గిరిజనుల ఆకలి కేకలు

ABN , First Publish Date - 2021-03-08T05:00:14+05:30 IST

రేషన్‌ బియ్యం అందక మండలంలోని గిరిపుత్రులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రతీ నెల సరుకుల కోసం ఎదురు చూడడం.. అవి అందకపోవడం జరుగుతుంది. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో నూతన రేషన్‌ విధానంపై గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనుల ఆకలి కేకలు
రేషన్‌ బండి దగ్గర పడిగపులు కాస్తున్న గిరిజన మహిళలు

రెండు నెలలుగా అందని రేషన్‌

సరుకుల కోసం తప్పని పడిగాపులు

ప్రభుత్వ తీరుపై నిరసన

హిరమండలం, మార్చి 7: రేషన్‌ బియ్యం అందక మండలంలోని గిరిపుత్రులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రతీ నెల సరుకుల కోసం ఎదురు చూడడం.. అవి అందకపోవడం జరుగుతుంది. గత రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది.   దీంతో నూతన రేషన్‌ విధానంపై  గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మర్రిగూడ, పెద్దగూడ పంచాయతీల పరిధిలోని ఎగువగూడ, పొలంగూడ, జొన్నోగిగూడ, చీడిమానుగూడ, పాండ్రమాను గూడ, పెద్దగూడ, లంగోటిగూడ తదితర గ్రామాల ప్రజలకు రేషన్‌ అందించేందుకు సంచార వాహనాన్ని ప్రభుత్వం  ఏర్పాటు చేసింది.  అయితే..  కొన్ని గ్రామాలకు రోడ్డు సదుపాయం ఉన్నప్పటీకీ  వాహనం ఎక్కే పరిస్థితి లేదు. దీంతో కొండ దిగువన  గీసరిగూడ వద్ద రేషన్‌  వాహనం నిలిపి బియ్యం, ఇతర సరకులు ఇచ్చేందుకు  సిబ్బంది సిద్ధమయ్యారు. కొండపైన గ్రామాల్లోని వారు రేషన్‌ సరుకులు తీసుకునేందుకు కిందకు రావాలని సమాచారం ఇచ్చారు.  సిబ్బంది సూచనల మేరకు కొండ దిగువకు వారు వచ్చే సరికి సర్వరు పనిచేయకపోవడం, వేలి ముద్రలు నమోదు కాకపోవడం వంటి కారణాలతో సరకులు ఇవ్వలేకపో తున్నారు.  నాలుగు రోజులుగా సుమారు 200 గిరిజన కుటుంబాలు ప్రతిరోజు ఉదయం 5గంటలకు నాలుగు కిలోమీటర్లు నడిచి రేషన్‌ వాహనం వద్దకు చేరుకొని పడిగాపులు కాస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు సరుకుల కోసం వేచి చూసి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో గిరిజనులు ప్రభుత్వ తీరుపై ఆదివారం  నిరసన తెలిపారు. రెండు నెలులగా రేషన్‌ ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. పాతపద్ధతిలో ఇంటింటికీ రేషన్‌ సరుకులు తెచ్చివ్వాలని కోరారు.


డిపో మారిపోవడంతో తిప్పలు

ఇచ్ఛాపురం : రేషన్‌ డిపో మారిపోవడంతో కార్డుదారులకు సరుకులు అందని పరిస్థితి ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో నెలకొంది. ఈ వార్డు పరిధిలోని 30 కుటుంబాలకు చెందిన బియ్యం కార్డులు రత్తకన్న  డిపోకు మారిపోయాయి. దీంతో ప్రతీనెల సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్నామని కార్డుదారులు వాపోతున్నారు.   అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ మేరకు రత్తకన్న  డిపో వద్ద ఆదివారం ఆందోళన చేశారు.  తక్షణమే తమ కార్డులను 17వ డిపోకు మార్చాలని మహిళలు కోరారు. 

  

Updated Date - 2021-03-08T05:00:14+05:30 IST