోసం ఇండెంట్‌ పెట్టామని, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు ఇంకా సరకు రాలేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రసాద్‌ తెలిపారు. దీంతో పంచదార పంపిణీపైనా సందిగ్ధం నెలకొంది.

Updated Date - 2022-10-01T06:54:21+05:30 IST